సమంతకో న్యాయం.. పవన్‌కి ఓ న్యాయమా , టాలీవుడ్ పెద్దలపై భగ్గుమంటున్న జనసైనికులు
రాజకీయ నాయకులు ప్రత్యర్ధులపై విమర్శలు చేసుకునే క్రమంలో సినీ తారల వ్యక్తిగత జీవితాలను బయటకు లాగడం దుమారం రేపుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయిలో జరుగుతోంది. ఈ క్రమంలో ఆర్ఎస్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను విమర్శించే సమయంలో టాలీవుడ్ సెలబ్రెటీలు సమంత, నాగచైతన్య పేర్లను మంత్రి కొండా సురేఖ ప్రస్తావించారు. ఈ జంట విడాకులు తీసుకోవడానికి కేటీఆర్ కారణమని సురేఖ ఆరోపించారు. దీంతో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.
కేటీఆర్ చాలా మంది హీరోయిన్లకు డ్రగ్స్ అలవాటు చేసి వారి జీవితాలను నాశనం చేశాడని కొండా సురేఖ ఆరోపించారు. ఆయన వల్ల ఎంతో మంది హీరోయిన్లు కెరీర్ మధ్యలోనే పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోయారని ఆమె వ్యాఖ్యానించారు. సమంత- నాగచైతన్య విడిపోవడానికి కూడా కేటీఆరే కారణమని సురేఖ ఆరోపించారు. కొండా సురేఖ వ్యాఖ్యలపై తెలంగాణలోని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ నేతలు మండిపడ్డారు. అటు సినీ పరిశ్రమ కూడా ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించింది. నాగార్జున, నాగచైతన్య, సమంత, జూనియర్ ఎన్టీఆర్, నాని, చిరంజీవి, అల్లు అర్జున్, మంచు విష్ణు, మంచు లక్ష్మీ, కోన వెంకట్ సహా పలువురు ప్రముఖులు కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు.

అంతా బాగానే ఉంది కానీ పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ వ్యవహారంతో బాగా డిజప్పాయింట్ అవుతున్నారు. ఓ సినీ కుటుంబం, ఓ మహిళపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తే తప్పేముంది అనుకోవచ్చు. కానీ వారి ఆవేదన వెనుక అసలు అర్ధం వేరే ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండగా.. ఆయనను నేరుగా ఎదుర్కోలేక నాటి వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగారు. పవన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సభలు, సమావేశాలు , ర్యాలీలు నిర్వహించినా ఆ వెంటనే వైసీపీ నేతలు మైక్ పట్టుకుని రెడీగా ఉండేవారు. ఎప్పుడు చూడు మూడు పెళ్లిళ్లు, దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అంటూ పవన్‌పై విమర్శలు చేసేవారు. ముఖ్యంగా అంబటి రాంబాబు, రోజా, గుడివాడ అమర్‌నాథ్, పేర్నినాని, జోగి రమేశ్ లు జనసేన అధినేతపై ఒంటికాలిపై లేచేవారు.
ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా వైసీపీ నేతలను కంట్రోల్ చేయాల్సిన వైఎస్ జగన్ కూడా బహిరంగ సభల్లో నేరుగా పవన్‌పై వ్యక్తిగత విమర్శలు చేశారు. వైసీపీ సోషల్ మీడియా విభాగంలో పవన్ కళ్యాణ్, ఆయన కుటుంబ సభ్యులపై దారుణమైన రాతలు రాసేవారు. మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలతో ట్రోలింగ్‌కు దిగేవారు. పవన్ మొదట్లో వీటిని అంతగా పట్టించుకునేవారు కాదు. కానీ వైసీపీ నేతల విమర్శలు శృతిమించడంతో ఆయన సైతం రియాక్ట్ కాక తప్పలేదు. తనను పదే పదే ప్యాకేజీ స్టార్ అంటూ విమర్శించిన వారికి చెప్పుతో కొడతానంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఇండస్ట్రీకి చెందిన నటుడు, రచయిత పోసాని అయితే పవన్‌ను బహిరంగంగా బూతులు తిట్టిన సందర్భాలు ఉన్నాయి. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో పవన్ వ్యక్తిగత జీవితంపై పోసాని చేసిన వ్యాఖ్యలు ఏకంగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన సంగతి తెలిసిందే. పవన్‌పైనా, ఆయన వ్యక్తిగత జీవితంపైనా, కుటుంబ సభ్యులపైనా ఎన్నోసార్లు దారుణంగా ట్రోలింగ్ జరిగిందని, కానీ ఇండస్ట్రీ నుంచి ఒక్కరంటే ఒక్కరైనా వచ్చి పవన్‌కు మద్ధతుగా మాట్లాడారా అని ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. తీరా ఇప్పుడు సమంత, నాగచైతన్యలను కొండా సురేఖ ఏదో అందని మొత్తం టాలీవుడ్ స్పందించడం ఏంటని వారు నిలదీస్తున్నారు. పవన్ కళ్యాణ్‌పై పోసాని మాట్లాడిన పాత వీడియోను బయటకు తీసి టాలీవుడ్ పెద్దలపై విమర్శలు గుప్పిస్తున్నారు.


Click it and Unblock the Notifications











