తెలుగువారి క్రియేటివిటీకి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది: నాగార్జున
తెలుగు సినిమాల కీర్తి జాతీయ స్థాయిలో రెపరెపలాడటంపై టాలీవుడ్ నటుడు నాగార్జున ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన మన్మధుడు 2 సినిమా రిలీజ్ రోజు ఈ చిత్ర దర్శకుడు రాహుల్ రవీంద్రన్‌కు ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ అవార్డు దక్కిందనే వార్త వినడం మరింత సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
''నాకు నచ్చిన మూడు సినిమాలకు జాతీయ అవార్డులు వచ్చాయి. మహానటి సినిమాకు మూడు అవార్డులు వచ్చాయి. రంగస్థలంకు బెస్ట్ సౌండ్ అవార్డ్ వచ్చింది. మా డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్‌కు బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు దక్కింది. నాకు చిలసౌ సినిమా నచ్చడం వల్లే రాహుల్ రవీంద్రన్‌ను మన్మధుడు 2 సినిమాకు పెట్టుకున్నాను. ఈ సందర్భంగా ఆయనకు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నాను.'' అని నాగార్జున వ్యాఖ్యానించారు.

''మై గోల్డ్ నాని సినిమా 'అ'కు అవార్డ్ వచ్చింది. తెలుగు సినిమాలకు ఈ సారి ఇన్ని నేషనల్ అవార్డులు రావడం, తెలుగువారి క్రియేటివిటీకి జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చినందుకు సంతోషంగా ఉంది. కీర్తి సురేష్‌కు జాతీయ స్థాయిలో ఉత్తమ నటి అవార్డ్ రావడం అభినందనీయం. ఆమె సావిత్రిగారి పాత్ర అద్భుతంగా చేశారు. ఆ సినిమా చూసిన వెంటనే ఆ అమ్మాయి ఫోన్ నెంబర్ తీసుకుని అభినందించాలని అనిపించింది. ఇపుడు కూడా ఆమెకు ఫోన్ చేసి అభినందిస్తాను'' అన్నారు.
కాస్టూమ్, మేకప్ విభాగాల్లో సైతం తెలుగు చిత్రాలు మేటిగా నిలిచాయి. ఉత్తమ మేకప్ అవార్డ్ 'ఆ!' చిత్రానికి దక్కింది. ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్ అవార్డ్ మహానటి చిత్రం అందుకుంది. దీంతో పాటు జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా మహానటి నిలిచింది.


Click it and Unblock the Notifications











