మెగా ఫ్యాన్స్ కు షాక్.. బర్త్ డే సెల్రేషన్స్ పై చిరంజీవి సంచలన నిర్ణయం
కృషి, పట్టుదల, క్రమశిక్షణకు పర్యాయపదంగా మారి ఎందరికో ఆదర్శంగా నిలిచారు మెగాస్టార్ చిరంజీవి. మనిషి కష్టపడితే సాధించలేనిది ఏది లేదని ఆయన నిరూపించారు. గాడ్‌ఫాదర్ లేకుండా హేమాహేమీలను దాటుకుని తెలుగు చిత్ర పరిశ్రమలో నెంబర్‌వన్‌గా ఎదిగారు. తనను ఈస్థాయికి తీసుకొచ్చిన సమాజానికి ఎంతోకొంత తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్‌లను స్థాపించి ఎన్నో ప్రాణాలను నిలబెట్టారు చిరంజీవి. కరోనా, లాక్‌డౌన్ సమయంలో ఎందరో సినీ పేద కళాకారులకు నిత్యావసర వస్తువులు, ఆర్ధిక సాయం అందజేయడంతో పాటు ఆక్సిజన్ , వెంటిలేటర్స్ వంటి పరికరాలను విరాళంగా ఇచ్చారు. సినీ పరిశ్రమ ఎప్పుడు ఏ కష్టంలో ఉన్న తానున్నానంటూ పెద్ద మనసుతో ముందడుగు వేస్తారు చిరు.
కేరళలోని వయనాడ్‌లో వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనలో అపార ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఇప్పటికీ అక్కడ సహాయ పునరావాస కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. బురద, శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చనే ఉద్దేశంతో సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. ప్రకృతి ఆగ్రహానికి గురైన కేరళను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాలు ఆపన్న హస్తం అందిస్తున్నాయి. వయనాడ్‌లో ఇళ్లు కట్టించేందుకు కర్ణాటక ప్రభుత్వం ముందుకొచ్చింది. ఏరియల్ సర్వే ద్వారా నష్టాన్ని పరిశీలించిన ప్రధాని నరేంద్ర మోడీ ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

దేశంలో ఎప్పుడు, ఎక్కడ విపత్తు చోటు చేసుకున్నా బాధితులను ఆదుకునేందుకు సినీ పరిశ్రమ ముందుంటుంది. కేరళ విలయం నేపథ్యంలోనూ పలువురు సినీ ప్రముఖులు భారీగా ఆర్ధిక సాయం ప్రకటించారు. మలయాళ నటుడు మోహన్ లాల్ స్వయంగా ఆర్మీ యూనిఫాంలో స్పాట్‌కు వచ్చి సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టాలీవుడ్ కూడా కేరళ బాధితులకు అండగా నిలిచింది. అల్లు అర్జున్ రూ.25 లక్షలు, ప్రభాస్ రూ.2 కోట్లు విరాళంగా ప్రకటించారు. రామ్ చరణ్, చిరంజీవి సైతం సంయుక్తంగా రూ.కోటి విరాళంగా అందజేశారు. స్వయంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కలిసి రూ.కోటి చెక్‌ను అందించారు.
ఇదిలాఉండగా.. ఆగస్ట్ 22, మెగాస్టార్ పుట్టినరోజు.. అభిమానులకు పండగ రోజు. ఆ రోజున అన్నదానం, రక్తదానం, సేవా కార్యక్రమాలతో పాటు గ్రాండ్‌గా బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహిస్తారు చిరంజీవి అభిమానులు. స్వయంగా తమ అభిమాన నటుడిని కలిసి కేక్ కట్ చేయించడం ఏళ్లుగా చేస్తున్నారు. అయితే ఈసారి కేరళ వరదల నేపథ్యంలో పుట్టినరోజు వేడుకలను నిరాడంబరంగా నిర్వహించాలని మెగాస్టార్ నిర్ణయించారు. ఈ విషయాన్ని చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు వెల్లడించారు.

ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. పద్మవిభూషణ్ పురస్కారం లభించిన తర్వాత తొలిసారిగా వచ్చిన పుట్టినరోజు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా తాము గ్రాండ్ లెవల్‌లో ప్లాన్ చేశామని చెప్పారు. ప్రత్యేకించి హైదరాబాద్ శిల్పకళావేదికలో భారీగా సెలబ్రేషన్ నిర్వహించాలని అనుకున్నామని.. అయితే కేరళలో వరదల బీభత్సం నేపథ్యంలో చిరంజీవి తమను ఇంటికి పిలిపించారని స్వామి నాయుడు వెల్లడించారు.
కేరళ ప్రజలు పుట్టెడు కష్టంలో ఉంటే, ఈ సమయంలో తనకు బర్త్ డే వేడుకలు అవసరమా.. ఈసారికి వాయిదా వేయండి అని సూచించినట్లు తెలిపారు. అయినప్పటికీ .. తెలుగు రాష్ట్రాల్లో 300 బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లు ఏర్పాటు చేశామని, దాదాపు 15 వేల మంది ఆ రోజున రక్తదానం చేస్తారని స్వామి నాయుడు వెల్లడించారు. ఒకేరోజున దాదాపు 10 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం ప్లాన్ చేశామని.. ఈసారికి వీటితో సరిపెట్టుకుంటామని ఆయన తెలిపారు.


Click it and Unblock the Notifications











