పెళ్లికి సిద్ధమైన మరో టాలీవుడ్ యంగ్ హీరో.. వచ్చే ఏడాది ప్రేమించిన అమ్మాయితో వివాహం.!
బ్యాగ్రౌండ్ లేకున్నా తెలుగు సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు యంగ్ హీరో నిఖిల్. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'హ్యాపీడేస్' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ఈ కుర్రాడు.. తర్వాత సోలో హీరోగా కొన్ని సినిమాలు చేశాడు. వీటిలో చాలా వరకు ఆశించినంతగా ఆడలేదు. కానీ, 2013లో వచ్చిన 'స్వామి రారా'తో నిఖిల్ కెరీర్ ఒక్కసారిగా ఊపందుకుంది.
ఈ సినిమా తర్వాత 'కార్తికేయ', 'ఎక్కడికి పోతావు చిన్నవాడ' అనే హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తాజాగా అతడు నటించిన 'అర్జున్ సురవరం' కూడా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో నిఖిల్ పెళ్లి గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఇంతకీ ఏంటా వార్త..? పూర్తి వివరాల్లోకి వెళితే..

అర్జున్ దూసుకుపోతున్నాడు
నిఖిల్ - లావణ్య త్రిపాఠి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘అర్జున్ సురవరం'. నూతన దర్శకుడు టీఎన్ సంతోష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇటీవల విడుదలైంది. తొలి రోజు నుంచే ఈ సినిమా మంచి టాక్‌తో పాటు కలెక్షన్లను కూడా రాబడుతోంది. ఇప్పటికి ‘అర్జున్ సురవరం' రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 8.31 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక, ప్రపంచ వ్యాప్తంగా రూ. 9.51 కోట్లు రాబట్టింది.

హిట్ సినిమాకు సీక్వెల్
‘అర్జున్ సురవరం' విడుదల కాకముందే నిఖిల్ మరో ప్రాజెక్టును పట్టాలెక్కించేశాడు. అదే.. ‘కార్తికేయ 2'. ఈ సినిమాను కూడా చందూ మొండేటి తెరకెక్కిస్తున్నాడు. దీనితో పాటు సుకుమార్ కథ అందిస్తున్న మరో సినిమాలోనూ నటించనున్నాడు. దీనిని సుకుమార్‌తో పాటు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది. పలనాటి సూర్య ప్రతాప్ దీనికి దర్శకత్వం వహించనున్నారు.

లవ్ స్టోరీ రివీల్ చేసిన నిఖిల్
కొద్ది రోజుల క్రితం మంచు లక్ష్మి హోస్ట్ చేస్తున్న ‘ఫీట్ అప్ విత్ ది స్టార్స్' షోలో పాల్గొన్న నిఖిల్ తన లవ్ స్టోరీని రివీల్ చేశాడు. నా జీవితంలో ఓ స్పెషల్ అమ్మాయి ఉంది. ఆమె డాక్టర్. తను చాలా మంచిది. నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. నేను షూటింగ్‌లో ఉన్నప్పుడు కానీ స్నేహితులతో బయటికి వెళ్లినప్పుడు కానీ ఎప్పుడూ డిస్టర్బ్ చేయదు' అని చెప్పుకొచ్చాడు.

పెళ్లికి ముహూర్తం పెట్టేస్తున్నారు
ఇప్పటికే తనకు గర్ల్‌ఫ్రెండ్ ఉందని ప్రకటించాడు నిఖిల్. దీంతో అతడి పెళ్లి ఎప్పుడు జరుగుతుందని అంతా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిఖిల్ పెళ్లి గురించి ఓ వార్త బయటకు వచ్చింది. అతడు వచ్చే ఏడాది ఏప్రిల్‌లో తన ప్రేయసిని పెళ్లి చేసుకోబోతున్నాడట. ఈ లోపు నిశ్చితార్ధం జరుపుకోవాలని భావిస్తున్నట్లు ఇండస్ట్రీలో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.

ఆమెతో పెళ్లి ఆగిపోయింది
2017లో హైదరాబాద్‌కు చెందిన ఓ పారిశ్రామికవేత్త కుమార్తెతో నిఖిల్‌కు నిశ్చితార్థం అయింది. ఇది ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి ఇరు కుటుంబ సభ్యులతో పాటు కొందరు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అయితే, వీళ్ల బంధం పెళ్లి పీటల వరకు వెళ్లకుండానే బ్రేక్ అయిపోయింది. దీంతో అప్పట్లో ఈ వార్త పెద్ద సంచలనమే అయింది.


Click it and Unblock the Notifications











