హ్యాట్రిక్ హిట్‌పై కన్నేసిన నాని.. ఆ దర్శకుడితో మూడోసారి!
ఎలాంటి కమర్షియల్ అంశాలు లేకుండా హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలు, ఆరోగ్యకరమైన కామెడీతో సినిమాలు చేయడం దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ శైలి. ఆయన తెరకెక్కించిన చిత్రాలకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుతుంటాయి. గత ఏడాది సమ్మోహనం చిత్రంతో ఇంద్రగంటి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఈ దర్శకుడు నేచురల్ స్టార్ నానితో ఓ చిత్రం చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇంద్రగంటి మోహన్ కృష్ణ, నానిలది హిట్ కాంబినేషన్. వీరిద్దరి కాంబోలో వచ్చిన అష్టాచమ్మా, జెంటిల్‌మన్ చిత్రాలు విజయం సాధించాయి. దీనితో వీరిద్దరూ హ్యాట్రిక్ హిట్ పై కన్నేశారు. నానిని నెగిటివ్ షేడ్స్ లో చూపించే అద్భుత కథని ఇంద్రగంటి సిద్ధం చేస్తున్నారట. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో మరో హీరోకు కూడా కీలక పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది.

నాని ప్రస్తుతం జెర్సీ చిత్రంలో, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటిస్తున్నాడు. జెర్సీ త్వరలో విడుదల కాబోతోంది. విక్రమ్ కుమార్ చిత్రం, ఇంద్రగంటి మోహన్ కృష్ణ చిత్రాలషూటింగ్ ఒకేసారి జరుగుతుందని సమాచారం. నాని వరుస విజయాలకు గత ఏడాది బ్రేక్ పడింది. దీనితో ఈ సంవత్సరం తిరిగి పుంజుకోవాలని భావిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











