అసలు సినిమాకు మోక్షం కలుగుతుందా.. ఈసారైనా చెప్పిన సమయానికి వస్తాడా?
ఈ మధ్య కాలంలో నిఖిల్ సినిమాకు పడ్డ బ్రేకులు మరే సినిమాకు పడి ఉండవు. సినిమా రిలీజ్ డేట్ చెప్పిన ప్రతీసారి వాయిదా పడుతూనే వస్తోంది. ఇది సరిపోనట్టు.. టైటిల్ వివాదం కూడా చిత్రయూనిట్‌ను కొంత నిరాశ పరిచింది. అయితే ఎట్టకేలకు ఈ మూవీ డేట్ ఫిక్స్ అయింది. ఈ మేరకు మంచు లక్ష్మీ ఫీట్ అప్ విత్ ది స్టార్ అనే షోలో పాల్గోన్న నిఖిల్ రిలీజ్ డేట్‌ను రివీల్ చేశాడు.

ఇప్పటికే ఎన్నో వాయిదాలు..
ఈ సినిమా ఇప్పటికే థియేటర్లలోకి వచ్చి మంచి విజయాన్ని అందుకోవాల్సింది. కానీ ఇంకా రాకపోవడం నిర్మాతలకు నష్టం కలిగించే అంశమే. తమిళ మూవీకి (కణిథణ్) రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీపై టైటిల్ వివాదం కూడా వచ్చి పడింది. మొదట్లో ముద్ర అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. పోస్టర్స్, ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు.

‘అర్జున్ సురవరం'గా పేరు మార్పు...
నిర్మాత నట్టికుమార్‌తో వివాదం తలెత్తడంలో టైటిల్‌ను మార్చవలసి వచ్చింది. సోషల్ మీడియాలో ఓ కాంటెస్టెంట్‌ను నడిపి మరీ అభిమానుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు. అయితే అంతకు ముందే వదలిన టీజర్లో క్యారెక్టర్ పేరును రివీల్ చేయడంతో.. దాన్నే టైటిల్‌గా పెట్టమని సూచించడంతో అర్జున్ సురవరం అంటూ మార్పు చేశాడు.

తాజాగా పాల్గొన్న షోలో ఆసక్తికర విషయాలు..
మంచు లక్ష్మీ హోస్ట్ చేస్తున్న ఫీట్ అప్ విత్ ది స్టార్ అనే షోకు వచ్చిన నిఖిల్.. ఎన్నో ఆస్తకికర విషయాలను వెల్లడించాడు. తన ప్రేమ విషయాన్ని బయటపెట్టి అందర్నీ షాక్‌కు గురిచేశాడు. అలాగే వాయిదా పడుతూ వస్తోన్న అర్జున్ సురవరం సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించేశాడు.

స్టెప్పులేస్తున్న ఫోటోను చూపిస్తూ...
మైనస్ ఐదు డిగ్రీల చలిలో డ్యాన్సు వేస్తున్నట్లు, శేఖర్ మాష్టర్ చెప్పిన స్టెప్ రావడం లేదంటూ.. అర్జున్ సురవరం గురించి చెప్పుకొచ్చాడు. ఈ మూవీ నవంబర్ 8న విడుదల కానుందని తెలిపాడు. మరి ఈసారైనా చెప్పిన సమయానికి వస్తాడో లేదో చూడాలి.


Click it and Unblock the Notifications











