‘‘మహేష్ బాబు కలర్, హైటు ఉంటే నా రేంజి ఇంకోలా ఉండేది’’
సార్వత్రిక ఎన్నికల వేళ ఏపీలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలతో అందరినీ నవ్విస్తున్నారు. ఎన్నికల హడావుడిలో భాగంగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తున్న ఆయన అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రస్తావనతో పాటు సినీ స్టార్ల గురించి కూడా మాట్లాడుతుండటం గమనార్హం.
ఇటీవల మీడియాతో సమావేశమైన కేఏ పాల్... తన మాటల మధ్యలో సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తావన తేవడం చర్చనీయాంశం అయంది. రాజకీయాలతో సంబంధం లేని ఒక హీరో గురించి ఆయన ఎందుకు ప్రస్తావించారు? ఏ సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారో ఓ లుక్కేద్దాం...

నాకు ఉన్న ఫాలోయింగ్ చూసి ఆశ్చర్యపోయా...
ఇటీవల ఢిల్లీ వెళుతూ గన్నవరం ఎయిర్‌పోర్టులో ఆగాను. గొప్పలు చెప్పుకోకూడదు కానీ... ఒక 70 నుంచి 100 మంది నాతో సెల్ఫీలు తీసుకున్నారు. నాకున్న ఫాలోయింగ్ చూసి ఆశ్చర్యపోయాను, నన్ను చుట్టుముట్టిన అభిమానుల తాకిడికి కొద్దిలో ప్లైట్ మిస్సయ్యేది. ప్లైట్ ఎక్కిన తర్వాత మరికొంత మంది ఫోటోలు తీసుకున్నారు.. అంటూ పాల్ వ్యాఖ్యానించారు.

మహేష్ బాబులా ఉంటే నా రేంజి మరోలా ఉండేది
‘‘నేను మహేష్ బాబులాగా అందంగా, కలర్ ఉండి ఎత్తుగా ఉంటే నా రేంజి మరోలా ఉండేది అనిపించింది. మహేష్ బాబు వాళ్ల నాన్నతో కలిసి నా ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చినపుడు చాలా చిన్న పిల్లోడు'' అంటూ కెఏ పాల్ తెలిపారు.

సినీ స్టార్ల పేర్లతో పాల్ హడావుడి
తన ప్రసంగాల్లో పలు సందర్భాల్లో కెఏ పాల్ సినీ స్టార్ల ప్రస్తావన తెస్తూ... అందరూ తన ఆశీర్వాదం కోసం వచ్చినవారే అంటూ ప్రకటనలు చేస్తుండటం గమనార్హం. రామ్ గోపాల్ వర్మ కూడా వచ్చి తన కాళ్ల మీద పడి ఆశీర్వాదం తీసుకున్నాడంటూ ఆ మధ్య పాల్ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే.

మహేష్ బాబు ఫ్యాన్స్
కేఏ పాల్ వ్యాఖ్యలపై మహేష్ బాబు ఫ్యాన్స్ తమదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు. ‘‘నువ్వు మహేష్ బాబు కన్నా అందంగా ఉంటావు. నీ మేడలో నిమ్మకాయలు, ఎండుమిరపకాయల దండ వేసుకుని ఉంచుకుంటే దిష్టి తగలకుండా ఉంటుంది'' అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











