ఎప్పటికైనా జూనియర్ ఎన్టీఆరే సీఎం... టాప్ ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్
అన్న నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి మూడో తరం వారసుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు జూనియర్ ఎన్టీఆర్. నటన, డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ ఇలా అన్నింటిలో తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నారు తారక్. ఈ జనరేషన్‌లో అన్ని రసాలను అద్భుతంగా పండించగల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆర్ఆర్ఆర్‌తో గ్లోబల్ ఇమేజ్ సంపాదించిన ఎన్టీఆర్.. పాన్ ఇండియా స్టార్‌గా దూసుకెళ్తున్నారు. సినీనటుడిగా తిరుగులేని స్టార్ అనిపించుకున్న తారక్.. రాజకీయాల్లోకి రావాలని కూడా అభిమానులు కోరుకుంటున్నారు. తాజాగా సీనియర్ నిర్మాత చంటి అడ్డాల .. తారక్ రాజకీయ జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
టీడీపీకి దూరమైన ఎన్టీఆర్
తాత పెట్టిన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ తన సేవలు ఉంటాయని ప్రకటించిన తారక్.. 2009 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో తారక్ ప్రచారం చేసిన మెజారిటీ స్థానాల్లో టీడీపీ అభ్యర్ధులు విజయం సాధించారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ టీడీపీకి ఎన్టీఆర్ దూరమయ్యారు. నందమూరి కుటుంబంతో పాటు నారా కుటుంబంతోనూ తారక్‌కి గ్యాప్ పెరిగింది. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి తన మేనత్త నారా భువనేశ్వరిని వైసీపీ నేతలు అభ్యంతరకర పదజాలంతో దూషించినా ఎన్టీఆర్ సరిగా స్పందించకపోవడంతో నందమూరి - నారా కుటుంబాలు సీరియస్ అయ్యాయి. అయితే అంతకుముందు నుంచే తారక్ ఈ రెండు కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు.

ఎన్టీఆర్‌కి టీడీపీ పగ్గాలు ఇవ్వాలని డిమాండ్లు
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి వైఎస్ జగన్ విజయం సాధించడంతో ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలని సొంత పార్టీ నుంచి డిమాండ్లు వచ్చాయి. చంద్రబాబు, లోకేష్ పాల్గొనే సభలతో పాటు సినీ కార్యక్రమాల్లోనూ ఎన్టీఆర్ అభిమానులు సీఎం.. సీఎం అని నినాదాలు చేయడం అప్పట్లో కలకలం అయ్యింది. 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సారథ్యంలో టీడీపీ విజయం సాధించడంతో ప్రస్తుతానికి ఎన్టీఆర్ అభిమానులు సైలెంట్ అయినా.. ఎప్పటికైనా తెలుగుదేశం పగ్గాలు తారక్ చేతుల్లోకి వెళ్తాయని వారు భావిస్తున్నారు. భవిష్యత్తులో టీడీపీ వారసత్వం కోసం ఎన్టీఆర్ - నారా లోకేష్‌ల మధ్య పోరాటం తప్పదని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ రాజకీయరంగ ప్రవేశంపై కీలక వ్యాఖ్యలు చేశారు నిర్మాత చంటి అడ్డాల.
పదేళ్లుగా ఎన్టీఆర్‌తో మాటల్లేవు
కళా దర్శకుడిగా సినీరంగంలో అడుగుపెట్టిన చంటి అడ్డాల ఆ తర్వాత నిర్మాతగా మారి ప్రభాస్‌తో అడవి రాముడు, ఎన్టీఆర్‌తో అల్లరి రాముడు వంటి సినిమాలు తీశారు. దాదాపు 10 సినిమాలను నిర్మించి తర్వాత దూకుడు తగ్గించారు చంటి. ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ. . ఎన్టీఆర్‌తో నేను మాట్లాడి పదేళ్లకు పైనే అవుతోంది. కలవటం కూడా లేదు.. విజయనగరం దగ్గర షూటింగ్ టైంలో ఎన్టీఆర్ బర్త్ డే చేశాం. ఆ రోజు షూటింగ్‌లో ఉండగా బర్త్ డే జరిగితే.. మొత్తం యూనిట్ అందరికీ బట్టలు తెప్పించి అతని చేతుల మీదుగా పంచాం. అల్లరి రాముడికి ఆ రోజుల్లో 7 కోట్ల రూపాయల బడ్జెట్ అవ్వగా.. లాభాలే వచ్చాయి. ఆ సినిమాకు ఎన్టీఆర్‌కు 25 లక్షల రూపాయలు రెమ్యునరేషన్ ఇచ్చాం. ఆది, స్టూడెంట్ నెంబర్ 1 సినిమాలు హిట్ అయ్యాక మనతో సినిమా చేశాడు అని చంటి అడ్డాల తెలిపారు.
ఎన్టీఆర్‌ది మహర్జాతకం
అల్లరి రాముడు సినిమా చేసేటప్పుడు.. ఎన్టీఆర్‌లో ఏదో స్పార్క్ కనిపిస్తోంది. ఒకసారి జాతకం చూపిద్దామని డేట్, టైం తీసుకుని పాలకొల్లులో చూపించా.. ఇతనితో మనం సినిమా చేయొచ్చా అని అడిగా. ఇతనితో చేస్తే మన భవిష్యత్ ఏంటీ? అతనికి ఎలా ఉంటుంది? అని చూపించా. బాలయ్య బాబుతో రెండు సినిమాలు చేసి ఉండటంతో జాతకాలు నమ్మేవాడిని. బాలయ్య బాబు కూడా అన్ని టైం చూసి పెట్టేవాడు. సరేనని ఎన్టీఆర్ జాతకం చూపిస్తే ఇతనికి రాజకీయ యోగం ఉందని జ్యోతిష్యులు చెప్పారు. ఇతనికి స్టార్స్ బాగున్నాయి.. ధైర్యంగా చేయొచ్చని చెప్పారు అని చంట్టి అడ్డాల అన్నారు.
ఏనాటికైనా ఎన్టీఆర్ సీఎం
అది నాకు మైండ్‌లోనే ఉండిపోయింది.. రాజకీయ యోగం అంటే ఎన్టీఆర్ ఎప్పటికైనా సీఎం కావాల్సిందే. ఎమ్మెల్యేగా ఉండి ఉపయోగం ఏముంది? అవసరం లేదు కదా అతనికి.. ఆ యోగం ఉంది. ఇప్పుడైతే యోగంలోనే ఉన్నాడు.. సంవత్సరం మాత్రం గురువుగారు చెప్పలేదు. ఇతనికి రాజకీయ యోగం ఉందన్నారు.. సినిమాలలో ఇప్పుడు సూపర్‌స్టార్ అయిపోయాడు, నేషనల్ వైడ్ స్టార్ అయిపోయాడుగా. సినిమా ఇండస్ట్రీలో ఇతను సక్సెస్ అవుతాడా? లేదా? స్టార్‌డమ్ ఉందా ఇతనికి? మనం సినిమా చేయొచ్చా? లేదా? ఒక ముహూర్తం పెట్టండి ఏ రోజు మంచిదోనని మాత్రమే అడిగా. ఆ ముహూర్తం పెట్టే రోజున ఇతనికి రాజకీయ యోగం కూడా ఉందండి అని గురువుగారు చెప్పారు అని చంటి అడ్డాల బయటపెట్టారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఎన్టీఆర్ అభిమానులు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











