Manchu Manoj: నన్ను బతకనివ్వండి.. అదే శత్రువు.. మంచు మనోజ్ సంచలన పోస్ట్
సినీ ఇండస్ట్రీలో మోహన్ బాబు కుంటుంబానికి ఎంతో పెద్ద పేరు ఉంది. సినిమాల్లో హీరోగా కొత్త మేనరిజం చూపించి కలెక్షన్ కింగ్ అయ్యాడు మోహన్ బాబు. ఆయన కుమారులుగా మంచు విష్ణు, మనోజ్ ఇద్దరు తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. విష్ణు అనే సినిమాతో మంచు విష్ణు హీరోగా 2003లో డెబ్యూ ఎంట్రీ ఇస్తే.. 2004లో దొంగ దొంగది మూవీతో మంచు మనోజ్ తెరంగేట్రం చేశాడు. ఇద్దరు తమదైన శైలీలో సినిమాలు చేస్తూ సత్తా చాటారు. గత కొద్దికాలంగా సినిమాలకు మనోజ్ గ్యాప్ ఇచ్చి ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్నాడు. ఇక విష్ణు జిన్నా మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఇటీవల ఈ అన్నదమ్ముల మధ్య గొడవ అయిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. తాజాగా మనోజ్ చేసిన పోస్ట్ సంచలనంగా మారింది.

విష్ణు మాత్రం రాలేదని..
మంచు బ్రదర్స్ అయిన హీరోలు మనోజ్, విష్ణు మధ్య గొడవలు ఉన్నట్లు గత కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తూ వచ్చాయి. ఇద్దరూ పలకరించుకుంటున్నప్పటికీ దూరం మాత్రం అలాగే ఉందని పలువురు చెప్పారు. ఈ కారణంగానే మంచు మనోజ్ పెళ్లి కూడా అక్క మంచు లక్ష్మీ ఇంట్లోనే జరిగిందని అంటున్నారు. ఆ పెళ్లికి మోహన్ బాబు హాజరు కాగా విష్ణు మాత్రం రాలేదని ప్రచారం సాగింది. ఇక ఇంతకాలం నాలుగు గోడల మధ్య ఉన్న మంచు విష్ణు, మనోజ్ విభేదాలు శుక్రవారం నెట్టింట్లో బహిర్గతం అయ్యాయి.

మనోజ్ పై ఆగ్రహం..
మంచు మనోజ్ శుక్రవారం షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో తమ బంధువు అయిన సారథి అనే వ్యక్తి వద్దన్న వినిపించుకోకుండా అతని ముఖంపై విష్ణు కొట్టినట్లు తెలిసింది. ఇక మనోజ్ షేర్ చేసిన వీడియోపై మోహన్ బాబు సీరియస్ అయ్యారు. కుటుంబంలో జరిగే గొడవలను సోషల్ మీడియాలో పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మనోజ్ పెట్టిన పోస్ట్ ను డిలీట్ చేయాలని మోహన్ బాబు ఆదేశించడంతో డిలీట్ చేశాడు.

మోహన్ బాబుకు చెబితే..
మంచు మనోజ్, విష్ణుకు మధ్య ఆస్తి గొడవలు ఎప్పటి నుంచో ఉన్నాయని, అది ఇలా బయటపడిందని పలువురు చెబుతున్నారు. ఇక విష్ణు చూసుకునే బాధ్యతల్లో తలెత్తిన సమస్య వల్లే ఇదంతా జరిగిందని మంచు ఫ్యామిలీకి సన్నిహితుడు, నిర్మాత, నటుడు త్రిపురనేని చిట్టి బాబు తాజాగా పేర్కొన్నారు. మోహన్ బాబుకు చెప్పి పరిష్కరిస్తే అయిపోయే సమస్యను విష్ణు ఇగోకి పోయి ఇక్కడి దాకా తెచ్చాడని చెప్పుకొచ్చారు. ఇక మనోజ్ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు.

ఎలాంటి గొడవలు లేవని..
తప్పు చేస్తే అయినవాళ్లను కూడా విడిచిపెట్టరు అన్న సెన్సులో మంచు మనోజ్ ఆ వీడియోను పెడదామనుకుంటే ఇలా జరిగిందని నిర్మాత చిట్టిబాబు పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఈ మంచు బ్రదర్స్ గొడవ మరొక టర్న్ తీసుకుంది. అందుకు కారణం మంచు మనోజ్ తాజాగా పెట్టిన సోషల్ మీడియా పోస్టే. విష్ణు, మనోజ్ ఇద్దరికీ ఎలాంటి గొడవలు లేవను మోహన్ బాబు ఫ్యామిలీ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంటే మనోజ్ పోస్ట్ మాత్రం కొత్త అనుమానాలు రేకెత్తిస్తోంది.

చావడానికైనా సిద్ధమే..
తాజాగా ఇన్ స్టా వేదికగా మంచు మనోజ్ ఒక పోస్ట్ షేర్ చేశాడు. అందులో "నెగెటివిటీయే క్రియేటివిటికీ శత్రువు" అనే కోట్ రాసి ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు మనోజ్. అన్నయ్య విష్ణు నెగెటివిటీతో ఉన్నాడని పరోక్షంగా మనోజ్ చెబుతున్నాడా, విష్ణు కోపానికి కారణం నెగెటివిటీ అని అంటున్నాడా అని నెటిజన్లు ఆలోచిస్తున్నారు. ఇక మరొక ఫొటోలో.. "ఏం జరగనట్లు (తప్పుల్ని) అలా చూస్తూ ఉండిపోవడం కన్నా.. నిజం కోసం పోరాటం చేసి చావడానికైనా సిద్ధమే" అని రాసి ఉంది.
ఇంకా సద్దుమణగలేదా..
ఈ పోస్ట్ ను షేర్ చేసిన మంచు మనోజ్ "మీరు బతకండి.. మమ్మల్ని బతకనివ్వండి. అందరికీ ప్రేమతో" అని దండం పెడుతున్న, లవ్ హార్ట్ సింబల్ ని యాడ్ చేసి క్యాప్షన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంటే అన్నదమ్ములు అయిన మంచు విష్ణు, మనోజ్ మధ్య గొడవలు ఇంకా సద్దుమణగలేదా అని పలువురు అభిప్రాయపడతున్నారు. మరి ఈ విషయం ఇంకా ముందు ముందు ఎక్కడికీ వెళ్తుందో అని అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











