గోల్డెన్ స్పూన్‌తో పుట్టినా అలాంటి తీరే.. రాంచరణ్ గురించి సెన్సేషనల్ కామెంట్స్
మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన రామ్ చరణ్ తేజ తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు. అయితే మంచి మనసులో కూడా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు రామ్ చరణ్ తేజ. చరణ్ గతంలో చేసిన సహాయం గురించి ఇప్పుడు ఆసక్తికర విషయాలు బయట పెట్టారు సినీ నటుడు కాదంబరి కిరణ్.. బంగారు చెంచాతో పుట్టడం వేరు బంగారు మనసు కలిగి ఉండటం వేరు అంటూ ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

మనం సైతం ఫౌండేషన్ ద్వారా
తెలుగు సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడిన కాదంబరి కిరణ్ తెలుగు సినీ పరిశ్రమలో అందరికీ తలలో నాలుకలా ఉంటారు. సినీ పరిశ్రమలో ఉన్న 24 విభాగాలలో టెక్నీషియన్స్ గాని ఇతర సభ్యులు గానీ ఏదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన తాను స్థాపించిన మనం సైతం ఫౌండేషన్ ద్వారా సహాయం చేస్తూ ఉంటారు.

శంకర్ దర్శకత్వంలో
కిరణ్ వెనుక పెద్దగా ఆస్తి పాస్తులు లేవు కానీ దాతల సాయంతో ఆయన అనేక మందికి సహాయం చేస్తూ ఉంటారు. రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించిన RRR సినిమా ఇటీవల విడుదలై సూపర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో తన 15వ సినిమా చేస్తున్నారు.

స్వానుభవాన్ని
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్ యూనివర్సిటీ లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ లో తాజాగా పాల్గొన్న కాదంబరి కిరణ్ తనను చూసిన వెంటనే రామ్ చరణ్ తేజ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అని చెబుతూ తన స్వానుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

అసిస్టెంట్ డైరెక్టర్ భార్య చనిపోతే
అది కిరణ్ మాటల్లోనే ''రాంచరణ్! అందరికీ తెలిసి ఒక పెద్ద స్టార్, మెగాస్టార్ (మా అన్న) కొడుకు. కానీ నాకు తెలిసి ఒక మనసున్న మనిషి! భక్తి , ప్రేమ, గౌరవం ఇలాంటి విలువలు తెలిసిన మనిషి. సాటి మనిషిని మనిషిగా చూసే వ్యక్తిత్వం అతనిది. గతంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ భార్య చనిపోతే, ఆమె డెడ్ బాడీ తీసుకోవడానికి ఆసుపత్రికి చెల్లించడానికి డబ్బులు లేకపోతే సుకుమార్ అన్న చొరవతో రాంచరణ్ ని అడుక్కొని 2 లక్షలు తీసుకుని మనం సైతం ద్వారా ఆ కార్యక్రమం పూర్తి చేశాము.'' అని వెల్లడించారు.

బంగరు మనసుతో బతకడం వేరు
''అవికాక సుకుమార్, మనం సైతం, విజయ్ అన్న,రాము తదితరుల వద్ద 1,20,000/- పోగుచేసి చనిపోయినామె పాప(18 నెలల) పేరున FD చేయమని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇన్నిరోజుల తర్వాత నేను ఎదురు పడితే రాంచరణ్ "ఆ పాప ఎలా ఉంది కాదంబరి గారు?"అని అడిగాడు. అతని వ్యక్తిత్వానికి నాకు గుండె నిండిపోయింది. బంగరు చెంచాతో పుట్టడం వేరు, బంగరు మనసుతో బతకడం వేరు. ప్రియ చరణ్! నీకు భగవదాశీస్సులు'' అంటూ కాదంబరి కిరణ్ తన సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్నీ పంచుకున్నారు. మా రామ్ చరణ్ గొప్ప మనసు ఇదీ అని మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











