పాత చిరంజీవి బయటికొచ్చాడుగా.. యాడ్‌కే పూనకాలు , దటీజ్ మెగాస్టార్ !!
కృషి, పట్టుదల , క్రమశిక్షణ ఉంటే సామాన్యులైనా అసాధారణ విజయాలు సాధించొచ్చని నిరూపించిన అతికొద్దిమందిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. గాడ్ ఫాదర్ లేకుండానే ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్‌కే గాడ్ ఫాదర్‌గా నిలిచారు. ఆయనను స్పూర్తిగా తీసుకుని ఎంతోమంది నటీనటులు, దర్శకులు, టెక్నీషియన్స్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు, ఇంకా పెడుతున్నారు. 70కి చేరువైనా కుర్రహీరోలను మించిన స్పీడుతో సినిమాలు చేస్తున్నారు మెగాస్టార్. ఇక యాడ్స్ విషయంలోనూ ఆయన దుమ్మురేపుతున్నారు, తాజాగా చిరంజీవి నటించిన ఓ వాణిజ్య ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నాలుగు దశాబ్ధాలుగా తెలుగు తెరకు మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్నారు చిరంజీవి. తన సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి ఎంతో శ్రమిస్తారు. తొలి రోజుల్లో సుప్రీం హీరోగా అభిమానుల చేత పిలిపించుకున్న చిరు.. మరణ మృదంగం నుంచి మెగాస్టార్‌గా మారారు. బ్రేక్ డ్యాన్స్‌ని తెలుగువారికి పరిచయం చేసిన చిరంజీవి.. భారతదేశంలో రూ.కోటికి పైగా పారితోషికం తీసుకున్న తొలి నటుడిగానూ చరిత్రలో నిలిచిపోయారు .

ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ వేడుకల్లో అతిథిగా పాల్గొనే ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణ భారత నటుడు చిరంజీవి. కెరీర్‌లో నాలుగు నంది అవార్డులు, 9 ఫిల్మ్‌ఫేర్ సౌత్ పురస్కారాలు, ఆంధ్రా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ చిరంజీవి అందుకున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గాను దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లతో మెగాస్టార్‌ను గౌరవించింది కేంద్ర ప్రభుత్వం.
సినిమాలతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ విషయంలోనూ చిరంజీవి ట్రెండ్ సెట్ చేశారు. ప్రపంచ ప్రఖ్యాత శీతల పానీయాల సంస్థ థమ్స్ అప్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా కొన్నేళ్ల పాటు సేవలందించారు. 2008లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయాల్లోకి వెళ్లే వరకు చిరంజీవి పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించారు. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఆయన కమర్షియల్ యాడ్స్ విషయంలోనూ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. మొన్నామధ్య స్టార్ యాంకర్ అనసూయ, ఖుష్బూలతో కలిసి ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఎండార్స్ చేశారు.
తాజాగా మిల్క్ ప్రొడక్ట్స్‌ని తయారుచేసే కంట్రి డిలైట్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా చిరు సైన్ చేసిన ఆయన దీనికి సంబంధించిన యాడ్‌లో నటించారు. దీనిని హరీష్ శంకర్ తెరకెక్కించారు. మెగాస్టార్ ఏవో డైలాగ్స్ బట్టిపడుతుండగా.. కమెడియన్ సత్య వచ్చి షాట్ రెడీ అనగానే .. చిరులోంచి గళ్ల లుంగీ, బొమ్మల చొక్కా వేసుకున్న ఆత్మారావు బయటకొచ్చి ఫటా ఫటా డైలాగ్స్ వదుతాడు.
వీరిద్దరి మధ్య కంట్రి డిలైట్ పాలు.. యాప్ ద్వారా దీనిని బుక్ చేసుకునే విధానం గురించి చర్చ జరుగుతుంది. ఆత్మారావు గెటప్‌లో పాత చిరంజీవి గుర్తొస్తారు. తనదైన కామెడీ టైమింగ్‌తో చిరు గిలిగింతలు పెడతారు.. ఈ విషయంలో తనకు తానే సాటి. 60 సెకన్ల పాటు సాగే ఈ యాడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. చిరంజీవి నుంచి ఇలాంటి హ్యుమర్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నామంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











