నేను సౌత్ ఇండియన్‌నే.. నాకు దక్షిణాది అంటే పిచ్చి.. ఎంతవరకైనా సరే.. అల్లు అర్జున్
దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ దూసుకెళ్తున్నాడు. మలయాళ సినీ రంగంలో బన్నీకి విశేషమైన పాపులారిటీ ఉంది. కన్నడలో కూడా ఆయనకు మంచి అభిమానగణం ఉంది. తాజాగా అల్లు అర్జున్ లవర్స్ డే ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను దక్షిణాది వాడిని అని చెప్పుకోవడానికి ఏ మాత్రం వెనుకాడనని చేసిన వ్యాఖ్యలు సినీ, ప్రముఖులు, అభిమానుల చేత చప్పట్లు కొట్టించాయి. వివరాల్లోకి వెళితే..

గతంలో అల్లు అర్జున్‌పై ట్రోల్స్
గతంలో నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా చిత్రం రిలీజ్ సమయంలో సోషల్ మీడియాలో సౌత్ ఇండియన్ స్టార్ అని ఉండటాన్ని నెటిజన్లు ట్రోల్ చేశారు. అయినా తాను విశ్వసించిన విషయాన్ని బలంగా చెప్పడానికి ఏ మాత్రం మరోసారి ఆలోచించలేదు. నేను దక్షిణాది వాడినని బలంగా చెప్పడంలో బన్నీ సఫలమయ్యాడు. తాజా లవర్స్ డే ఫంక్షన్‌లో మరోసారి తన వాక్చాతుర్యంతో ఆకట్టుకొన్నాడు.

లవర్స్ డే ఫంక్షన్‌కు ఎందుకొచ్చానంటే
లవర్స్ డే సినిమా ఫంక్షన్‌కు రావడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి భాషకు సంబంధం లేకుండా నా సినిమాలకు మలయాళంలో బ్రహ్మరథం పడుతున్నారు. అలాంటప్పుడు తెలుగులో రిలీజ్ అవుతున్న మలయాళ చిత్రం ఒరు ఆదార్ లవ్ ఆధారంగా డబ్బింగ్ అవుతున్న లవర్స్ డే సినిమా ఆడియో ఫంక్షన్‌కు రావాలని అడుగగానే ఆలోచించకుండా ఒప్పుకొన్నాను.

ప్రియా వారియర్ టీజర్ వైరల్
రెండోది ప్రియా ప్రకాశ్ వారియర్ నటించిన ఈ సినిమా టీజర్ వైరల్ అయింది. ఆ వీడియోను నేను షేర్ చేశాను. ఇటీవల కాలంలో నాకు బాగా దగ్గరైన టీజర్ అది. అందులోనూ అంతా కొత్తవారే నటించారు. రిలీజ్‌కు ముందే జాతీయవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన సినిమా ఫంక్షన్‌కు హాజరుకావడంలో తప్పేమీ లేదనిపించింది.

వినోద్ రెడ్డికి అండగా ఉంటా
ఇక లవర్స్ డే సినిమాను సమర్పిస్తున్న వినోద్ రెడ్డి నా అభిమాని. అంతేకాకుండా నా సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసిన వ్యక్తి. నా పేరు సూర్య పంపిణీ చేసి నష్టపోయిన పంపిణీదారుడు. నష్టం వచ్చినా గానీ ఏ మాత్రం మాపై ఎలాంటి ఒత్తిడి చేయని మంచి మనిషి. అప్పుడే వినోద్ రెడ్డికి అండగా ఉండాలని అనుకొన్నాను.

ఎంతకైనా సిద్ధమని అల్లు అర్జున్
వినోద్ రెడ్డి విషయం నాకు బన్నీ వాసు చెప్పినప్పుడు ఏదైనా సమయం గానీ, ఎలాంటి అవసరం వచ్చినా గానీ నేను ఆదుకొంటానని చెప్పాను. ఎవరైనా నా విషయంలో నష్టపోతే అతని పక్షాన నిలపడానికి ఏమాత్రం సంకోచించను. అతనికి మంచి చేయడానికి ఎంత వరకైనా పోతాను అని వినోద్ రెడ్డిని ఉద్దేశించి వేదికపై అల్లు అర్జున్ వ్యాఖ్యలు చేశారు.

నేను సౌత్ ఇండియన్‌నే
ఇక నాకు సౌత్ ఇండియా అంటే పిచ్చి. నేను సౌత్ ఇండియన్ అని చెప్పుకోవడానికి గర్వపడుతాను. ఎందుకంటే నేను పుట్టింది చెన్నై. పెరిగింది హైదరాబాద్‌లో. నా సినిమాలు ఆదరిస్తున్న వారు మలయాళీలు. నాపై కన్నడ ప్రజలు విశేషంగా ప్రేమ, ఆదరణ చూపిస్తారు. అందుకే తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలుగు రాష్ట్రాల్లంటే నాకు చెప్పలేనంత ఇష్టం. ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలనుకొన్నాను. నేను చెప్పాలనుకొన్నాను అని అల్లు అర్జున్ స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











