62 ఏళ్ల వయసులో టామ్ క్రూజ్ సాహసం.. హెలికాప్టర్‌కు వేలాడుతూ రియల్ స్టంట్స్!
హాలీవుడ్ ఐకాన్, యాక్షన్ హీరో టామ్ క్రూజ్ ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నారు. అమెరికన్ నటుడిగా, ప్రొడ్యూసర్ గా ఆయనకు ఇప్పటికే ఎనలేని కీర్తి దక్కింది. అతని టాలెంట్ కు ప్రపంచమే నివ్వెరపోయింది. కోట్లాది మంది ఆయనను స్ఫూర్తిగా తీసుకొని సినీ ప్రపంచంలో ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ఆరు పదుల వయస్సు దాటినా కూడా టామ్ క్రూజ్ ఇంకా తన అభిమానులను, ఆడియెన్స్ ను ఆశ్చర్యపరుస్తున్నారు. అంతేకాదు.. యంగ్ హీరోలకు ఆయన రియల్ స్టంట్స్ తో సవాల్ విసురుతున్నారు కూడాను.. ఈ క్రమంలో తాజాగా టామ్ క్రూజ్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారుతోంది.
టామ్ క్రూజ్ 18 ఏళ్లలోనే నటుడిగా శిక్షణ పొందారు. పలు ఉద్యోగాలు, టెలివిజన్ సిరీస్ ల్లో నటించిన తర్వాత నటుడిగా అవకాశాలు అందుకున్నారు. 1981లో వచ్చిన అమెరికన్ ఫిల్మ్ 'ఎండ్ లెస్ లవ్'లో కీలక పాత్ర పోషించారు. ది అవుట్ సైడర్స్, ఆల్ ది రైట్ మూవ్స్ వంటి చిత్రాల్లో చాలా వరకు బ్యాక్ గ్రౌండ్ యాక్టర్ గా తన ప్రతిభను చూపించారు. లెజెండ్, టాప్ గన్, ది కలర్ ఆఫ్ మనీ, కాక్ టెయిల్ వంటి చిత్రాల్లో లీడ్ యాక్టర్ గా నటించి మెప్పించాడు. అలా మొదలై ప్రస్తుతం ప్రపంచమే తనవైపు చూసే సినిమాలు చేస్తున్నారు.

టామ్ క్రూజ్ ను నటుడిగా, హాలీవుడ్ సర్కిల్స్ లో ఐకాన్ స్టార్ గా నిలబెట్టింది మాత్రం 'మిషన్ ఇంపాజిబుల్' సిరీస్ మాత్రమే. 1996 నుంచి ఇప్పటి వరకు ఒకదాని తర్వాత మరొక భాగం విడుదలవుతూనే వస్తోంది. స్పై యాక్షన్ సిరీస్ కు వరల్డ్ ఆడియెన్స్ ఎంతగానో ఫిదా అయ్యారు. మిషన్ : ఇంపాజిబుల్ సిరీస్ లకు సెపరేట్ ఆడియెన్స్, అందులోనూ టామ్ క్రూజ్ యాక్షన్ కు, రియల్ స్టంట్స్ కు ఫ్యాన్స్ కూడా ఏర్పడ్డారు. ఆయన చిత్రాల కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
మిషన్ : ఇంపాజిబుల్, మిషన్ : ఇంపాజిబుల్ 2, మిషన్ : ఇంపాజిబుల్ 3, మిషన్ : ఇంపాజిబుల్ - గోస్ట్ ప్రోటోకాల్, మిషన్ : ఇంపాజిబుల్ - రోగ్ నేషన్, మిషన్ : ఇంపాజిబుల్ - ఫాలౌట్, మిషన్ : ఇంపాజిబుల్ - డెడ్ రెకానింగ్ పార్ట్ వన్ వరకు వచ్చిన సిరీస్ లు ఎంతో ఆకట్టుకున్నాయి. స్పై యాక్షన్ సిరీస్ ల్లో టాప్ లో నిలిచింది. గత మూడు సిరీస్ లను క్రిస్టోఫర్ మెక్ క్వారీ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక 2025 మే 23న మిషన్: ఇంపాజిబుల్ - ది ఫైనల్ రెకానింగ్ సిరీస్ విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన షూటింగ్ పార్ట్ ఇప్పటికే పూర్తైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో యూనిట్ ప్రమోషన్స్ ను ప్రారంభించారు.
కాగా.... 62 ఏళ్లలోనూ 'మిషన్: ఇంపాజిబుల్ - ది ఫైనల్ రెకానింగ్' కోసం టామ్ క్రూజ్ చేస్తున్న సాహసాలను చూపించే వీడియోను తాజాగా విడుదల చేశారు. ఎత్తైన భవనం మీద నుంచి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి హెలికాఫ్టర్ లెగ్స్ ను పట్టుకుని గాల్లో తిరుగుతూ విన్యాసం చేస్తూ ఆశ్చర్యపరిచాడు టామ్ క్రూజ్. ఆ వయస్సులో ఫిట్ గా ఉండటమే గగనమని భావించే రోజుల్లో రిస్క్ తో కూడుకున్న స్టంట్స్ చేసి ప్రపంచాన్ని మేల్కొల్పుతున్నారు. ఈ వీడియో పంచుకుంటూ ఇంతవరకు టామ్ క్రూజ్ ఒకే సంట్ ను రెండు సార్లు చేసింది లేదన్నారు. కెరీర్ లోని ప్రతి యాక్షన్ సీన్, స్టంట్స్ ఆయనే స్వయంగా చేశారని టీమ్ తెలియజేసింది. ప్రస్తుతం టామ్ క్రూజ్ కు సంబంధించిన స్టంట్ వీడియో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











