కూతురు లాంటి హీరోయిన్‌తో రొమాన్సా? స్టార్ హీరో కామెంట్స్ వైరల్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి విలక్షణ నటనకు పెట్టింది పేరు. నిర్మాతగా, రైటర్‌గా ఎన్నో తమిళ సినిమాలకు పనిచేశారు. సినిమాలలో ఎంట్రీ ఇవ్వడానికి ముందు అకౌంటెంట్‌గా చిన్న ఉద్యోగం చేశారు విజయ్. నటనపై ఉన్న మక్కువతో సినిమాల్లోకి అడుగుపెట్టి.. సహాయ నటుడిగా కెరీర్‌ను ప్రారంభించారు. అతని విలక్షణ నటనకు తమిళ ప్రేక్షకులు ఫిదా అయి మక్కల్ సెల్వన్‌గా పిలుచుకుంటున్నారు.
డబ్బింగ్ సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నర్సింహారెడ్డి, ఉప్పెన సినిమాలతో తెలుగువారిని అలరించారు విజయ్ సేతుపతి. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ మహారాజా. తెలుగు, తమిళ భాషల్లో జూన్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, నాటీ, భారతీరాజా, అభిరామి, సింగంపులి కీలకపాత్రలు పోషించారు. ఇది విజయ్ సేతుపతికి 50వ చిత్రం కావడంతో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజైన మహారాజ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

హీరోగా స్టార్‌డం ఉన్నప్పటికీ విలువల్ని పాటించేవారు కొందరే ఉంటారు. అలాంటి వారిలో ఖచ్చితంగా ముందు వరుసలో నిలుస్తారు మక్కల్ సెల్వన్. మెగాస్టార్ మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా, కృతిశెట్టి హీరోయిన్‌గా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన 'ఉప్పెన'లో హీరోయిన్‌కు తండ్రిగా అద్భుతమైన విలనీ చూపించారు విజయ్ సేతుపతి. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో కృతిశెట్టి, వైష్ణవ్ తేజ్‌లు బిజీ అయిపోయారు.
ఆ తర్వాత డీఎస్‌పీ అనే ఓ తమిళ చిత్రంలో విజయ్ సేతుపతి పక్కన కృతిశెట్టిని హీరోయిన్‌గా తీసుకోవాలని దర్శక నిర్మాతలు భావించారు. ఈ విషయం తెలుసుకున్న విజయ్ .. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. ఉప్పెనలో తండ్రిగా నటించి .. ఇప్పుడు ఆమెతో రొమాన్స్ చేయడం బాగోదని కుండబద్ధలు కొట్టారు. అయితే కృతిని హీరోయిన్‌గా ఎందుకు వద్దన్నారనే విషయంపై ఇప్పటికే విజయ్ సేతుపతి క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ వేదికలపై, సినిమా ప్రమోషన్‌లలో మీడియా నుంచి ఆయనకు ప్రతీసారి ఇదే ప్రశ్న ఎదురవుతోంది.

తాజాగా విజయ్ సేతుపతిని ఇదే ప్రశ్నించింది తెలుగు మీడియా. కృతి విషయంలో ఎన్నోసార్లు తనకు ఇదే ప్రశ్నలు ఎదురయ్యాయని.. తన వెర్షన్ క్లియర్ కట్‌గా చెప్పేశానని అయినప్పటికీ ఎక్కడికి వెళ్లినా ఈ ప్రశ్న వెంటాడుతూనే ఉందని ఇకనైనా వదిలేయాలని సున్నితంగా మందలించారు. అయినప్పటికీ మీడియా ప్రతినిధులకు మరోసారి ఓపిగ్గా క్లారిటీ ఇచ్చారు. ఉప్పెన చిత్ర షూటింగ్ సమయంలోనే తనను తండ్రిగా భావించాలని కృతికి చెప్పానని.. అలాంటిది తన పక్కన హీరోయిన్‌గా ఆమెను తీసుకోవడం కరెక్ట్ కాదని అనిపించిందని విజయ్ సేతుపతి చెప్పారు.
అంతేకాదు.. తన పక్కన హీరోయిన్‌గా కృతిశెట్టిని అడిగిఉంటే ఆమె కూడా ఇదే ఆన్సర్ ఇచ్చేవారని ఆయన తెలిపారు. ఇకనైనా ఈ క్వశ్చన్ అడగొద్దని విజయ్ సూచించారు. అలాగే ఇతర నటీనటులకు ఇలాంటి సమస్య ఎదురైతే అన్న ప్రశ్నకు కూడా విజయ్ సేతుపతి తనదైనశైలిలో ఆన్సర్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఇతరులతో పోల్చవద్దని కథకు అవసరమనుకుంటే వాళ్లు నటిస్తారని పేర్కొన్నారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన వ్యక్తిత్వంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.


Click it and Unblock the Notifications











