నేను చేయాలనుకుంటున్నది అది మాత్రమే: పాలిటిక్స్‌పై తేల్చి చెప్పిన మహేష్
ఒక నటుడికి సినీ పరిశ్రమలో భాగం కావడానికి అతిపెద్ద ప్రేరణ వారికి నటనపై ఉన్న మక్కువే అని చెప్పక తప్పదు. ఆ అభిరుచి స్థాయి ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. దాన్ని బట్టే వారు ఇండస్ట్రీలో రాణించడం జరుగుతుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు విషయం తీసుకుంటే ఇది ఆయనకు కావాల్సినంత ఉందని చెప్పక తప్పదు.
మహేష్ బాబు గురించి ఇటీవల కొన్ని రూమర్లు తెరపైకి వచ్చాయి. త్వరలో ఆయన రాజకీయాల్లో జాయిన్ అవుతారంటూ వార్తలు తెరపైకి వచ్చాయి. గతంలోనూ ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు మహేష్ బాబు స్పందిస్తూ ఖండించారు. తాజాగా అవే వార్తలు మళ్లీ తెరపైకి రావడంపై సూపర్ స్టార్ తనదైన శైలిలో స్పందించారు.

నేను చేయాలనుకుంటున్నది నటన మాత్రమే
ఓ ప్రముఖ ఆంగ్లపత్రికతో మహేష్ బాబు మాట్లాడుతూ... ‘‘నేను చేయాలనుకుంటున్నది నటన మాత్రమే. నా చైల్డ్ హుడ్ జ్ఞాపకాల్లోకి వెళితే, అప్పటి నుంచే నేను నటనను ఇష్టపడ్డాను. ఈ విషయంలో చాలా ఆసక్తిగా ఉండేవాడిని, వేసవి సెలవులు వస్తే షూటింగుకు వెళ్లేవాడిని, చాలా సార్లు స్కూల్ బంక్ కొట్టి షూటింగ్ వెళ్లేవాడిని'' అని వెల్లడించారు.

సినిమాల వల్ల చదువులో వెనకబడ్డాను
సినిమా షూటింగులకు రావడానికి చదువు నిర్లక్ష్యం చేయడంతో వెనకబడ్డాను. దీంతో నాన్నగారు నువ్వు షూటింగులు ఆపేసి చదువుకో అన్నారు. చదువు పూర్తయిన తర్వాతే రావాలన్నారు. మళ్లీ సినిమాల్లోకి రావడానికి చదువు పూర్తి చేశాను. నా మనసులో సినిమాలు తప్ప మరో ఆలోచన లేదని నాన్నగారికి కూడా తెలుసు' అని మహేష్ బాబు చెప్పుకొచ్చారు.

రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని తేల్చి చెప్పిన మహేష్ బాబు
తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశ్యం లేదని మహేష్ బాబు మరోసారి కుండ బద్దలు కొట్టారు. సినిమాలు తప్ప తనకు మరో ప్రపంచం తెలియదని ఆయన స్పష్టం చేశారు. మహేష్ బాబు సొంతగా తన సినీ నిర్మాణ సంస్థను కూడా స్థాపించిన సంగతి తెలిసిందే.

సరిలేరు నీకెవ్వరు
మహేష్ బాబు సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ‘సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటిస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర, దిల్ రాజు నిర్మిస్తున్నారు. మహేష్ బాబు ప్రొడక్షన్ కూడా ఇందులో నిర్మాణ భాగస్వామిగా ఉంది. ఇందులో సూపర్ స్టార్ మిలటరీ మేజర్ పాత్రలో కనిపించబోతున్నారు.


Click it and Unblock the Notifications











