ఆ స్టార్ హీరోకి మరణగండం.. ముందుగానే జ్యోతిష్యురాలు హెచ్చరిక..
టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో జగపతి బాబు (Jagapathi Babu). ఈ నటుడు తన కెరీర్ ను హీరోగా మొదలుపెట్టి ఎంతో మంది ఫ్యామిలీ ఆడియన్స్ ను సంపాదించుకున్నారు. ఆ తర్వాత విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటుతున్నారు జగపతిబాబు. ఓ సినిమా షూటింగ్ సమయంలో తాను అక్షరాలా చావు అంచుల వరకూ వెళ్లానని వెల్లడించారు. అయితే.. ముందుగానే ఓ జ్యోతిష్యురాలు తనని హెచ్చరించిందట. ప్రస్తుతం ఈ స్టార్ నటుడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంతకీ ఏం జరిగిందంటే?
సీనియర్ నటుడు జగపతి బాబు.. తన కెరీర్ లో ఏడు నంది అవార్డులు అందుకున్నారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ప్రేక్షకుల మనసులు గెలుచుకోగా... రెండో ఇన్నింగ్స్‌లో అంతకంటే ఎక్కువ క్రేజ్ తో దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా లెజెండ్, శ్రీమంతుడు, రంగస్థలం, అరవింద సమేతా వీరా రాఘవ.. వంటి సినిమాల్లో పవర్‌ఫుల్ పాత్రలతో మరోసారి తన నటన సత్తాను నిరూపించారు. ముఖ్యంగా 'అరవింద సమేత'లో గొంతు కట్ అయి బతికిన విలన్ పాత్రకు ఆయన చేసిన పెర్ఫార్మెన్స్‌కు అప్పట్లో విపరీతమైన ప్రశంసలు వచ్చాయి.

ఇటీవల ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడిన జగపతిబాబు... తన జీవితంలో ఎదురైన అత్యంత భయానక అనుభవాన్ని పంచుకున్నారు. ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా తనను అండర్‌గ్రౌండ్‌లో పెట్టి, పైన మట్టి పోసి కప్పేశారట. దానిపై ఒక మండపం కూడా నిర్మించారని చెప్పారు. నిర్ణయించిన టైమ్‌కు తీయాల్సిన సీన్ కొన్ని సెకన్లు ఆలస్యం కావడంతో లోపల ఆక్సిజన్ తగ్గిపోయిందట. 'అప్పటికే నేను బ్రీతింగ్ టెక్నిక్ వాడి చాలా నెమ్మదిగా శ్వాస తీసుకుంటున్నాను. బయట నుంచి తీసేలోపు ఆలస్యం అయ్యింది. చివరకు నన్ను బయటకు తీసిన తర్వాత నేను కళ్లుతెరవడానికే టైమ్ పట్టింది. అప్పటికే అందరూ నేను చనిపోయాననుకుని ఏడుస్తున్నారు' అంటూ ఆ క్షణాలను గుర్తు చేసుకున్నారు జగపతిబాబు.
ఇక్కడే మరో షాకింగ్ విషయం కూడా చెప్పారు. అదే రోజు ఉదయం తన ఫ్యాన్, ఓ లేడీ జ్యోతిష్యురాలు ఫోన్ చేసి, 'బాగానే ఉన్నారా? జాగ్రత్తగా ఉండండి' అని చెప్పిందట. షూటింగ్‌లో జరిగిన ప్రమాదం తర్వాత ఆమె మళ్లీ కాల్ చేసి, 'మీకు మరణగండం ఉంది. ఈరోజు మీకు ఏదో ప్రమాదం జరుగుతుందేమోనని భయపడి ముందే ఫోన్ చేశాను' అని చెప్పిందట. ఈ సంఘటన తనను లోపలివరకు కుదిపేసిందని జగ్గూ భాయ్ తెలిపారు. నాకు మరణ గండం ఉందనేది ఆమెకు ఎలా తెలిసింది అనేది ఇప్పటికీ మిస్టరీ అంటూ జ్యోతిష్యం పై నమ్మకం వ్యక్తం చేశారు.
అదే సమయంలో తన తండ్రికి 1980లో జరిగిన ఓ సంచలన ఘటనను కూడా వెల్లడించారు. తన తండ్రి ఎక్కాల్సిన విమానం ప్రమాదానికి గురైందని, అందులో ప్రయాణించిన వారంతా మృతి చెందినట్టు వార్తలు వచ్చాయని చెప్పారు. ఆ వార్త విన్న వెంటనే కుటుంబమంతా షాక్‌కు గురై, తండ్రి చనిపోయారని అనుకున్నామన్నారు. కానీ కొంతసేపటికి ముంబైలోని ఓ స్నేహితుడి ద్వారా ఫోన్ రాగా, తన తండ్రి సురక్షితంగా ఉన్నారని తెలిసిందని చెప్పారు.
తర్వాత తన తండ్రి వివరించగా తాను ఎక్కాల్సిన ఫ్లైట్ ఆలస్యమవుతుందని చెప్పడంతో బోర్డింగ్ పాస్ తీసుకున్నప్పటికీ ఆ ఫ్లైట్ ఎక్కకుండా వెళ్లిపోయారని తెలిపారు. అదే విమానం తర్వాత ప్రమాదానికి గురైందని తెలిసి అందరూ షాక్ అయ్యామని అన్నారు. "ఆయన ప్రత్యేకంగా ఏం చేయలేదు... ఆయుష్షు ఉండటమే కారణం" అని జగపతిబాబు చెప్పారు. అలాగే తన తల్లి ముందుగానే జాతకం చూపించి, కొన్ని పూజలు చేయించిందని, ఆ పరిహారాల ఫలితంగానే ఆ ప్రమాదం నుంచి తండ్రి బయటపడ్డారని విశ్వసిస్తున్నానని చెప్పారు. ఇలా జ్యోతిష్యం, దైవ విశ్వాసంపై తనకున్న నమ్మకాన్ని జగపతిబాబు మరోసారి వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే.. టాలీవుడ్‌లో హ్యాండ్సమ్ హీరోగా వెలుగొందిన జగపతిబాబు... కాలక్రమేణా హీరోగా అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారి, ఇప్పుడేమో సౌత్ ఇండస్ట్రీ మొత్తం డిమాండ్ ఉన్న నటుడిగా కొనసాగుతున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ చిత్రాల్లోనూ కీలక పాత్రలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ముఖ్యంగా 'పెద్ది' అనే సినిమాలో అప్పల సూరి అనే వృద్ధుడి పాత్రలో కనిపించనుండటం మరో ఆసక్తికర అంశం. ఇప్పటికే ఆ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











