నోట్లో నుంచి రక్తం... ఎన్టీఆర్ సినిమా కోసం ప్రాణాలు పణంగా పెట్టిన నటుడు!
వెండితెరపై మెరుస్తున్న ప్రతి పాత్ర వెనుక ఓ మౌన పోరాటం ఉంటుంది. సినిమా అంటే కేవలం రంగుల ప్రపంచం కాదు.. ఆ రంగుల వెనుక ఎన్నో కష్టాలు, త్యాగాలు దాగి ఉంటాయి. అంతకు మించి కఠోర సాధన కూడా. చప్పట్ల కోసం కాదు... తమ పాత్ర చిరస్మరనీయంగా ఉండాలనే తపనతో కొత్త మంది నటులు తమ ప్రాణాలను పణంగా పెడతారు. అదే త్యాగమే మనకు రెండు గంటల మాయాజాలాన్ని అందిస్తుంది. నటనపై ఉన్న మక్కువతో వారు చేసిన సాహసాలు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.. అలా జూనియర్ ఎన్టీఆర్ సినిమా కోసం ఓ నటుడు తన నోట్లోంచి రక్తం పడుతున్న రిస్క్ చేశారంట. ఆ సినిమా ఏంటీ? ఆ నటుడు ఎవరు? ఇంతకీ ఏం చేశారంటే..?
ఆ నటుడు ఎవరో కాదు.. టాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ జగపతి బాబు.. అప్పట్లో హీరోగా ప్రేక్షకులను మెప్పించిన జగపతిబాబు.. సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అదరగొడుతూ మరో స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం 'పెద్ది' లాంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్న ఈ సీనియర్ నటుడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, 'అరవింద సమేత' జ్ఞాపకాలను పంచుకుంటూ నెటిజన్లను షాక్‌కు గురిచేశారు.

ఆ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్న 'డబ్బింగ్ సమయంలో మీ గొంతుకు సమస్య వచ్చిందట... నిజమేనా?' అన్నదానికి జగపతిబాబు అవునని స్పష్టంగా చెప్పారు. 'బసిరెడ్డి పాత్రకు కావాల్సిన గాంభీర్యం కోసం కాస్త మొరటుగా అనిపించేలా గంటలకొద్దీ, రోజులకొద్దీ డబ్బింగ్ చెప్పాను. అలా చేస్తూ ఓ సందర్భంలో నోటి నుంచి రక్తం కూడా వచ్చింది. షాకింగ్ వాయిస్ రావాలనే కసితో చేశాను. ఆ ప్రయత్నంలో అలా జరిగిపోయింది. అయినా ఆ సినిమా చేస్తున్నప్పుడు విపరీతంగా ఎంజాయ్ చేశాను. ఆ టైంలో పిచ్చి కసిమీద ఉన్నా. దానికి తగ్గట్లే త్రివిక్రమ్ కూడా అదరగొట్టేశాడు' అంటూ అప్పటి అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.
అంతేకాదు... క్లైమాక్స్ గురించి కూడా ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. మొదట రెగ్యులర్ ఫైట్‌తోనే క్లైమాక్స్ ప్లాన్ చేశారని, షూటింగ్‌లో బ్రేక్ రావడంతో 'ఈ క్లైమాక్స్‌లేంటి... బోర్ కొడుతోంది.. నువ్వైనా మార్చవయ్యా' అని త్రివిక్రమ్‌ను సరదాగా అడిగానని చెప్పారు. దాంతో డైరెక్షన్ టీమ్, ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ కలిసి డిస్కషన్ పెట్టి... రెండు రోజుల్లోనే క్లైమాక్స్‌ను పూర్తిగా మార్చేశారని వెల్లడించారు. 'చివరికి అదరగొట్టేశారు' అని ప్రశంసల వర్షం కురిపించారు.
జూనియర్ ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్‌లో 2018లో విడుదలైన 'అరవింద సమేత' పేరుకే మాస్ యాక్షన్ మూవీ అయినప్పటికీ... డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని సూపర్ హిట్‌గా నిలిచింది. ఇందులో జగపతిబాబు పోషించిన బసిరెడ్డి పాత్ర ప్రత్యేకంగా గుర్తుండిపోయింది. ముఖ్యంగా 'మచ్చల పులి గాండ్రిస్తే ఎట్టా ఉంటదో తెలుసా?' అనే డైలాగ్‌కి ఇప్పటికీ సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఆ వాయిస్ వెనుక ఇంత త్యాగం ఉందని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
పాత్రలోని గంభీరత కోసం గొంతును బేస్ చేసి మాట్లాడటంతో షూటింగ్ సమయంలో నోటి నుంచి రక్తం వచ్చేదని, అయినా నొప్పిని భరించి షూటింగ్ పూర్తి చేశారని జగపతిబాబు చెప్పడం అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది. సినిమా పూర్తయ్యాక కూడా ఆ వాయిస్ ప్రభావం కొంతకాలం ఆరోగ్యంపై పడిందంటే... నటన పట్ల ఆయనకు ఉన్న మక్కువ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది.


Click it and Unblock the Notifications











