ఎన్టీఆర్ నాకు దేవుడు.. బాలకృష్ణ వివాదాన్ని మరిచి నాగచైతన్య ఎమోషనల్ స్పీచ్
నటరత్న, విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. వెంకటేశ్, ఆర్ నారాయణ మూర్తి, రాంచరణ్, నాగచైతన్య, సుమంత్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కినేని వారసులు నాగచైతన్య, సుమంత్ మాట్లాడుతూ..
స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం రావడం నాకు లభించిన అదృష్టంగా భావిస్తున్నాను. తెలుగు సినిమా పరిశ్రమకు ఎన్టీఆర్ పునాది లాంటి వారు. ఆయన అందం, ఆయన వాక్చాతుర్యం, ఆయన క్రమశిక్షణ గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన చేసిన చారిత్రక, పౌరాణిక చిత్రాలు అందరికి స్పూర్తిని కలిగిస్తాయి. ఆయన పేరు చెబితే కృష్ణుడు, రాముడు గుర్తుకు వస్తారు అని నాగచైతన్య అన్నారు.

తాతగారు నాగేశ్వరరావు ఎప్పుడూ ఎన్టీఆర్ గురించి గౌరవంగా మాట్లాడేవారు. వారిద్దరి స్నేహం మాకు మంచి స్పూర్తిని కలిగిస్తుంటుంది. రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టి పేదల కోసం ఎన్నో సంస్కరణలు చేపట్టారు. భాషా, సాంస్కతిక రంగాలకు ఎనలేని సేవ చేశారు. ప్రజలకు నిజమైన ప్రజాస్వామ్యాన్ని అందించారు అని నాగచైతన్య అన్నారు.
ఎన్టీఆర్ ఒక నటుడిగా, ముఖ్యమంత్రిగా ప్రజల గుండెల్లో దేవుడి లాంటి వ్యక్తిగా చిరకాలం ఉండిపోతారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, నందమూరి అభిమానులకు. ఫ్యామిలీకి నా ధన్యవాదాలు. ఈ వేడుకకు తరలి వచ్చిన అభిమానులకు ధన్యవాదాలు అని నాగచైతన్య తెలిపారు.

ఎన్టీఆర్ శత దినోత్సవ వేడుకల్లో హీరో సుమంత్ మాట్లాడుతూ.. ఈ వేడుకకు ఆహ్వానించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, మామయ్య బాలయ్య గారికి ధన్యవాదాలు. ఎన్టీఆర్ గురించి అక్కినేని ఫ్యామిలీ తరఫున నా తమ్ముడు నాగచైతన్య మాట్లాడేశారు. నేను ఒక్క విషయం చెప్పాలనుకొంటున్నాను. ఎన్టీఆర్ బయోపిక్‌లో తాతగారి పాత్ర పోషించినందుకు గొప్ప అనుభూతిగా భావిస్తున్నాను. జై ఎన్టీఆర్ అని అన్నారు.
గతంలో అక్కినేని, తొక్కినేని అని బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను పట్టించుకోకుండా అక్కినేని వారసులు ఎన్టీఆర్‌ను ప్రశంసలతో ఆకాశానికి ఎత్తేయడం అందర్నీ ఆకట్టుకొన్నది. నాగచైతన్య, సుమంత్ ప్రసంగాలు అందర్నీ మెప్పించేలా చేశాయి. వివాదాన్ని పట్టించుకోకుండా తెలుగు సినిమా ఒక్కటే అని అక్కినేని వారసులు నిరూపించారు.


Click it and Unblock the Notifications











