ఇది క్రేజ్ అంటే : ఎన్టీఆర్ బర్త్ డే .. దుమ్మురేపిన జపాన్ అమ్మాయిలు , వీడియో వైరల్
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. అచ్చుగుద్దినట్లు అన్న నందమూరి తారక రామారావులా ఉండే ఆయన పెద్దాయన రూపంతో పాటు నటన, ఆహార్యం, వాక్చాతుర్యం ఇలా అన్నింటిని పుణికి పుచ్చుకున్నారు. నవరసాలను అద్భుతంగా పలికించగల.. పేజీలకొద్దీ డైలాగ్స్‌లో సింగిల్ టేక్‌లో చెప్పగల అరుదైన నటుల్లో ఎన్టీఆర్ ఒకరు. బాల రాముడిగా చిన్నతనంలో తానెంటో, భవిష్యత్తులో ఏం సాధించబోతున్నానో ముందే హింట్ ఇచ్చారు జూనియర్. నిన్ను చూడాలని చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్‌కు స్టూడెంట్ నెం.1, ఆది, సింహాద్రి సినిమాలు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టాయి.
కానీ తర్వాత వచ్చిన సినిమాలు వరుసగా ఫ్లాప్స్ కావడంతో ఎన్టీఆర్ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో యమదొంగ , అదుర్స్, బృందావనం సినిమాలతో బౌన్స్ బ్యాక్ అయ్యారు. కానీ మళ్లీ కెరీర్‌లో డౌన్‌ఫాల్ రావడంతో ఖచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో ఉన్న ఎన్టీఆర్‌కు పూరి జగన్నాథ్ 'టెంపర్' కథ చెప్పడం అది బ్లాక్‌బస్టర్ కావడం తెలిసిందే. టెంపర్ ఆయనను పూర్తిగా మార్చిందని సన్నిహితులు చెప్పేమాట.

కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ బాక్సాఫీస్‌పై జైత్రయాత్ర మొదలుపెట్టారు ఎన్టీఆర్. ఆ వెంనే నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవింద సమేత రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ సినిమాలతో పాన్ ఇండియా హీరోగా ఎదిగారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర, బాలీవుడ్‌లో వార్-2 సినిమాలు చేస్తున్నారు ఎన్టీఆర్.
ఎన్టీఆర్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిలో బలమైన ఫ్యాన్ బేస్ ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయనకు విదేశీయులు సైతం అభిమానులుగా మారిపోతున్నారు. అంతేకాదు సూపర్‌స్టార్ రజనీకాంత్ తర్వాత జపాన్‌లో ఆ స్థాయిలో అభిమానులున్న దక్షిణాది నటుడు ఎన్టీఆర్ మాత్రమే. జపాన్‌లో ఆయన సినిమాలను ఎంతో ఇష్టంగా చూడటమే కాదు.. ఎన్టీఆర్ డ్యాన్స్‌కు వాళ్లు ఫిదా అయిపోయారు. అంతేనా ఆయన నటించిన సినిమాల్లోని మాస్ సాంగ్స్‌ను రీ క్రియేట్ చేస్తూ వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుని మురిసిపోతుంటారు.
నేడు తమ అభిమాన నటుడి పుట్టినరోజు కావడంతో జపాన్ ఫ్యాన్స్ వెరైటీగా సెలబ్రేషన్స్ చేశారు. ఎన్టీఆర్ కటౌట్‌ను ఏర్పాటు చేసి మెడలో పూల మాల వేసి దానిపై పూల వర్షం కురిపించారు జపాన్ అమ్మాయిలు. అంతేకాదు కటౌట్‌ను మధ్యలో పెట్టి గోపికల మాదిరిగా జూనియర్ నటించిన బృందావనం సినిమాలోని '' చిన్నదో వైపు.. పెద్దదో వైపు '' పాటకు డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా , ఎన్టీఆర్ ఫ్యాన్స్ దీనిని తెగ షేర్ చేస్తున్నారు.
ఇక.. ఎన్టీఆర్‌కు పలువురు సినీ ప్రముఖులు కూడా బర్త్ డే విషెస్ తెలియజేశారు. సూపర్‌స్టార్ మహేశ్ బాబు, రాంచరణ్, అల్లు అర్జున్ , జాన్వీ కపూర్‌తో పాటు తోటి హీరోలు, నిర్మాతలు, దర్శకులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా, వ్యక్తిగతంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం ఆ ట్వీట్లు, పోస్టులు వైరల్‌గా మారుతున్నాయి.


Click it and Unblock the Notifications











