దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో టాప్ ఫ్లోర్ కొన్న సూపర్‌స్టార్.. ఎన్ని కోట్లో తెలుసా?
తమ ముందుతరాల వారి జీవితాలను చూసి నేర్చుకున్నారో ఏమో కానీ ఈ జనరేషన్‌లో సాదాసీదా నటుల నుంచి సూపర్‌స్టార్స్ వరకు డబ్బును పొదుపు చేస్తున్నారు. షేర్స్, సెక్యూరిటీలు, బంగారం, పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ ఇలా ప్రతిదానిని పొదుపు కిందే చూస్తున్నారు. అవకాశాలు జీవితాంతం రాకపోవచ్చని, ఇప్పుడున్న స్థితి కన్నా దిగజారిపోవద్దనే ఉద్దేశంతో ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. టాలీవుడ్ టూ బాలీవుడ్ చాలా మంది నటులకు దేశ విదేశాల్లో ఆస్తులు ఉన్నాయి. తాజాగా ఓ నటుడు ఏకంగా దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో ప్రాపర్టీ కొన్నాడు. ఈ వివరాల్లోకి వెళితే..
అంచెలంచెలుగా ఎదిగిన మోహన్‌లాల్
దాదాపు 40 ఏళ్లకు పైగా ప్రేక్షకులను తన నటనతో అలరిస్తున్నారు మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్. రెజ్లర్ కావాల్సిన వ్యక్తిని డెస్టినీ నటన వైపు తీసుకొచ్చింది. చిన్న వయసులోనే వృద్దుడి క్యారెక్టర్‌లో అద్భుతంగా నటించిన మోహన్‌లాల్‌ను మిత్రులు, సన్నిహితులు సినిమాల వైపు వెళ్లాల్సిందిగా ప్రోత్సహించారు. వారి సూచనను పాటించిన మోహన్‌లాల్ వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుని అంచెలంచెలుగా ఎదిగారు. మలయాళ చిత్ర పరిశ్రమ ఎదుగుదలలో ఆయన కీలకపాత్ర పోషించారు.

డబ్బింగ్ చిత్రాలతో దేశవ్యాప్తంగా క్రేజ్
కేరళ వారినే కాకుండా డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ప్రేక్షకులను మోహన్‌లాల్ అలరించారు. దీ కంప్లీట్ మ్యాన్‌గా, సూపర్‌స్టార్‌గా అభిమానుల మన్ననలు పొందారు. కథ బాగుంటే చిన్న పాత్రలో నటించడానికి కూడా మోహన్‌లాల్ వెనుకాడరు. కెరీర్‌లో ఐదుసార్లు జాతీయ అవార్డ్‌తో పాటు పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో భారత ప్రభుత్వం ఆయనను సత్కరించింది. గత నెల 21న 65వ వసంతంలోకి అడుగుపెట్టిన మోహన్‌లాల్ చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఇండియాలోని సంపన్న నటుల్లో ఒకరిగా
ప్రస్తుతం మోహన్‌లాల్.. తెలుగులో మంచు విష్ణు నటిస్తోన్న కన్నప్ప చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. మలయాళంలో హృదయపూర్వం, రామ్ సహా మరో చిత్రంలో నటిస్తున్నారు. తెలుగు- మలయాళంలలో తెరకెక్కుతోన్న వృషభలోనూ ఆయన కీలకపాత్ర పోషిస్తున్నారు. కాగా.. సినిమాల్లో నటించడంతో పాటు చిత్ర నిర్మాణంలోనూ పాలుపంచుకుంటున్నారు మోహన్‌లాల్. పలు వ్యాపారాలలోనూ మోహన్‌లాల్ పెట్టుబడులు పెట్టారు. ఓ హాస్పిటల్‌తో పాటు రెస్టారెంట్స్, సినిమా థియేటర్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లలో ఆయన ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయి. కొచ్చిన్ నగరంలో దాదాపు 9000 చదరపు అడుగుల విస్తీర్ణంలో లగ్జరీ విల్లా ఉంది.. ఆయన ఆస్తుల విలువ రూ.430 కోట్ల పైమాటేనని సినీ వర్గాల టాక్.
బుర్జ్ ఖలిఫాలో అపార్ట్‌మెంట్ కొన్న మోహన్‌లాల్
తాజాగా దుబాయ్‌లోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన టవర్ బుర్జ్ ఖలీఫాలో ఓ లగ్జరీ ఫ్లాట్‌ను మోహన్‌లాల్ కొనుగోలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ టవర్‌లోని 29వ అంతస్తులో దాదాపు 940 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఫ్లాట్ ఉందట. ఇక్కడి నుంచి చూస్తే దుబాయ్ నగరం మొత్తం కనిపిస్తుందట. ఆ అపార్ట్‌మెంట్ ధర 35 మిలియన్ల పైమాటే (రూ.3.5 కోట్లు) ఉంటుందని అంచనా. దీనిని తన భార్య సుచిత్ర మోహన్‌లాల్ పేరిట ఆయన రిజిస్టర్ చేయించినట్లుగా తెలుస్తోంది.
దుబాయ్‌లో మోహన్‌లాల్‌కు ఆస్తులు
తరచుగా దుబాయ్ వెళ్లి వస్తుండటంతో అక్కడ సొంతిల్లు ఉంటే బాగుంటుందని భావించిన మోహన్‌లాల్ ఇప్పటికే పలు ఆస్తులు కొన్నారు. అరేబియన్ రాంచెస్‌లో విల్లా, పీఆర్ హైట్స్ రెసిడెన్స్‌లో ట్రిపుల్ బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్ కూడా మోహన్‌లాల్ కొనుగోలు చేశారు. తాజాగా బుర్జ్ ఖలీఫాలో ఫ్లాట్ కొనుగోలు చేయడం ద్వారా ఇక్కడ ప్రాపర్టీ ఉన్న తొలి భారతీయ నటుడిగా మోహన్‌లాల్ నిలిచారు.


Click it and Unblock the Notifications











