‘పింక్’ రీమేక్‌లో పవన్ రెమ్యూనరేషన్ అంతా! ఇదీ రికార్డేనంటూ నోరెళ్లబెడుతున్న సినీ పెద్దలు
పవన్ కల్యాణ్.. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు చాలా ప్రాంతాల్లో ఈ పేరంటే పిచ్చి. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ రంగ ప్రవేశం చేసినప్పటికీ, తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. టాలీవుడ్‌లోని మిగిలిన హీరోలతో పోలిస్తే ఈయన స్టైల్ ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కల్యాణ్‌కు ఉన్న అభిమానులు మరే హీరోకూ లేరని అంటుంటారు. రాజకీయాల్లోకి ఎంటరైన తర్వాత సినిమాలకు దూరమయ్యాడు పవన్. అయితే, అతడు త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆ సినిమా కోసం పవన్ రెమ్యూనరేషన్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే....

పింక్ రీమేక్‌లో పవన్
అమితాబ్ బచ్చన్, తాప్సీ ముఖ్య పాత్రలో నటించిన ‘పింక్'. బాలీవుడ్‌లో వచ్చిన సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తెలుగు హక్కులను తీసుకున్న దిల్ రాజు.. ఇటీవలే పవన్ కల్యాణ్‌తో సంప్రదింపులు జరిపారని, ఈ సినిమా చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదే సినిమాకు శ్రీదేవి భర్త బోనీ కపూర్ సహ నిర్మాతగా వ్యవహరించనున్నారని కూడా టాక్ వినిపిస్తోంది.

బాలయ్యను అనుకున్నారు
కొద్ది రోజుల క్రితం ఈ సినిమాను బాలయ్యతో చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. కథ కూడా ఆయనకు వినిపించారని అన్నారు. అయితే, బాలకృష్ణ ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ‘రూలర్' అనే సినిమా చేస్తున్నారు. దాని తర్వాత బోయపాటి సినిమా చేస్తారు. దీంతో ఈ సినిమా మరొకరితో చేయాలని దిల్ రాజు భావించినట్లు సమాచారం.

యంగ్ డైరెక్టర్‌కు ఛాన్స్
ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ తెరకెక్కించనున్నాడనే టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి వేణు - దిల్ రాజు కాంబినేషన్‌లో బన్నీ ‘ఐకాన్' అనే సినిమా చేయాల్సి ఉంది. కానీ, అది ఎందుకో ఇంకా ప్రారంభం కాలేదు. అదే సమయంలో బన్నీ.. సుకుమార్‌తో సినిమా చేయడానికి పచ్చ జెండా ఊపేశాడు. అంటే ‘ఐకాన్' ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశాలు లేవు. ఈ కారంణంగానే ‘పింక్' రీమేక్ చేయబోతున్నారట.

టైటిల్ కూడా ఫిక్స్ చేశారట
పవన్ కల్యాణ్ లాయర్ పాత్ర పోషించనున్న ఈ సినిమాకు గతంలో అనుకున్నట్లు ‘లాయర్ సాబ్' అనే టైటిల్‌నే అనుకుంటున్నారట. ఇప్పటికే దిల్ రాజు ఈ సినిమా టైటిల్‌ను ఫిలిం చాంబర్లో రిజిష్టర్ చేయించి ఉంచారని గతంలోనే వార్తలు వచ్చాయి. కొద్ది రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అవుతుందని అంటున్నారు.

పవన్ భారీ డిమాండ్స్
‘పింక్' రీమేక్‌కు సంబంధించి తాజాగా ఓ వార్త బయటకు వచ్చింది. అదేమిటంటే... ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ రూ. 40 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. అంతేకాదు, లాభాల్లో 25 శాతం వాటా కూడా ఇవ్వాలని అంటున్నాడట. పవన్ చేస్తున్న డిమాండ్స్‌కు సినీ పెద్దలు విస్మయం వ్యక్తం చేస్తున్నారని టాక్. ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ, ప్రస్తుతం ఈ వార్త మాత్రం ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది.


Click it and Unblock the Notifications











