Election Counting Day: 6 రోజులే ఇంకా.. మీ సంగతి చూస్తా.. పవన్ కల్యాణ్ వార్నింగ్ వీడియో
ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్రంగానే జరిగాయి. సీఎం వైఎస్ జగన్‌తో పవన్ నేరుగా ఢీకొన్నారు. గత ఎన్నికల్లో మాదిరిగా కాకుండా ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకూడదనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ, బీజేపీలతో కలిసి కూటమిగా ఏర్పడ్డారు పవన్. తనకు ఎక్కువ సీట్లు డిమాండ్ చేసే అవకాశం వున్నప్పటికీ జగన్‌ను ఓడించడమే లక్ష్యంగా ఇచ్చిన సీట్లలోనూ కొన్నింటిని వదులుకున్నారు.
కూటమి అభ్యర్ధుల విజయమే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేశారు. తన వాడి వేడి ప్రసంగాలతో వైసీపీ ప్రభుత్వ పాలనపై విరుచుకుపడ్డారు. అటు జనసేన కేడర్ సైతం తమ అధినేతకు మద్ధతుగా రంగంలోకి దిగారు. పవన్ అభిమానుల్లో మెజారిటీ యువతరం కావడంతో వీరు సోషల్ మీడియాలో విస్త్రతంగా ప్రచారం చేశారు. దీంతో చంద్రబాబు వర్సెస్ జగన్ అన్నట్లుగా కాకుండా జగన్ వర్సెస్ పవన్ అన్నట్లుగా సీన్ మారిపోయింది.

జనసేన అభ్యర్ధులతో పాటు తను కూడా ఈసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టాలనే పట్టుదలతో వ్యూహాత్మకంగా పావులు కదిపారు పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికల్లో భీమవరం, గాజువాకల నుంచి పోటీ చేసిన ఆయన రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. స్వయంగా పార్టీ అధ్యక్షుడే ఓడిపోవడం ప్రత్యర్ధులకు ఆయుధంగా మారింది. దీనిని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు పవన్‌పై సెటైర్లు వేసేవారు. అయితే పవన్ ఆ మాటలను భరిస్తూనే, శ్రేణులను యుద్ధానికి సమాయత్తం చేస్తూ వచ్చారు. కౌలు రైతులకు తన సొంత డబ్బుతో ఆర్ధిక సాయం చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చేసిన వారాహీ యాత్ర జనంలోకి బాగా వెళ్లింది.
అయితే రెండేళ్ల క్రితం జనవాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన పవన్ కళ్యాణ్‌ను పోలీసులు అడ్డుకోవడం సంచలనం సృష్టించింది. ఎక్కడికక్కడ జనసేన నేతలను అడ్డుకోవడంతో పాటు పవన్ కళ్యాణ్ బసచేసిన హోటల్ చుట్టూ భారీగా బలగాలను మోహరించారు. అంతేకాదు.. పవన్ ప్రయాణించిన మార్గంలో విద్యుత్ సరఫరాను సైతం నిలిపివేశారు. హోటల్‌కు వచ్చిన పోలీసులు స్వయంగా పవన్ కళ్యాణ్‌కు నోటీసులు అందజేశారు. విశాఖలో పోలీస్ యాక్ట్ - 30 అమల్లో ఉన్నందున ర్యాలీలకు, సభలు, సమావేశాలకు అనుమతి లేదని అందులో పేర్కొన్నారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో జనవాణిని రద్దు చేసుకోవాల్సి వచ్చింది.
ఈ ఘటన పవన్ మనసులో బలంగా నాటుకుపోయింది. అప్పటి వరకు సింగిల్‌గా పోటీ చేయాలనుకున్న పవన్ కళ్యాణ్‌ను కూటమి వైపు నడిపించింది ఈ ఘటనే అని విశ్లేషకులు అంటారు. ఆ సమయంలో తనను అడ్డుకున్న పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగంపై మండిపడిన పవన్ కళ్యాణ్.. ఇంకో ఆరు నెలలే అంటూ చేతివేళ్లు చూపిస్తూ కోపంగా ముందుకు వెళ్లిన దృశ్యం ఇప్పటికీ రాష్ట్ర ప్రజల కళ్లెదుట మెదులుతూనే ఉంది.
ఎన్నికల ఫలితాలు ఇంకా ఆరు రోజులు ఉండగా, పవన్ చూపించిన ఆరు వేళ్ల వీడియోను తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జనసేన కార్యకర్తలు నాటి వీడియోను బయటకు తీసి ఇంకో ఆరు రోజుల్లో అంతు తేలుస్తామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పవన్ ఆరు వేళ్లు చూపించడం, మరికొద్దిరోజుల్లో ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో ఈ వీడియో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











