ఒకేసారి అన్ని కథలను ఫైనల్ చేసిన నాగార్జున: ఆ హీరోలతో కలిసి సినిమాలు
చాలా కాలంగా హిట్ దొరకక ఇబ్బందులు పడుతున్నాడు కింగ్ అక్కినేని నాగార్జున. ఈ క్రమంలోనే అతడు వరుస పెట్టి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. కానీ విజయం మాత్రం వరించడం లేదు. దీంతో ఈ సారి ఎలాగైనా సక్సెస్ బాటలో పయణించాలని పట్టుదలగా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం రెండు చిత్రాలను లైన్‌లో పెట్టేసుకున్నాడు. వాటికి సంబంధించిన షూటింగ్ జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఈ సీనియర్ హీరో ఏకంగా పదుల సంఖ్యలో కథలను వింటున్నాడని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. అయితే, ఇవన్నీ అతడి కోసం మాత్రం కాదనే టాక్ వినిపిస్తోంది.
కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించడంలో అక్కినేని నాగార్జున ఎప్పుడూ ముందుంటాడు. అందుకే సుదీర్ఘమైన కెరీర్‌లో ఆయన ఎంతో మంది దర్శకులను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు మరికొందరిని ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నాలు జరుపుతున్నాడట. తన సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియో బ్యానర్‌పై పలువురు హీరోలతో సినిమాలు నిర్మించేందుకు నాగ్ ప్లాన్ చేస్తున్నాడట. ఇందులో భాగంగానే ఈ నాలుగైదు రోజుల్లో దాదాపు పది మంది చెప్పిన కథలను ఆయన విన్నాడట. వీటిలో కొన్నింటిని ఫైనల్ చేశాడనే తెలుస్తోంది.

ఇక, అక్కినేని నాగార్జున నిర్మించబోయే సినిమాల్లో కొన్ని బిగ్ స్క్రీన్ కోసం.. మరికొన్ని ఓటీటీల కోసం ప్లాన్ చేస్తున్నారట. అందులో ఏవి ఎలా రిలీజ్ చేస్తామన్న విషయాన్ని ఆయనే కొద్ది రోజుల్లో వెల్లడించనున్నారని టాక్. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నాగార్జున.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీని చేస్తున్నాడు. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తోంది. మరోపక్క.. త్వరలోనే 'బంగార్రాజు' అనే చిత్రాన్ని కూడా పట్టాలెక్కించనున్నాడు. ఇది సూపర్ హిట్ మూవీ 'సోగ్గాడే చిన్ని నాయన' అనే సినిమాకు ప్రీక్వెల్‌గా రూపొందనున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











