‘అఖండ’ విషయంలో బాలకృష్ణ వెనకడుగు: అదొక్కటి పూర్తయ్యాక ఆపేస్తారట
నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను రూపొందిస్తోన్న చిత్రం 'అఖండ'. హిట్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఈ సినిమా విషయంలో ఎన్నో ప్రయోగాలు కూడా చేస్తున్నారు. అటు బాలయ్యకు.. ఇటు బోయపాటికి కచ్చితంగా హిట్ కావాల్సిన పరిస్థితుల్లో దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అందుకే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమై న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అవుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ రోజు రోజుకూ విజృంభిస్తూనే ఉంది. దీంతో చాలా మంది హీరోలకు సంబంధించిన సినిమాల షూటింగులు నిలిచిపోయాయి. కానీ, నందమూరి బాలకృష్ణ మాత్రం 'అఖండ' షూటింగ్‌లో పాల్గొంటున్నారు. వికారాబాద్ అటవీ ప్రాంతంలో జరుగుతోన్న షెడ్యూల్‌లో ఆయన కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు చేస్తున్నారు. ఇందులో బాలయ్యతో పాటు ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ కూడా ఉన్నారు. తాజా సమాచారం ప్రకారం.. నేడో రేపో ఈ షెడ్యూల్ పూర్తి అవుతుందట. ఆ తర్వాత షూటింగ్ చేయకూడదని నటసింహా డిసైడ్ అయినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

కరోనా ప్రభావం తగ్గిన తర్వాతనే 'అఖండ' షూటింగ్ పున: ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో బాలయ్య అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ నెగెటివ్ రోల్ చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే విడుదలైన ఈ మూవీ టీజర్ యూట్యూబ్‌లో సెన్సేషన్ అవుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇది 40 మిలియన్ల మార్కును కూడా దాటేసింది.


Click it and Unblock the Notifications











