అది ‘వైఎస్’ నీచ చరిత్ర.. సొంత బాబాయినే.. విభేదాలు సృష్టించొద్దు: జగన్‌పై నారా రోహిత్ ఫైర్
తమ కుటుంబంలో విభేదాలు నెలకొన్నాయంటూ వస్తున్న వార్తలపై టాలీవుడ్ హీరో నారా రోహిత్ స్పందించాడు. అలాంటి వార్తలను నమ్మవద్దని ఆయన సూచించారు. హీరో రోహిత్‌కు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెదనాన్న అనే విషయం తెలిసిందే. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో తమ కుటుంబంపై వస్తున్న వార్తలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకొని నారా రోహిత్ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆయన ఏమన్నారంటే..

విభేదాలు సృష్టించొద్దని
రాష్ట్ర అభివృద్ధికి నారా పేరును బ్రాండ్ అంబాసిడర్‌గా చేయడంలో చంద్రబాబునాయుడు కృషి అభినందనీయం. మా నాన్న రాంమూర్తినాయుడు, పెదనాన్న రామలక్ష్మణుల్లా కలిసి ఉంటారు. వారి మధ్య విభేదాలు ఉన్నాయని వ్యాఖ్యానించడం బాధకరం. మీ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం అన్నదమ్ముల మధ్య విభేదాలు సృష్టించవద్దు అని నారా రోహిత్ అన్నారు.

రాజకీయ ప్రయోజనాల కోసం బురద చల్లొద్దు
నారా పేరును నిలబెట్టడానికి మా కుటుంబం నుంచి ఒక్కరు చాలు. అందుకే మేము క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నాం. మీ రాజకీయ ప్రయోజనాల కోసం మా కుటుంబంపై, మా రిలేషన్స్‌పై బురద చల్లకండి. నాలుగు దశాబ్దాల క్రితమే సమాజ అభివృద్ధి కోసం మా ఆస్తులను పాఠశాలలు, పంచాయితీ భవనాలకు విరాళంగా ఇచ్చాం అని నారా రోహిత్ తన ప్రకటనలో పేర్కొన్నారు.

అలాంటి ఆరోపణలు అవాస్తవం
మాకు రాష్ట్రాభివృద్దే ముఖ్యం. మా కుటుంబాన్ని మా పెదనాన్న నిర్లక్ష్యం చేశారన్న వాదన నూటికి నూరుపాళ్లు అవాస్తవం. అసత్యం. రాత్రింబవళ్ళు శ్రమించి 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఎలా చూసుకుంటున్నారో.. అదే విధంగా మమ్మల్ని కూడా చూసుకొంటున్నారు అని నారా రోహిత్ ప్రకటనలో వెల్లడించారు.

అది వైఎస్ కుటుంబ చరిత్ర అని
ఎంపీ పదవి కోసం సొంత బాబాయిపై చేయి చేసుకొన్న చరిత్ర మాది కాదు. అది వైఎస్ కుటుంబ చరిత్ర. మాకు పదవులు ముఖ్యం కాదు. మాకు అలాంటి నీచ చరిత్ర అవసరం లేదు. కోర్టులు, జైళ్ల చుట్టూ తిరిగే మీకు కుటుంబ బాంధవ్యాల విలువ తెలుసా? అని వైఎస్ఆర్ కాంగ్రెస్‌పై నారా రోహిత్ విరుచుకుపడ్డారు.

ఆరోగ్యం సహకరించడం లేదని
ప్రతీ ఏడాది మాతో కలిసి సంక్రాంతి పండుగ జరుపుకొంటారు. ముఖ్యమంత్రిలా కాకుండా ఓ కుటుంబ పెద్దలా గడుపుతున్నారు. మాకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత మాకు ఇస్తున్నారు. మా నాన్న ఆరోగ్యం సరిగా లేని కారణంగానే రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు అని నారా రోహిత్ తెలిపారు.


Click it and Unblock the Notifications











