పవన్ కల్యాణ్ మినిస్ట్రీలో శతఘ్ని! అవినీతికి సింహస్వప్నంలా నిలిచే అధికారి కోసం డిప్యూటీ సీఎం..
విపక్షనేతగా ప్రశ్నిస్తూ, ప్రజా సమస్యల కోసం పోరాటం చేస్తూ నేడు పాలకుడిగా మారారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా, ఆరు కీలక శాఖలకు మంత్రిగా పగ్గాలు అందుకున్నారు. అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనన్న విమర్శలకు తన చేతలతోనే సమాధానమిస్తూ సగర్వంగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
జనసేన పుట్టుకకు ఐదేళ్ల ముందు నుంచే ప్రజారాజ్యం పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పవన్ .. జనం బాధలను చాలా దగ్గరి నుంచి చూశారు. పేదరికంలో పుట్టి పెరిగిన ఆయనకు ఆ కష్టాలు తెలుసు. ఉద్థానం కిడ్నీ బాధితుల సమస్యలు, కౌలు రైతులు, భవన నిర్మాణ కార్మికులు, నేతల ఆత్మహత్యలకు చలించిపోయారు. ప్రభుత్వాలు సాయం చేయకున్నా, ఎవరు ఆదుకోకున్నా.. నేనున్నానంటూ తన సొంత డబ్బులు ఖర్చు చేసి వారిని ఆదుకున్నారు.

ప్రజల్లో తిరిగి .. అవమానాలు , ఛీత్కారాలు భరించి రాటుదేలిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాలకుడు. అందరిలా కాదు ఆయనొస్తే మంచి జరుగుతుందన్న ఆశ సగటు మనిషిలో ఉంది. ఈ ఐదేళ్ల కాలంలో ప్రజా సమస్యల పరిష్కారం, తాను చేయాలనుకున్న కార్యక్రమాలపై పవన్‌కు ఖచ్చితంగా ఓ ఐడియా ఉంది. అయితే పాలకుడు మంచివాడైతే చాలదు, వ్యవస్థ కూడా అలాగే ఉంటేనే చిట్టచివరన ఉన్న వర్గాలకు లబ్ధి కలుగుతుంది. ఈ విషయాన్ని గుర్తించిన పవన్ తన టీమ్‌ను రెడీ చేసుకునే పనిలో ఉన్నారు. సమర్ధులైన , ప్రతిభావంతులైన, తన ఆశయాలను నెరవేర్చే పవర్‌ఫుల్ అధికారుల కోసం డిప్యూటీ సీఎం అన్వేషిస్తున్నారు.
ఈ క్రమంలోనే యువ ఐఏఎస్ అధికారి మైలవరపు కృష్ణతేజపై పవన్ చూపు పడింది. తెలుగు వ్యక్తే అయినా కేరళ కేడర్ కావడంతో ఆయన తనకు కావాలని సీఎం చంద్రబాబుకు చెప్పడంతో .. ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాశారు. ప్రస్తుతం కేరళలోని త్రిసూర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న కృష్ణతేజను డిప్యుటేషన్‌పై ఏపీకి పంపాలని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కృష్ణ తేజ భేటీ అయ్యారు. ఈ యువ ఐఏఎస్ సొంతూరు చిలకలూరిపేట. 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన కృష్ణతేజ.. కేరళ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ సంస్థ ఎండీగా, పర్యాటక శాఖ డైరెక్టర్‌గా, ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్‌గా, అలెప్పి జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు.
ప్రత్యేకించి 2018లో కేరళను వర్షాలు, వరదాలు ముంచెత్తాయి. అప్పుడు అలెప్పి సబ్ కలెక్టర్‌గా ఉన్న కృష్ణతేజ , మంత్రి డాక్టర్ ఇసాక్‌తో కలిసి సహాయ పునరావాస కార్యక్రమాలను చురుగ్గా చేపట్టి 48 గంటల్లో 2.5 లక్షల మందిని , గోడ్డూగోదాతో సహ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. క్యాంప్‌లలో ఉన్న వారికి భోజనం, వైద్యం ఇతర కార్యక్రమాలను నిర్విఘ్నంగా అందించారు. వరదలు తగ్గుముఖం పట్టిన తర్వాత బాధితులకు ఉపాధి, నిత్యావసర వస్తువులు సమకూర్చిపెట్టడంతో జాతీయ స్థాయిలో కృష్ణతేజ పేరు మారుమోగింది.

కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన 600 మంది పిల్లల బాధ్యతలను తీసుకుని శెభాష్ అనిపించుకున్నారు.. అంతేకాదు ఏకంగా జాతీయ బాలల రక్షణ కమీషన్ అభినందనలు అందుకున్నారు. తనలో ఈ మానవత్వమే కాదు.. అక్రమార్కులకు , హద్దు మీరిన వారికి సింహస్వప్నంగానూ నిలిచారు. అలెప్పీ జిల్లాలోని వెంబనాడ్ సరస్సులో మధ్యలోని మూడెకరాల దీవిని ఆక్రమించి కట్టిన కేపీకో రిసార్ట్స్‌ను కూల్చేయాల్సిందిగా సుప్రీంకోర్ట్ ఆదేశించింది.
మహామహులు, కాకలు తీరిన ఉన్నతాధికారులే భయపడ్డ వేళ కృష్ణతేజ ఆ రిసార్ట్స్ మీదకు బుల్ డోజర్లను నడిపించారు. పై స్థాయిలో బెదిరింపులు, బుజ్జగింపులు వచ్చినా వెనక్కి తగ్గలేదు. కూల్చివేత, శిథిలాల తరలింపు ఖర్చును కూడా రిసార్ట్ ఓనర్ల నుంచే వసూలు చేసి తన తెగువ చూపించారు. ఇదొక్కటే కాదు.. ఇలాంటి ఆక్రమణలకు గురైన భూములను ఆయన ప్రభుత్వానికి చెందేలా చేశారు. కృష్ణతేజలోని టెంపర్, గట్స్‌పై జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కాయి. అలాంటి డైనమిక్ ఆఫీసర్ కాబట్టే కృష్ణతేజ తన టీమ్‌లో ఉండాలని పవన్ తాపత్రాయపడుతున్నారు. నేడో రేపో కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించగానే.. కృష్ణతేజ కేరళ నుంచి ఏపీలో దిగుతారు.


Click it and Unblock the Notifications











