‘టక్ జగదీష్’లో నాని రోల్ లీక్: ప్రభుత్వ ఉద్యోగిగా నేచురల్ స్టార్.. సినిమాలో అదే హైలైట్
స్వయంకృషితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. సహజ సిద్ధమైన నటనతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు నేచురల్ స్టార్ నాని. కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను సొంతం చేసుకున్న ఈ టాలెంటెడ్ హీరో.. మినిమమ్ గ్యారెంటీ చిత్రాలతో అంచెలంచెలుగా ఎదుగాడు. ఈ క్రమంలోనే తన మార్కెట్‌ను గణనీయంగా పెంచుకోవడంతో పాటు అభిమానులను కూడా భారీ స్థాయిలో సంపాదించుకున్నాడు. ఇలా వరుస పెట్టి సినిమాలు చేస్తూ అందరినీ తన నటనతో అలరిస్తున్నాడు. ఈ క్రమంలోనే వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు.
'నిన్ను కోరి' వంటి సూపర్ డూపర్ హిట్ మూవీ తర్వాత నేచురల్ స్టార్ నాని - శివ నిర్వాణ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'టక్ జగదీష్'. ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాబోయే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తైంది. ఆ వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా కంప్లీట్ అయిపోయాయి. దీంతో ఈ సినిమాను గత వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావించారు. అయితే, కరోనా సెకెండ్ వేవ్ కారణంగా అది సాధ్య పడలేదు. దీంతో ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అని ప్రేక్షకులంతా వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఓ వివాదం చెలరేగింది.

'టక్ జగదీష్' సినిమాను ఓటీటీలో నేరుగా విడుదల చేస్తున్నారని ఎప్పటి నుంచో జోరుగా ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే. కానీ, ఆ తర్వాత ఈ వార్తలను చిత్ర యూనిట్ ఖండించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఈ మూవీ అమెజాన్‌లో సెప్టెంబర్ 10న విడుదల కాబోతుందని 'లవ్ స్టోరీ' నిర్మాతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ సినిమాను వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న విడుదల చేస్తుంటే.. 'టక్ జగదీష్' కూడా అదే రోజు ఓటీటీలో విడుదల అవడం తగదని ఆరోపించారు. దీంతో ఇది పెద్ద వివాదం అయింది. ఆ తర్వాత చల్లబడింది. మొత్తానికి నాని సినిమా ఓటీటీలో రాబోతుందని అందరికీ అర్థం అయిపోయింది.
ఆ వివాదం క్రమంగా చల్లారుతోండగా.. తాజాగా 'టక్ జగదీష్' మూవీ గురించి ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీని ప్రకారం.. కుటుంబ కథతో రాబోతున్న ఈ సినిమాలో నేచురల్ స్టార్ నాని మండల రెవెన్యూ ఆఫీసర్ (ఎమ్మార్వో / తహసీల్దార్) పాత్రను చేస్తున్నాడట. రాజకీయ నాయకులను సైతం ఎదురించే డైనమిక్ ప్రభుత్వ ఉద్యోగిగా ఇందులో అతడు నటించాడని తెలుస్తోంది. అంతేకాదు, ఈ పాత్ర ఎన్నో ఎమోషన్స్‌ను కూడా పండిస్తుందనే టాక్ వినిపిస్తోంది. సినిమా మొత్తంలో నాని ఎమోషనల్ సీన్స్ హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం.

భారీ బడ్జెట్‌తో కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన 'టక్ జగదీష్' మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్లు, పాటలు, టీజర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీన్ని షైస్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, పెద్ది హరీష్ నిర్మిస్తున్నారు. ఇందులో టాలెంటెడ్ హీరోయిన్లు ఐశ్వర్య రాజేష్, రీతూ వర్మ నటిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. నాజర్, జగపతిబాబు, రావు రమేశ్ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











