పాలిటిక్స్‌లో ఉంటూ మీరు సిమెంట్ కంపెనీలు.. పాల ఫ్యాక్టరీలు నడుపొచ్చు.. నేను సినిమాలు చేస్తే తప్పా.. పవన్ ఫైర్
మూడేళ్ల తర్వాత మళ్లీ వకీల్ సాబ్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న పవన్ కల్యాణ్ ఉద్వేగ పూరితమైన ప్రసంగాన్ని చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుదీర్ఘమైన ప్రసంగాన్ని చేసి పవర్ స్టార్ ఆకట్టుకొన్నారు. వకీల్ సాబ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..

బండ్ల గణేష్‌లా మాట్లాడలేను
వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన అభిమానలకు, టీవీలో వీక్షిస్తున్న ప్రతీ ఒక్కరికి, ఆడపడుచులకు, నా గుండె చప్పుడైన అభిమానులందరికీ నా నమస్కారం. సినిమా ఫంక్షన్లలో మాట్లాడి చాలా రోజులైంది. నేను బండ్ల గణేష్‌లా మాట్లాడలేను. రాజకీయ సభలంటే ఎలాంటి భయం లేకుండా మాట్లాడగలను. సినిమాలకు దూరం అయ్యానని ఫీల్ కాలేదు. కాకపోతే ఎప్పుడూ నా గుండె అభిమానుల కోసం, దేశం కోసమే ఆలోచిస్తాను అని పవన్ కల్యాణ్ అన్నారు.

మూడేళ్లు సినిమా చేయలేదంటే..
మూడు సంవత్సరాలు సినిమాలు చేయడం లేదంటే నాకు అలా అనిపించలేదు. సినిమా ఇండస్ట్రీకి వచ్చి 23 సంవత్సరాలు అయిందంటే నాకు నమ్మబుద్ది కాలేదు. తెలుగు సినిమా చరిత్రలో ఎంతో ఎత్తుకు ఎదిగి.. అద్భుతమైన విజయాలు సాధించిన దిల్ రాజు లాంటి వ్యక్తితో.. వకీల్ సాబ్ చేయడం నిజంగా అదృష్టంగా భావిస్తాను అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

కలలు కనే వారంటే ఇష్టం
అలాగే నా జీవితంలో కలలు కనే వాళ్లను బాగా ఇష్టపడుతాను. జీవితంలో ఎవరైనా ఓ కల కనాలి. ఇది సాధిస్తాననే కలతో ప్రయాణం సాగించాలి. రచయిత శేషేంద్ర శర్మ కూడా కలలు కావాలని కోరుకొనే వారు. దిల్ రాజు కలలు కని మహోన్నతమైన స్థాయికి చేరుకొన్నారు అని పవన్ కల్యాణ్ తెలిపారు.

దిల్ రాజుతో సినిమా చేయడం ఇష్టం
చాలా ఏళ్లుగా నా సినిమాలు డిస్ట్రిబ్యూషన్‌ను దిల్ రాజు చేశారు. వకీల్ సాబ్ సినిమా చేయడం నిజంగా అదృష్టం. దిల్ రాజుతో ఎప్పుడో సినిమా చేయాల్సిందనే ఫీలింగ్ కలిగింది. చిన్నస్థాయి నుంచి వచ్చిన దిల్ రాజు, వేణు శ్రీరాం లాంటి వ్యక్తులు ఈ స్థాయికి వచ్చి సినిమా చేయడం పవన్ కల్యాణ్ ఇచ్చిన అవకాశం కాదు. వాళ్లు సాధించిన విజయం. స్వశక్తితో దర్శకుడిగా అవకాశాన్ని దక్కించుకొన్నారు. వేణు శ్రీరాం లాంటి చక్కటి దర్శకుడితో పనిచేయడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను అని పవన్ కల్యాణ్ అన్నారు.

నేను సినిమాల్లో నటిస్తే తప్పా..
రాజకీయాల్లో ఉంటూ సినిమాలు ఎందుకు చేయాలని కొందరు అనవసరపు వాదనలు చేస్తున్నారు. మీరు రాజకీయాల్లో ఉంటూ సిమెంట్ ఫ్యాక్టరీలు నడుపొచ్చు, పాల ఫ్యాక్టరీలు పెట్టొచ్చు. నేను సినిమాల్లో నటిస్తే తప్పా అని పవన్ ప్రశ్నించారు. పేకాట క్లబ్బులు నడిపే వాళ్లు ఎమ్మెల్యేలు కావొచ్చు. పైరవీలు చేసే వాళ్లు ఎమ్మెల్యేలు కావొచ్చు అంటూ అధికార, ప్రతిపక్ష పార్టీలపై నిప్పులు చెరిగారు.

అవినీతి చేయకుండా ఉండటానికే సినిమాలు
రాజకీయాల్లో ఉంటూ ప్రధానిగా వ్యవహరించే వారికి రూ.4 లక్షల జీతం, ముఖ్యమంత్రికి లక్షన్నర జీతం, ఎమ్మెల్యేకు లక్ష రూపాయాలు జీతం ఉంటాయి. అలాంటి జీతం కోసం ఎమ్యెల్యేగా కావడానికి అడ్డదార్లు తొక్కుతారు. నేను సినిమా చేస్తే చాలా కుటుంబాలు బతుకుతాయి. అవినితీ చేయకుండా ఉండటానికే సినిమాలు చేస్తున్నాను. సినిమా చేస్తే 1000 కుటుంబాలు బతుకతాయి. మేము సంపాదించే సొమ్ము సినిమాల్లోనే పెడుతాను అని పవన్ కల్యాణ్ అన్నారు.

దర్శకులైన అభిమానులతో సినిమా చేయడం
నాకు భగవంతుడు అవకాశం ఇచ్చినంత వరకు ప్రజల కోసం పనిచేస్తాను. అవకాశం దక్కినప్పుడల్లా సినిమా చేయడానికి ముందుకొస్తాను. వేణు శ్రీరాం, హరీష్ శంకర్, సాగర్ లాంటి అభిమానులు నా దర్శకులు అయినందుకు గర్వపడుతాను. నాపై ఇష్టంతో, ప్రేమతో వారు ఈ రంగానికి వచ్చారు. అలాంటి వారి వల్ల మంచి సినిమాలు, సక్సెస్‌ఫుల్ మూవీస్ చేయడానికి ఛాన్స్ లభిస్తుంది అని పవన్ కల్యాణ్ అన్నారు.


Click it and Unblock the Notifications











