అలా పిలిస్తే శివయ్య రాడు.. విష్ణు మంచుకు మనోజ్ సెటైర్
తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నటుడు డాక్టర్ మోహన్ బాబు కుటుంబంలో విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన కుమారులు మనోజ్ మంచు, విష్ణు మంచు మధ్య గొడవలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. అయితే ఆస్తుల పంపకాలు, కుటుంబ వ్యవహారాలే ఇందుకు కారణమనేది ఈ వివాదంలో వెలుగు చూసింది. అయితే తాజాగా భైరవం సినిమా ఫంక్షన్‌లో మనోజ్ చేసిన ఎమోషనల్ కామెంట్స్, అలాగే తన సోదరుడు విష్ణుపై పరోక్షంగా విరుచుకుపడిన విధానం మీడియాలో చర్చనీయాంశమైంది. మనోజ్ స్పీచ్ వివరాల్లోకి వెళితే..
మంచు కుటుంబంలో వారి సభ్యుల మధ్య విభేదాలు కొద్ది నెలలుగా సాగుతున్నాయి. హైదరాబాద్, తిరుపతిలోని తమ నివాసాల నుంచి మనోజ్‌ను తరిమి వేయడం వివాదంగా మారింది. మనోజ్‌ను ఇంట్లోకి రానివ్వకుండా బౌన్సర్లు, ప్రైవేట్ వ్యక్తుల అడ్డుకొన్నారు. కార్లు, ఇతర వాహనాలను జప్తు చేసుకొన్నారు. ఈ గొడవలన్నీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం తెలిసిందే. అడపదడపా తన ఆవేదనను మనోజ్ వెళ్లగక్కుతూనే ఉన్నాడు. తాజాగా భీమవరంలో జరిగిన భైరవం సినిమా ఈవెంట్‌లో కూడా ప్రస్తావించడం మరోసారి వివాదాన్ని గుర్తు చేసింది.

ఇటీవల ఓ సినిమా ట్రైలర్‌లో శివయ్య అంటూ విష్ణు మంచు నటించిన కన్నప్ప సీన్‌ను వాడుకోవడం వివాదాస్పదమైంది. ఈ విషయంలో గీతా ఆర్ట్స్, నిర్మాతలపై ఫిర్యాదు చేశారు. వారి నుంచి మంచు విష్ణు క్షమాపణ పత్రాన్ని తీసుకోవడం చర్చనీయాంశమైంది. అయితే తాజాగా అదే శివయ్య డైలాగ్‌ను భైరవం సినిమా ఫంక్షన్‌లో మనోజ్ ప్రస్తావించాడు. శివయ్యా అని పిలిస్తే రాడు. మనసులో ప్రేమతో పిలిస్తే ఆయన వస్తాడు. నన్ను కట్టుబట్టలతో ఇంటి నుంచి బయటకు వెళ్లగొడితే.. నా అభిమానులు శివయ్య రూపంలో వచ్చి 30 కార్లు పెట్టారు అని మనోజ్ ఎమోషనల్ అయ్యారు.
ఈ మధ్యకాలంలో ఎన్నో జరిగాయి. నా చిన్నప్పటి వస్తువులు, నా పిల్లల బట్టలు అన్నీ రోడ్డుపైన పెట్టారు. ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి కార్లు లేవు. కానీ నా ఫ్యాన్స్ శివుడి రూపంలో వచ్చి ఆదుకొన్నారు. నేను మీకు ఉన్నాం అంటూ అండగా నిలిచారు. ఎన్నో కేసులు పెట్టారు. బాధలు పెట్టారు. అయినా నాకు కోపం రావడం లేదు. బాధ మాత్రమే కలుగుతుంది. అది నా బలహీనతో, వారి బలం తెలియడం లేదు అని మనోజ్ అన్నారు.
నాకు ఎన్ని జన్మలు ఉన్నా.. ఈ జన్మకు నేను మోహన్ బాబు అబ్బాయిని. దానిని ఎవడూ మార్చలేదు. నాకు ఆయన నేర్పించిన క్రమశిక్షణే అందుకు కారణం. నాన్న ఎప్పుడూ న్యాయం, నీతివైపు నిలబడమని అంటారు. కానీ అలా చేసినందుకు నేను చేసింది తప్పు అంటున్నారు. ఎన్ని జన్మలెత్తినా అభిమానులే నా తల్లిదండ్రులు. మీ ప్రేమ ఎప్పుడూ నాపై ఉండాలని కోరుకొంటున్నాను అని మనోజ్ అన్నారు.
ఈ వివాదంలో సోషల్ మీడియా, మీడియా వాళ్లు నాకు అండగా నిలిచారు. నా సపోర్ట్ చేస్తే.. మీ యూట్యూబ్ ఛానెల్స్‌పై స్క్రైక్స్ పడిపోతాయి. మీకు బెదిరింపుల లేఖలు వస్తాయి. అయినా మీరు నాకు అండగా నిలిచారు. మీరు డోంట్ కేర్ అంటూ నా వైపు నిలబడ్డారు. అది చాలూ నాకు ఈ జన్మకు అని మంచు మనోజ్ తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చారు. ఈ విషయంపై విష్ణు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











