2024 AP elections: పిఠాపురంలో పవన్ రికార్డు విజయం.. ఏకంగా అన్ని వేల ఓట్ల మెజారిటీతో!
అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్‌లోనే రాజకీయాలు రంజుగా నడుస్తుంటాయి. దీనికితోడు 2024 అసెంబ్లీ ఎన్నికల కోసం ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కూటమిగా ఏర్పడి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పోటీకి దిగిన విషయం తెలిసిందే. ఇక, ఎన్నో ఊహాగానాల నడుమ ఈరోజు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఇందులో కూటమి అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా పయనిస్తోంది. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ గెలిచారు. ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి!
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఎన్నికల ఫలితాల్లో తొలి రౌండ్ నుంచి టీడీపీ-జనసేన కూటమి మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇలా 160కి పైగా నియోజకవర్గాల్లో విజయం సాధించబోతుంది. ఈ క్రమంలోనే అందరి దృష్టినీ ఆకర్షించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయగా.. అక్కడ ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంగా గీతపై 70354 ఓట్ల తేడాతో విజయం సాధించారు. మొత్తంగా 18 రౌండ్ల పాటు జరిగిన ఈ కౌంటింగ్‌లో ఆరంభం నుంచీ పవన్ కల్యాణ్ హవాను చూపించారు. తద్వారా పిఠాపురం నియోజకవర్గం చరిత్రలోనే అత్యధిక మెజారిటీని అందుకుని గెలుపొందారు.
వాస్తవానికి పవన్ కల్యాణ్ 2019 ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేశారు. కానీ ఎక్కడా విజయాన్ని అందుకోలేకపోయారు. అయితే, ఇప్పుడు ఎన్నో అంచనాలతో పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇక్కడి ఓట్లరు మాత్రం పవన్ కల్యాణ్‌కు జై కొట్టారు. తద్వారా ఇంతటి భారీ విజయాన్ని అందించి.. అతడిని శాసనసభకు పంపించారు.


Click it and Unblock the Notifications











