బాలయ్య వర్సెస్ నాగార్జున .. టైం చూసి దెబ్బకొట్టుకుంటున్నారా, పైచేయి ఎవరిదో ..?
తెలుగు సినిమా దిగ్గజాలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్‌ల తర్వాత వారి వారసులు బాలకృష్ణ, నాగార్జున కూడా తమ తండ్రుల బాటలోనే సొంత అన్నదమ్ముల్లాగే మెలిగారు. కానీ ఏమైందో తెలియదు కానీ నాగ్- బాలయ్య మధ్య గ్యాప్ వచ్చింది. ఏళ్లుగా వీరిద్దరి మధ్య దూరం పెరుగుతూనే ఉంది తప్పించి, సర్దుబాటు కావడం లేదు. ఈ ప్రచారాన్ని ఇద్దరు హీరోలు ఖండించలేదు, అలాగని ఒకరితో మరొకరు పడనట్లుగా వ్యవహరించలేదు. అయితే ఇద్దరూ స్పందించకపోవడంతో ఏదో జరుగుతుందన్న భావన కలుగుతోంది.
మొన్నామధ్య బాలయ్య అక్కినేని తొక్కినేని అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. దీనికి ఏఎన్ఆర్ మనవళ్లు అక్కినేని నాగచైతన్య, అఖిల్‌లు పరోక్షంగా కౌంటర్ ఇచ్చినా నాగార్జున మాత్రం రియాక్ట్ కాలేదు. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తుండటంతో బాలకృష్ణ స్పందించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ రెండు కళ్లలాంటివారని.. నాన్న క్రమశిక్షణ నేర్పితే, పొగడ్తలకు దూరంగా ఉండటాన్ని బాబాయ్ నుంచి నేర్చుకున్నానని బాలయ్య తెలిపారు. ఏఎన్ఆర్ తన పిల్లల కంటే ఎక్కువగా నన్నే ప్రేమించేవారని బాలకృష్ణ తెలిపారు. ఫ్లోలో వచ్చే మాటలను వక్రీకరించి ప్రచారం చేశారని ఇష్యూని కవర్ చేసే ప్రయత్నం చేశారు. బాబాయ్‌పై ప్రేమ గుండెల్లో ఉంటుందని, బయట ఏం జరిగినా తాను పట్టించుకోనని బాలయ్య పేర్కొన్నారు.

వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయో లేదో తెలియదు కానీ బాలకృష్ణ - నాగార్జున కలిసి వేదిక పంచుకుని చాలా రోజులవుతుంది. అప్పుడెప్పుడో విశాఖలో జరిగిన ఓ ఈవెంట్‌లో ఈ ఇద్దరు అగ్రనటులు కలిసి పాల్గొన్నారు. ఎన్టీఆర్ శతజయంతి, ఏఎన్ఆర్ శతజయంతి వేడుకల్లో వీరిద్దరూ ఎక్కడా కనిపించలేదు. ఇదిలాఉండగా బాలకృష్ణ సినీరంగ ప్రవేశం చేసి 50 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లో మెగా ఈవెంట్ ప్లాన్ చేశారు. టాలీవుడ్ మొత్తం ఈ కార్యక్రమానికి తరలిరానుంది. నాగార్జునకు కూడా ఆహ్వానం అందినట్లుగా ఫిలింనగర్ టాక్.
యాదృచ్ఛికంగా జరిగిందో లేక మరొకటో తెలియదు కానీ సరిగ్గా ఒకే రోజు ఒకే సమయంలో నాగార్జున హోస్ట్ చేయనున్న బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ లాంచ్ కానుంది. ఆ రోజున హౌస్‌లోకి అడుగుపెట్టబోయే కంటెస్టెంట్స్ పరిచయ కార్యక్రమం ఉంది. బాలయ్య 50 ఏళ్ల వేడుక సెప్టెంబర్ 1న జరగనుందని నెలల క్రితమే ఫిక్స్ చేశారు. మరి అన్ని తెలిసి స్టార్ మా యాజమాన్యం సెప్టెంబర్ 1 బిగ్‌బాస్ లాంచ్ కార్యక్రమం ఎందుకు పెట్టుకుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
తమ అభిమాన నటీనటులంతా ఒకే చోట చేరనుండటం.. పైగా టాలీవుడ్‌లో పెద్ద వేడుక జరిగి చాలా రోజులు అవుతుండటంతో ప్రజలు కూడా ఈ ఈవెంట్ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి టైంలో బిగ్‌బాస్ లాంచింగ్ పెట్టుకుంటే టీఆర్పీలు తేడా కొడతాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగని లాంచింగ్ ఈవెంట్ వాయిదా వేయలేరు.. వెనక్కి తగ్గితే ప్రెస్టెజ్ ఇష్యూ. అసలే బాలయ్య - నాగార్జునల మధ్య గ్యాప్ నేపథ్యంలో ఒకరికొకరు దెబ్బకొట్టడానికి ఇలాంటి చర్యలకు దిగారా అంటూ సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











