సౌత్‌లో సెన్సేషనల్ కాంబో: ఆ స్టార్ హీరోలతో బాలయ్య మల్టీస్టారర్.. ఒక్కో పార్టులో ఒకరు
తెలుగు సినీ ఇండస్ట్రీలో వేగంగా సినిమాలు చేసుకుంటూ వెళ్తోన్న హీరోలు చాలా తక్కువ మందే ఉన్నారు. అందులో సీనియర్ హీరో నటసింహా నందమూరి బాలకృష్ణ ఒకరు. ఆరు పదుల వయసులోనూ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా దూసుకుపోతోన్న ఆయన.. ఇప్పటికే పలు చిత్రాలను లైన్‌లో పెట్టుకున్నారు.
అయినప్పటికీ చాలా మంది దర్శకుల కథలను వింటూ బిజీగా గడుపుతోన్నారు. ఈ క్రమంలోనే తాజాగా బాలయ్య.. సౌతిండియాలోనే ఇద్దరు బడా స్టార్లతో మల్టీస్టారర్ చేయబోతున్నారట. పూర్తి వివరాల్లోకి వెళ్తే...

వరుస హిట్లతో ఫుల్ జోష్: నటసింహా నందమూరి బాలకృష్ణ ఆ మధ్య వరుస ఫ్లాపులతో సతమతం అయ్యారు. ఈ పరిస్థితుల్లో రెండేళ్ల క్రితమే ఆయన 'అఖండ' అనే చిత్రంతో మరోసారి హిట్ ట్రాక్ ఎక్కారు. ఆ వెంటనే ఈ స్టార్ హీరో 'వీర సింహా రెడ్డి' అనే చిత్రంతో వచ్చి మరో విజయాన్ని కూడా ఖాతాలో వేసుకున్నారు. ఇది అత్యధిక కలెక్షన్లతో ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

అనిల్ రావిపూడితో ఫిల్మ్: వరుస విజయాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడితో ఓ సినిమా చేస్తోన్నారు. పూర్తి స్థాయి ఫన్ అండ్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ కాగా.. శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది.

అఖండ 2.. ఆ డైరెక్టర్లతో: ఒకటి పట్టాలపై ఉండగానే మరిన్ని సినిమాలు చేసుకుంటూ పోయే బాలయ్య.. త్వరలోనే బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ 2' సినిమాను చేస్తారని ప్రచారం జరుగుతోంది. అలాగే, ఆయన బాబీతో ఓ మూవీ, మల్లిడి వశిష్టతో మరో మూవీ చేయబోతున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. కానీ, వీటికి సంబంధించిన ప్రకటనలు మాత్రం ఇప్పటి వరకూ రాలేదు.

సౌత్‌లో బిగ్ మల్టీస్టారర్: నటసింహా బాలకృష్ణ ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి తాజాగా ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఆయన త్వరలోనే సౌతిండియాలోనే ఓ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీలో నటించబోతున్నారట. ఇందులో బాలయ్యతో పాటు కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా నటిస్తారని ఫిలిం నగర్ ఏరియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.

ఫస్ట్‌ది అలా.. రెండోదిలా: క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ మల్టీస్టారర్ ప్రాజెక్టుకు సంబంధించిన మరింత సమాచారం తాజాగానే బయటకు వచ్చింది. దీని ప్రకారం.. మొదటి భాగంలో నటసింహా నందమూరి బాలకృష్ణతో పాటు శివరాజ్‌కుమార్ కనిపించబోతున్నారట. అలాగే, రెండో భాగంలో బాలయ్య - రజినీకాంత్ నటిస్తున్నారని తెలిసింది.

నిర్మాత ఆ హీరోనేనట: సౌత్ ఇండియాలోనే ముగ్గురు బడా హీరోలు కలిసి నటించబోయే ఈ ప్రాజెక్టును కన్నడ స్టార్ హీరో శివరాజ్‌కుమార్ సొంత ప్రొడక్షన్‌లోనే భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్నారని తెలిసింది. ఇక, ఈ సినిమాను కన్నడంలో పేరున్న ఓ బడా డైరెక్టర్ తెరకెక్కించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ మల్టీస్టారర్ న్యూస్ సౌతిండియాలోనే కాకుండా దేశ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది.


Click it and Unblock the Notifications











