ఢిల్లీ హైకోర్టుకు పవన్ కళ్యాణ్.. 7 రోజులు డెడ్‌లైన్ విధించిన కోర్ట్, ఏం జరిగిందంటే?
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ప్రముఖులు టార్గెట్‌గా దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. అక్కడితో ఆగకుండా నటీనటులు, సెలబ్రిటీల అనుమతి లేకుండా వారి ఫోటోలను వాడుకుంటున్న పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖులకు జనంలో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని వారి ఫోటోలను కొన్ని ఈ కామర్స్ సంస్థలు, వాణిజ్య సంస్థలు ఉపయోగించుకుంటున్నాయి. కొందరు వీటిని చూసీ చూడనట్లుగా వదిలేస్తుండగా.. హద్దు దాటుతుండటంతో సెలబ్రిటీలు చట్ట ప్రకారం చర్యలకు దిగుతున్నారు.
తమ అనుమతి లేకుండా తమ పేరు, ఫోటో, వీడియోలు ఉపయోగించుకోకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ అజయ్ దేవగణ్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, అమితాబ్ బచ్చన్, కరణ్ జోహార్, అనిల్ కపూర్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్, భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ తదితరులు న్యాయస్థానాలను ఆశ్రయించారు. మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్‌లు న్యాయపరంగా పోరాటం చేసి తమ హక్కులను సాధించుకున్నారు.

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్. ఈ పేరు గురించి తెలియని వారుండరు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన తన ప్రతిభతో టాలీవుడ్‌లో తిరుగులేని హీరోగా నిలిచారు. తన నటన, డైలాగ్స్, మేనరిజంతో స్టార్‌గా ఎదిగారు. సినిమాల కంటే తన వ్యక్తిత్వంతోనే పవన్ కళ్యాణ్ కోట్లాది మంది అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించారు. ఇక తనను ఇంతటి వాడిని చేసిన సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని జనసేన పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి దిగారు. పదేళ్ల పాటు పోరాడి 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యర్ధి పార్టీలకు చెందిన వారు సోషల్ మీడియా ద్వారా ట్రోలింగ్‌కు దిగారు. ఆయన వ్యక్తిగత జీవితం, పెళ్లిళ్లను టార్గెట్ చేసుకుని దారుణంగా కామెంట్స్ చేసేవారు. ఇక పవన్ కళ్యాణ్‌కు ఉన్న కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను పలు కంపెనీలు క్యాష్ చేసుకుంటున్నాయి. ఆయన పేరు, ఫోటోలను ఉపయోగించి పబ్లిసిటీ చేస్తున్నాయి. వీటిని చాలా వరకు పవన్ కళ్యాణ్ పట్టించుకోలేదు.. అయితే ఆయా వ్యక్తులు, సంస్థలు హద్దు దాటడంతో జనసేనాని సీరియస్ అయ్యారు. దీనిలో భాగంగా ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
తన వ్యక్తిగత హక్కులకు భంగం కలిగించేలా కొందరు సోషల్ మీడియాలో వ్యవహరిస్తున్నారని.. తన పేరు ప్రతిష్టలకు, హక్కులకు భంగం కలిగించేలా సోషల్ మీడియా, ఈ కామర్స్ సైట్స్ వేదికగా పోస్టులు పెడుతున్నారని వాటిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పవన్ కళ్యాణ్ తరపున న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. తన అనుమతి లేకుండా పేరు, ఫోటోలు, వీడియోలు, వ్యక్తిగత సమాచారాన్ని వాణిజ్య అవసరాలకు వినియోగించుకుండా చూడాలని పవన్ తన పిటిషన్‌లో కోరారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం సంబంధిత లింకులను 7 రోజుల లోపు తొలగించాలని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే తదుపరి విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేసింది. అలాగే ఆయా లింకులను సోషల్ మీడియా సంస్థకు అందజేయాలని పవన్ తరపు న్యాయవాదికి 48 గంటల సమయం ఇచ్చింది. ప్రస్తుతం ఈ వ్యవహారం తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.


Click it and Unblock the Notifications











