విజయ్ దేవరకొండకు నా ప్రామిస్ ఇదే.. ఎలాంటి కథ రాయాలో అర్థం కావడం లేదు.. కొరటాల!
టాలీవడ్ టాప్ దర్శకులలో ప్రస్తుతం కొరటాల శివ కూడా ఒకరు. మిర్చి చిత్రం నుంచి దర్శకుడిగా అపజయమే లేకుండా దూసుకుపోతున్నాడు. కొరటాల శివ తెరకెక్కించిన అన్ని చిత్రాలు ఘన విజయాలే. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ నటించిన నోటా చిత్ర పబ్లిక్ మీట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ వేడుకకు కొరటాల శివ అతిథిగా హాజరయ్యారు.
కొరటాల శివ విజయ్ దేవరకొండని ప్రశంసలతో ముంచెత్తాడు. పెళ్లి చూపులు చిత్రం చూడగానే విజయ్ దేవరకొండ కోసం ఓ కథ రాయాలని అనుకున్నా. ఆ తరువాత అర్జున్ రెడ్డి చిత్రం వచ్చింది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ భిన్నంగా కనిపించాడు. ఎలాంటి స్టోరీ రాయాలని కన్ఫ్యూజ్ అయ్యా.

ఇటీవల గీత గోవిందం చిత్రం వచ్చింది. విజయ్ నన్ను మళ్ళీ కన్ఫ్యూజన్ లోకి నెట్టేశాడు. ఇలా ప్రతి చిత్రంలో విజయ్ దేవరకొండ వైవిధ్యాన్ని చూపిస్తున్నాడని కొరటాల శివ అన్నారు. అయినా కూడా ఓ మంచి కథతో విజయ్ దేవరకొండతో సినిమా చేస్తానని ప్రామిస్ చేస్తున్నట్లు కొరటాల శివ అన్నారు. నోటా చిత్రం విజయం సాధించాలని కొరటాల శివ ఆకాంక్షించారు.


Click it and Unblock the Notifications











