రియల్ హీరో బయోపిక్‌లో నాని: హిట్ ఇచ్చిన దర్శకుడితో అదిరిపోయే ప్లాన్
ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. సహజ సిద్ధమైన నటనతో అనతి కాలంలోనే బడా హీరోగా ఎదిగిపోయాడు నేచురల్ స్టార్ నాని. అద్భుతమైన నటనతో ప్రతి సినిమానూ వన్ మ్యాన్ షోగా మార్చేసే ఈ హీరో.. మార్కెట్‌ను కూడా గణనీయంగా పెంచుకున్నాడు. ఫలితంగా రిజల్టుతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రస్తుతం నాని నటించిన చిత్రాలు మూడు పట్టాలపై ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ టాలెంటెడ్ హీరో మరో చిత్రాన్ని కూడా లైన్‌లో పెట్టేసినట్లు తాజాగా ఓ న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
గతంలో తనకు 'జెర్సీ' వంటి భారీ హిట్‌ను అందించిన గౌతమ్ తిన్ననూరితో నేచురల్ స్టార్ నాని మరో సినిమాను చేస్తున్నాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దీనిపై మరో న్యూస్ బయటకు వచ్చింది. తాజా సమాచారం ప్రకారం.. వీళ్లిద్దరి కాంబోలో వచ్చే ఈ సినిమా యుద్ధంలో కాళ్లు కోల్పోయిన ఓ సైనికుడి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందనుందట. అంతేకాదు, ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌తో పలు భాషల్లో తెరకెక్కనుందని అంటున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే రాబోతుందనే టాక్ వినిపిస్తోంది.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి.. షాహీద్ కపూర్ హీరోగా 'జెర్సీ' హిందీ రీమేక్ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా దాదాపు పూర్తైంది. త్వరలోనే విడుదల కాబోతుంది. మరోవైపు, నాని మాత్రం ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో 'టక్ జగదీష్' అనే సినిమాను చేశాడు. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. దీనితో పాటు 'శ్యామ్ సింగరాయ్', 'అంటే.. సుందరానికీ' అనే సినిమాను సైతం చేస్తున్నాడు. ఇవి పూర్తైన వెంటనే గౌతమ్‌తో ప్రాజెక్టును పట్టాలెక్కించేలా నాని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











