హాయ్ చెప్పి వెళ్లిపోదాం అనుకున్నా .. ఈ స్టంట్స్ నాకు తగిలించారు : ప్రభాస్
రెబల్‌స్టార్ ప్రభాస్ - మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీ ''కల్కి 2898 ఏడీ ''. జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమం మొదలుపెట్టింది. తన జీవితంలో ఓ ముఖ్యమైన వ్యక్తి రాబోతోందంటూ ప్రభాస్ పెట్టిన ఇన్‌స్టా స్టోరీతో ఎక్కడా లేని హైప్ వచ్చింది. త్వరలోనే 'బుజ్జి'ని పరిచయం చేస్తానంటూ ఆయన పేర్కొన్నారు. దీనిలో భాగంగా బుధవారం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో 'బుజ్జి' పరిచయ కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్‌కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రభాస్ ఫ్యాన్స్ హాజరయ్యారు. బుజ్జి అంటే ఎవరనే దానికి తెరదించుతూ.. అది ఒక కార్ అని దర్శకుడు నాగ్ అశ్విన్ ముందే అనౌన్స్ చేశారు. అలాగే ఈ కార్ తయారు చేయడానికి శ్రమించిన సాంకేతిక బృందాన్ని ఆయన వేదికపై పరిచయం చేశారు.
అనంతరం వేదిక వెనుక వైపు ఉన్న గోడను బద్ధలు కొట్టుకుంటూ బుజ్జి దూసుకొచ్చింది. దీనిని స్వయంగా ప్రభాస్ డ్రైవ్ చేస్తూ ఎంట్రీ ఇచ్చారు. ఈ సీన్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. ఈలలు, కేకలతో అక్కడే వున్న ప్రభాస్ ఫ్యాన్స్ మోత మోగించారు. అనంతరం రెబల్‌స్టార్ ప్రభాస్ మాట్లాడుతూ.. మా బక్క డైరెక్టర్ (నాగ్ అశ్విన్) నన్ను మూడేళ్లు బుజ్జితో టార్చర్ పెట్టాడని సరదాగా వ్యాఖ్యానించారు. నేనేదో మన డార్లింగ్స్‌కి హాయ్ చెప్పి వెళ్లిపోదామనుకుంటే.. ఈ కార్లు, ఈ ఫీట్లు ఏంటి సార్ మీరు అంటూ ప్రభాస్ నవ్వించారు.

ఈ ఈవెంట్‌కు తక్కువ మందినే అనుమతించడం, బారికేడ్స్ కట్టింది అభిమానుల భద్రత కోసమేనని చెప్పారు. ఇబ్బంది పెట్టుంటే క్షమించాలని ప్రభాస్ కోరారు. అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్‌లతో కలిసి పనిచేసే అవకాశం కల్పించిన నిర్మాత అశ్వినిదత్, డైరెక్టర్ నాగ్ అశ్విన్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. యావత్ భారతదేశం వీరిద్దరిని చూసి ఎంతో స్పూర్తిని పొందిందని.. అదృష్టవశాత్తూ వారితో కలిసి పనిచేసే అవకాశం దక్కిందని ప్రభాస్ తెలిపారు. అమితాబ్ బచ్చన్ లాంటి నటుడు భారతదేశంలో పుట్టడం మనందరికీ గర్వకారణమన్నారు.
చిన్నప్పుడు సాగర సంగమం సినిమా చూసి కమల్ హాసన్ వేసుకున్న బట్టలు కావాలని మా అమ్మని అడిగానని , అవి కుట్టించుకుని వేసుకున్నానని ప్రభాస్ గుర్తుచేశారు. ఆ సినిమాలో కమల్ హాసన్‌లా తలను అటూ ఇటూ తిప్పడం తనకు రాలేదని వెల్లడించారు. ఇలాంటి దిగ్గజాలతో కలిసి పనిచేయడం తనకు దక్కిన అదృష్టమన్నారు. దీపికా పదుకొణే ఒక సూపర్‌స్టార్ అని.. ఇంటర్నేషనల్ ఫిలిమ్స్, ఇంటర్నేషనల్ యాడ్స్ చేస్తారని.. ఆమె తన సినిమాలో నటివంచారని ప్రభాస్ చెప్పారు. దిశా పటాని ఒక హాట్ స్టార్ అని స్వప్నాదత్ ఆటపట్టిస్తూ ఉంటారని తెలిపారు.

అశ్వినిదత్‌కు ఈ వయసులోనూ సినిమా అంటే పిచ్చి అని ఆయన దగ్గర ఎంతో నేర్చువాలని ప్రశంసించారు. డబ్బంటే దత్‌కు ఏమాత్రం భయం లేదని ఇంకా ఏమైనా చేద్దామా అని అడుగుతూ ఉంటారని ప్రభాస్ చెప్పారు. 50 ఏళ్లు నిర్మాతగా ఇండస్ట్రీలో ఉన్నది అశ్వినిదత్ ఒక్కరేనని అన్నారు. తన రెండో చిత్రాన్నే ఏకంగా ఎన్టీఆర్‌తో చేశారంటే ఆయన రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చన్నారు. అశ్వినిదత్‌కు దేవుడు అందమైన ఆడపిల్లలను ఇచ్చారని, ఆయనలోని పనిచేసే తత్వమే వారికి కూడా వచ్చిందని తన సిస్టర్స్‌తోనూ వారి గురించి చెబుతానని ప్రభాస్ తెలిపారు. థియేటర్‌లో కల్కి కోసం తాను కూడా ఎదురుచూస్తున్నట్లు ఆయన వెల్లడించారు.


Click it and Unblock the Notifications











