HBD Nandamuri Balakrishna: బాలనటుడి నుంచి గాడ్ ఆఫ్ మాసెస్‌గా.. బాలకృష్ణ ఆస్తులు ఎన్ని కోట్లంటే?
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసుడిగా తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చారు బాలకృష్ణ. ఈ తరంలో పౌరాణిక చిత్రాల్లో నటించిన అరుదైన ఘనత బాలయ్యదే. టాలీవుడ్‌లో వందకు పైగా చిత్రాల్లో హీరోగా నటించిన హీరోల లిస్ట్‌లోనూ బాలయ్య స్థానం దక్కించుకున్నారు. ఐదు దశాబ్ధాలుగా తెలుగు చిత్ర పరిశ్రమకు తన సేవలు అందిస్తున్న బాలయ్య .. జూన్ 10న 66వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా నందమూరి అందగాడి సినీ జర్నీ, ఆయన ఆస్తులు ఇతర అంశాలపై ఫిల్మీబీట్ ప్రత్యేక కథనం.
తాతమ్మ కలలో బాలనటుడిగా
నందమూరి తారక రామారావు, బసవతారకం దంపతులకు 10 జూన్ 1960న చెన్నైలో జన్మించారు బాలకృష్ణ. చిన్నప్పటి నుంచి తండ్రిని చూస్తూ పెరిగిన బాలయ్య.. ఆయన అడుగుజాడల్లోనే సినీరంగ ప్రవేశం చేశారు. 14 ఏళ్ల వయసులో తాతమ్మ కల చిత్రంతో సినీరంగ ప్రస్థానం మొదలుపెట్టిన బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. తొలినాళ్లలో ఎక్కువగా తండ్రి అడుగుజాడలోనే నటించారు. రామ్ రహీమ్, దానవీర శూరకర్ణ, అక్బర్ సలీమ్ అనార్కలి, అనురాగ దేవత, సింహం నవ్వింది తదితర చిత్రాలలో చిన్నాచితకా పాత్రలు పోషించారు. ఈ దశలో 1984లో సాహసమే జీవితం సినిమాతో సోలో హీరోగా అడుగుపెట్టారు. ఇక నాటి నుంచి తెలుగునాట బాలయ్య శకం మొదలైంది. వరుస హిట్స్‌తో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.

ఫిక్సన్, ఫ్యాక్షన్ సినిమాలతో హల్‌చల్
సీతారామ కళ్యాణం, ముద్దుల మావయ్య, నారీ నారీ నడుమ మురారి, లారీ డ్రైవర్, బొబ్బిలి సింహం, రౌడీ ఇన్స్‌పెక్టర్, పెద్దన్నయ్య, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, లక్ష్మీ నరసింహా, సింహా, లెజెండ్, అఖండ, వీరసింహారెడ్డి తదితర సినిమాలతో సత్తా చాటారు బాలకృష్ణ. ఆదిత్య 369 వంటి ఫిక్సన్ సినిమాతో పాటు సమరసింహారెడ్డితో ఫ్యాక్షన్ సినిమాలకు ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు బాలయ్య. మాస్ యాక్షన్ సినిమాలు రాజ్యమేలుతున్న సమయంలో శ్రీ కృష్ణార్జున విజయం వంటి పౌరాణిక సినిమా చేసి మెప్పించారు. అలాగే పాండు రంగడు వంటి భక్తిరస ప్రధాన చిత్రంలోనూ అలరించారు.
నటుడిగా 50 ఏళ్లు పూర్తి
1986లో ఆయన నటించిన ముద్దుల కృష్ణయ్య, సీతారామకళ్యాణం, అనసూయమ్మ గారి అల్లుడు, దేశోద్ధారకుడు, కలియుగ కృష్ణుడు, అపూర్వ సహోదరులు విడుదలై బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచి అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నారు బాలకృష్ణ. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 111వ సినిమాలో నటిస్తున్నారు గాడ్ ఆఫ్ మాసెస్. ఈ సినిమా తర్వాత కొరటాల శివ డైరెక్షన్‌లో బాలయ్య సినిమా చేయనున్నారు. 50 ఏళ్ల కెరీర్‌లో పౌరాణిక, చారిత్రక, జానపద, ఫ్యాక్షన్, ఫ్యామిలీ, కామెడీ, సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ ఇలా అన్ని రకాల జోనర్స్‌లో నటించిన అరుదైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు బాలయ్య.
హోస్ట్‌గానూ గ్రాండ్ సక్సెస్
హైదరాబాద్ నిజాం కాలేజీలో బీకాం చదువుకున్న బాలయ్య .. 1982లో వసుంధరను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు కుమార్తెలు బ్రాహ్మాణి, తేజస్విని.. కుమారుడు మోక్షజ్ఞ తేజ సంతానం. వెండితెరతో పాటు ఇక బుల్లితెరపై హోస్ట్‌గానూ బాలకృష్ణ సక్సెస్ అయ్యారు. తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బీకే షోకు వ్యాఖ్యాతగా వ్యవహరించి సక్సెస్ చేశారు. సినిమాలే కాదు రాజకీయాల్లోనూ తండ్రి బాటలోనే నడించారు. గతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధుల తరపున ప్రచారం చేసిన బాలయ్య... 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.
హ్యాట్రిక్ ఎమ్మెల్యే
తన కుటుంబానికి కంచుకోటగా ఉన్న హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తర్వాత 2019, 2024లలో వరుస విజయాలు సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచారు. ఇక సామాజిక సేవా కార్యక్రమాలలోనూ బాలయ్య తన మార్క్ చూపిస్తున్నారు. తన తల్లి పేరిట నెలకొల్పిన బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా హాస్పిటల్‌ను మరింత విస్తరించి, పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు దక్కే విధంగా చర్యలు చేపట్టారు. త్వరలో అమరావతిలోనూ బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రిని నెలకొల్పేందుకు గాను ఏర్పాట్లు చేసుకుంటున్నారు బాలయ్య. ఇక భారతీయ సినిమాకు అందించిన సేవలకు గాను గతేడాది ఆయనను పద్మభూషణ్ పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. ఆ వెంటనే కొద్దిరోజులకు ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్‌తో తెలంగాణ ప్రభుత్వం బాలయ్యను గౌరవించింది.
నందమూరి బాలకృష్ణ ఆస్తులు ఎన్ని కోట్లంటే?
సినిమాల నుంచి వచ్చే రెమ్యునరేషన్, బ్రాండ్ అండార్స్‌మెంట్స్, వ్యాపారాల ద్వారా ప్రధానంగా బాలయ్య ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. సినిమాకు 30 నుంచి 40 కోట్ల రూపాయల రేంజ్‌లో బాలయ్య పారితోషికంగా తీసుకుంటున్నారని టాలీవుడ్ టాక్. బాలయ్యకు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో విలాసవంతమైన ఇల్లు ఉంది. దీని విలువ 20 కోట్ల రూపాయల పై మాటేనని అంచనా. అలాగే 35 కోట్ల రూపాయలతో హైదరాబాద్‌లో మరో కొత్త ఇంటిని ఆయన నిర్మిస్తున్నట్లుగా టాక్. బాలకృష్ణ గ్యారేజీలో ఖరీదైన మెర్సిడెస్ బెంజ్, ఆడి, బెంట్లీ వంటి కార్లు ఉన్నాయి.
2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం బాలకృష్ణ ఆస్తుల విలువ రూ.81.63 కోట్లు .. అలాగే తనకు రూ.9.9 కోట్లు అప్పులు ఉన్నట్లు ఆయన తెలిపారు. బాలయ్య సతీమణి నందమూరి వసుంధరా దేవి పేరిట రూ.140.38 కోట్లు ఆస్తులు ఉన్నట్లు బాలయ్య తెలిపారు. అలాగే వసుంధరకు రూ.3.83 కోట్ల అప్పులు ఉన్నట్లు ఆయన ప్రకటించారు. తన కుమారుడు మోక్షజ్ఞ తేజ పేరిట రూ.58.63 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తంగా కుటుంబ సభ్యుల ఆస్తులతో కలిపి బాలయ్య సంపద విలువ 400 కోట్ల రూపాయల పైమాటేనని టాలీవుడ్ టాక్.


Click it and Unblock the Notifications





