Vijay Devarakonda: హాస్పిటల్‌లో చేరిన విజయ్ దేవరకొండ.. హెల్త్ కండీషన్‌పై అప్‌డేట్ ఇదే
గాడ్ ఫాదర్ లేకుండా చిత్ర పరిశ్రమలో ఎదగడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నెపోటిజం, బంధుప్రీతి సహా ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఇక్కడ నిలబడగలగాలి. వాటిని తట్టుకుని నిలదొక్కుకోవడం అంత తేలిక కాదు. ఎవరో కొద్దిమందికి మాత్రమే ఇది సాధ్యమైంది. తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, రవితేజ, నాని వంటి స్టార్స్ ఎలాంటి నేపథ్యం లేకుండా స్టార్స్‌గా ఎదిగారు. ఈ కోవలోకే వస్తారు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ.
పెళ్లిచూపులతో బ్రేక్
కెరీర్ తొలినాళ్లలో చిన్నాచితకా పాత్రలు వేసిన విజయ్ దేవరకొండకు పెళ్లిచూపులు చిత్రం తొలి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి చిత్రం విజయ్‌ని ఓవర్‌నైట్ స్టార్‌గా మార్చింది. తన మాటలు, చేతలు, వ్యక్తిత్వం, బాడీ లాంగ్వేజ్‌తో యూత్‌లో మాస్ ఫాలోయింగ్ సంపాదించారు విజయ్ దేవరకొండ. హీరోగా ఎంట్రీ ఇచ్చిన చాలా తక్కువ గ్యాప్‌లోనే స్టార్‌డమ్ అందుకున్నారు. ఏ హీరోకి సాధ్యం కాని విధంగా యువతలో అంతటి క్రేజ్‌ను సాధించడం మామూలు విషయం కాదు.

వరుస డిజాస్టర్స్‌తో సతమతం
అర్జున్ రెడ్డి తర్వాత గీత గోవిందం బ్లాక్ బస్టర్ కావడంతో పాటు ఆయనకు 100 కోట్ల రూపాయల చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత టాక్సీవాలా హిట్‌కు విజయ్ దేవరకొండకు ఎదురులేకుండా పోయింది. అయితే నోటా, ద్వారక, ఏం మంత్రం వేశావే, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఖుషి, ది ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్స్‌గా నిలిచాయి. గతేడాది నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన తెరకెక్కిన కల్కి 2898 ఏడీలో అర్జునుడిగా కనిపించి షాకిచ్చారు విజయ్. దీంతో పార్ట్ 2లో ఆయన ఎలా చేశారా అన్న ఉత్కంఠ నెలకొంది.
కింగ్‌డమ్ కోసం వెయిటింగ్
వరుస ఫ్లాపులు నేపథ్యంలో కెరీర్‌లో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు విజయ్ దేవరకొండ. ఈ నేపథ్యంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ నటించిన చిత్రం కింగ్‌డమ్. ఇందులో ఆయన సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు. సత్యదేవ్, కౌశిక్ మెహతాలు ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు రూ.100 కోట్ల బడ్జెట్‌తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. గిరిష్ గంగాధరన్, టీ జాన్‌లు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లు, ఇతర ప్రమోషనల్ కార్యక్రమాలు సినిమాపై అంచనాలను పెంచేశాయి. పలుమార్లు వాయిదాపడ్డ కింగ్‌డమ్ జూలై 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ఆసుపత్రి పాలైన విజయ్ దేవరకొండ
ఇలాంటి టైంలో విజయ్ దేవరకొండ అస్వస్థతకు గురయ్యారు. డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చేరారని వార్తలు వస్తున్నాయి. విజయ్‌కి పరీక్షలు చేసిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించడంతో పాటు మూడు రోజులు ఆసుపత్రిలోనే ఉండాలని చెప్పినట్లుగా తెలుస్తోంది. అప్పటికి విజయ్ కండీషన్‌ను బట్టి వైద్యులు డిశ్చార్జ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాతే కింగ్‌డమ్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో విజయ్ దేవరకొండ పాల్గొననున్నారు. అయితే ఈ వార్తలపై విజయ్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ స్పందించాల్సి ఉంది. మరోవైపై విజయ్ దేవరకొండ ఆసుపత్రిలో చేరినట్లు తెలియడంతో ఆయన అభిమానులు టెన్షన్ పడుతున్నారు.


Click it and Unblock the Notifications











