అల్లు అర్జున్ ఎఫెక్ట్.. ట్విట్టర్ నుంచి నాగబాబు అవుట్.. కారణం అదేనా?
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు ముగియడంతో ఇక్కడ వాతావరణం ప్రశాంతంగా మారగా.. చిత్రసీమ మాత్రం హాట్‌హాట్‌గా మారింది. కారణం ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్. ఎన్నికల ప్రచార గడువు కొద్దిగంటల్లో ముగుస్తుందనగా నంద్యాల వెళ్లిన ఆయన తన ప్రాణ మిత్రుడు , వైసీపీ అభ్యర్ధి శిల్పా రవిచంద్ర కిశోర్ రెడ్డికి మద్ధతు ప్రకటించారు. రవిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆ క్షణం నుంచి సినీ , రాజకీయ వర్గాలు అట్టుడుకుతున్నాయి. సొంత మేనమామ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తూ, ఎంతో కష్టపడుతుంటే ఇక్కడికి రావాల్సిన అల్లు అర్జున్.. ఫ్రెండ్ కోసం నంద్యాల వెళ్లడమేంటంటూ మెగా, జనసేన అభిమానులు మండిపోతున్నారు.
నంద్యాలలో ల్యాండైన మరుక్షణం నుంచి అల్లు అర్జున్‌పై ట్రోలింగ్ ఓ రేంజ్‌లో జరుగుతోంది. ఎవరి పేరుతో బన్నీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.. గంగోత్రి సమయంలో ఆయన ఏం మాట్లాడారో చెబుతూ నాటి వీడియోలను వైరల్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ వల్ల హీరోగా స్టార్‌డం సంపాదించి ఇప్పుడు ఆ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేయడం ఏంటంటూ మెగాభిమానులు మండిపడుతున్నారు. దీనికి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ధీటుగానే బదులిస్తున్నారు. మెగా హీరోలందరిలోకి స్టైలీష్‌గా ఉండటం వల్లే బన్నీ ఐకాన్‌స్టార్‌గా ఎదిగాడంటూ వారు కామెంట్స్ పెడుతున్నారు. ఈ వివాదం మధ్యలోకి మెగా బ్రదర్ నాగబాబు ఎంట్రీతో పరిస్ధితి పూర్తిగా అదుపు తప్పింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసిన రోజు రాత్రి నాగబాబు ఓ ట్వీట్ వేశారు. '' మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మావాడైన పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైన మావాడే '' అంటూ ఆయన పోస్ట్ పెట్టాడు. ఇది పరోక్షంగా అల్లు అర్జున్‌ని ఉద్దేశించినదేనంటూ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. స్వతహాగానే నాగబాబుకు తన సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే ఎంతో ఇష్టం. వారిపై ఈగ వాలినా ఊరుకోరు. చిరు, పవన్‌లపై ఏ విమర్శ వచ్చినా .. ముందు నిలిచేది, వెంటనే స్పందించేది నాగబాబే అనడంలో అతిశయోక్తి లేదు. ఈ పరిణామాలు మెగా క్యాంప్‌లో విభేదాలను మరోసారి బయటకు తెచ్చాయంటున్నారు నెటిజన్లు.
బన్నీ చెప్పను బ్రదర్ కామెంట్స్, రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి గీతా బ్యానర్‌లో సినిమాలు చేయకపోవడం, అల్లు స్టూడియో, అల్లు ఎంటర్‌టైన్‌మెంట్ తదితర పరిణామాలు.. మెగా ఫ్యామిలీలో అల్లు ఫ్యామిలీ వేరు అనే సంకేతాలు జనంలోకి పంపాయి. శిల్పా రవి తనకు మిత్రుడు కావడం వల్లే నంద్యాల వెళ్లానని.. నా అనుకున్న వాళ్లు ఎక్కడ వున్నా వారి మేలు కోరుకుంటానంటూ బన్నీ తన టూర్‌పై క్లారిటీ ఇచ్చారు. కానీ నాగబాబు మాత్రం తాను చేసిన ట్వీట్‌పై స్పందించలేదు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. నాగబాబు ట్వీట్ కారణంగా మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య వివాదానికి దారితీసింది. ఇరు వర్గాలు ట్రోలింగ్స్, విమర్శలకు దిగాయి.

అయితే అల్లు రామలింగయ్య అనే వ్యక్తి లేకుంటే నాగబాబు అనే వాడు బాపట్ల పోస్టాఫీస్ వద్ద సైకిల్ షాపులో పంక్చర్లు వేసుకునేవాడని అల్లు అర్జున్ చేసినట్లుగా ఓ ఫేక్ ట్వీట్ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టింది. ఇది బన్నీ ఫ్యాన్స్ చేసిన పనిగానే అంతా భావిస్తున్నారు. ఇక్కడితో ఆగకుండా మరో రేంజ్‌లో మెగా ఫ్యామిలీ, నాగబాబుపై ట్రోలింగ్‌కు దిగింది అల్లు ఆర్మీ. పరిస్ధితి అదుపు తప్పితే రెండు కుటుంబాలకు మంచిది కాదని చిరంజీవి రియాక్ట్ అయినట్లుగా తెలుస్తోంది. నాగబాబుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేయగా.. అన్నయ్యకి వివరణ ఇచ్చుకోలేక ట్విట్టర్‌ను డియాక్టివేట్ చేసినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందా లేక మరిన్ని మలుపులు తిరుగుతుందా అన్నది తెలియాల్సి వుంది. మొత్తం మీద నాగబాబు కొంత తగ్గినట్లుగానే కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











