సొంతవాళ్లే తొక్కేస్తున్నారు... బతకనీయండి.. విజయ్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్
ప్రస్తుతం తెలుగు పరిశ్రమను పట్టి పీడుస్తోన్న సమస్యల్లో పైరసీతో పాటు నెగిటివ్ రివ్యూలు, రేటింగ్స్ కూడా ఒకటి. కొంతమంది వ్యక్తులు కలిసి ఒక సినిమాపై నెగిటివ్ ప్రచారం చేసి తొక్కేస్తున్నారు. ముఖ్యంగా టికెటింగ్ పోర్టల్స్‌లోని రేటింగ్ ఆప్షన్‌ను అడ్డుపెట్టుకుని దారుణంగా దెబ్బకొడుతున్నారు. ఇలాంటి మాఫియా గురించి హీరోలు, దర్శకులు పలు సందర్భాల్లో ఈ విషయం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి అడ్డుకట్ట వేయాలని, అందరం కలిసి ఎదుర్కొవాలని పిలుపునిచ్చారు. తర్వాత యథాప్రకారంగానే సినిమాల రిలీజ్ సమయంలో నెగిటివ్ రివ్యూలు, రేటింగ్స్‌తో నిర్మాతలు తీవ్రంగా నష్టపోతున్నారు.
ఫేక్ రేటింగ్‌పై శంకర వరప్రసాద్ పోరాటం
తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు మూవీ కుట్రలను సమర్ధవంతంగా అడ్డుకుంది. ఈ చిత్ర యూనిట్ కోర్టును ఆశ్రయించి చట్టప్రకారం చర్యలు తీసుకుంది. దీని ప్రకారం బుక్ మై షో సహా టికెట్ బుకింగ్ యాప్స్‌లో మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు ఎలాంటి రేటింగ్ ఇవ్వకూడదు. దాంతో కోర్ట్ ఆదేశాల మేరకు టికెట్ బుకింగ్ యాప్స్ తమ పోర్టల్స్‌లో ఈ ఆప్షన్‌ను డిసేబుల్ చేశాయి. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలుగు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది.

ఫేక్ రేటింగ్‌పై విజయ్ దేవరకొండ స్పందన
మన శంకర వరప్రసాద్ గారు మూవీ యూనిట్ శ్రీకారం చుట్టిన ఈ ఫార్ములానే భవిష్యత్తులో మరికొందరు ఫాలో అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు దీని గురించి చర్చించడంతో పాటు తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. తాజాగా ఈ నకిలీ రేటింగ్, ఫేక్ రివ్యూలపై రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ స్పందించారు. ఈ మేరకు ఎక్స్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ఈ వివరాల్లోకి వెళితే..
నా మాటలను పట్టించుకోలేదు
బుక్ మై షోలో ఇలాంటి పరిణామాలు చూడటంతో సంతోషం, బాధ రెండూ ఒకేసారి కలుగుతున్నాయి. ఎంతోమంది కష్టం, ఆశలు, విలువైన డబ్బును కాపాడుకునేందుకు ఈ నిర్ణయంతో ఒక దారి కనిపించినట్లయ్యింది. కానీ మన సొంత మనుషులే ఇలాంటి ఇబ్బందులను సృష్టించడం బాధాకరమైన విషయం. బతుకు, బతికించు అనే నినాదం ఏమైంది? డియర్ కామ్రేజ్ సినిమా రిలీజ్ సమయంలో జరిగిన సమయంలో ఇలాంటి దాడులే జరిగాయి. ఇన్నేళ్లుగా నా మాటలను ఎవరూ పట్టించుకోలేదు.. మంచి సినిమాను ఎవరూ అడ్డుకోలేరని నాతో చెప్పారు. నాతో సినిమాను నిర్మించే దర్శక నిర్మాతలు ఈ సమస్య తీవ్ర ప్రభావాన్ని త్వరలోనే గ్రహిస్తారని విజయ్ దేవరకొండ అన్నారు.
ఎన్నో నిద్రలేని రాత్రుల్ని గడిపా
ఇలాంటి పనులు చేసేది ఎలాంటి మనుషులు అని ఆలోచిస్తూ.. నా కలలను, నా తర్వాత వచ్చే ఎంతోమంది కలలను కాపాడుకోవడానికి వారిని ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఇప్పుడు ఈ విషయం వెలుగులోకి రావడం సంతోషంగా ఉంది. మెగాస్టార్ లాంటి అత్యంత శక్తివంతమైన నటుడు నటించిన సినిమాలకు కూడా ముప్పు ఉందని కోర్టు ఇప్పుడు గుర్తించింది. ఈ చర్య .. సమస్యను పూర్తిగా పరిష్కరించదు. కానీ చింతించాల్సిన అంశాల్లో ఒకటి తగ్గుతుంది. ప్రస్తుతానికి పండుగ సెలవులలో మనందరినీ అలరించేందుకు వస్తోన్న మన శంకర వరప్రసాద్ గారుతో పాటు అన్ని సినిమాలు విజయం సాధించాలని, ప్రేక్షకులను అలరించాలని కోరుకుందామని విజయ్ దేవరకొండ ఆకాంక్షించారు. ప్రస్తుతం ఆయన పోస్ట్ సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశమైంది. విజయ్ బాటలోనే మరికొందరు ఈ విషయంపై స్పందించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











