జాతీయ అవార్డు దక్కించుకున్న సినిమా రీమేక్‌లో నాని.. రవితేజ తర్వాత ఈ హీరోనే.!
నాని.. తన సహజ సిద్ధమైన నటనతో తెలుగు వారి మనసు దోచిన యంగ్ హీరో. స్వయంకృషితో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి అనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఈ క్రమంలోనే నేచురల్ స్టార్ అని కూడా బిరుదును దక్కించుకున్నాడు. నటన, బావోద్వేగాలు పండించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న ఈ యంగ్ హీరో కెరీర్ మంచిగానే సాగిపోతోంది. ఈ నేపథ్యంలో వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇందులో భాగంగా నాని.. ఓ సినిమాను రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడని వార్త ఒకటి బయటకు వచ్చింది.

జెర్సీతో మరోసారి హిట్ ట్రాక్
కెరీర్ మంచి ఊపుమీదున్న దశలో ‘కృష్ణార్జున యుద్ధం', ‘దేవదాస్' వంటి చిత్రాలతో తీవ్ర నిరాశను ఎదుర్కొన్నాడు నేచురల్ స్టార్ నాని. ఈ సినిమాల తర్వాత అతడు నటించిన చిత్రం ‘జెర్సీ'. క్రికెట్ బ్యాగ్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా నానిని మరోసారి హిట్ ట్రాక్ ఎక్కించింది. ఇందులో నాని నటనకు, పలికించిన హావభావాలకు మంచి మార్కులే పడ్డాయి.

వరుసగా రెండు సినిమాలు
ఈ సినిమా తర్వాత నాని.. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘గ్యాంగ్ లీడర్' అనే సినిమాలో నటిస్తున్నాడు. పూర్తి ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాను సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీని తర్వాత ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘V' అనే సినిమాలో నటించనున్నాడు నాని. ఇందులో అతడు నెగెటివ్ పాత్రలో కనిపించనున్నాడు.

బాలీవుడ్ మూవీ రీమేక్
ఇక, ఈ రెండు సినిమాల తర్వాత నాని.. బాలీవుడ్‌లో గత ఏడాది విడుదలై పెద్ద విజయాన్ని సాధించిన చిత్రం ‘అంధాధున్' రీమేక్‌లో నటించనున్నాడని తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టుబు ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీరామ్ రాఘవన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో నటనకుగానూ ఆయుష్మాన్ ఖురానా జాతీయ ఉత్తమ నటుడు అవార్డును అందుకున్నారు.

రవితేజలా చేస్తాడంటున్నారు
మాస్ మహారాజ రవితేజ ‘రాజా ది గ్రేట్' అనే సినిమాలో అంధుడిగా కనిపించిన విషయం తెలిసిందే. ఇందులో అతడి నటన, బాడీ లాంగ్వేజ్‌కు మంచి మార్కులే పడ్డాయి. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇప్పుడు నాని కూడా అదే తరహా పాత్ర చేస్తాడని వార్త బయటకు రావడంతో అంతా రవితేజతో పోలుస్తూ చర్చించుకుంటున్నారు.

తమిళంలో కూడా..
‘అంధాధున్'ను తమిళంలో కూడా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. తమిళంలో విడుదలై తెలుగులోనూ ఘన విజయం సాధించిన ‘జీన్స్', ‘జోడి' చిత్రాల ఫేమ్ ప్రశాంత్ హీరోగా ఈ రీమేక్ రూపొందనుంది. ఇప్పటికే ఈ రీమేక్ హక్కులను ప్రశాంత్ తండ్రి, సీనియర్ నటుడు, దర్శకుడు త్యాగరాజన్ సొంతం చేసుకున్నారు.


Click it and Unblock the Notifications











