అలా చేస్తే ఏడాదికి నా సంపాదన 1000 కోట్లు.. చంపుతానని బెదిరింపులు.. పవన్ కల్యాణ్
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్రలో మరోసారి నిప్పులు చెరిగారు. రెండో విడుత యాత్రలో భాగంగా పవన్ కల్యాణ్ తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆవేశంగా మాట్లాడారు. స్వర్గీయ ఎస్వీ రంగారావు విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం పలు విషయాలపై తనదైన శైలిలో ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. కిక్కిరిసిన ప్రజల మధ్య పవన్ కల్యాణ్ సభలో మాట్లాడుతూ..
ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకొనే హీరోల్లో నేను ఒకరిని. నేను రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందా? నేను సవ్యంగా సినిమాలు చేస్తే.. ఇతర హీరోలతో పోటీ పడితే..నా సంపాదన సంవత్సరానికి 1000 కోట్లకుపైగానే ఉంటుంది. అయినా నేను డబ్బుకు ఆశపడకుండా నేను రాజకీయాల్లోకి వచ్చాను అని పవన్ కల్యాణ్ అన్నారు.

అంబేద్కర్ ఆశయాలను న్యాయ పోరాట నిపుణుడు నాని ఫాల్కివాలా, ఎమర్జెన్సీ కాలంలో ఇందిరా గాంధీని ఎదుర్కొన్న లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ నాకు ప్రేరణ. బడుగు వర్గాల అభ్యున్నతికి పాల్పడిన రాం మనోహర్ లోహియా నాకు స్పూర్తి. మన కోసం ఆత్మత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు నాకు ఆదర్శం అని అన్నారు.
రాజకీయాల్లోకి వచ్చి ఇలా తిట్టు తినాల్సిన అవసరం నాకు లేదు. కానీ యువతకు ఉపాధి అవకాశాలు రావడానికి, ప్రజలకు మెరుగైన జీవితం అందించాలనేది నా కోరిక. ఉద్యోగులు, చిరు వ్యాపారాలు చేసుకొనే వారికి మేలు చేయాలనే లక్ష్యంతోనే నేను రాజకీయాల్లోకి వచ్చాను. ప్రతీ ఒక్కరికి నా వంతుగా సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను అని పవన్ కల్యాణ్ అన్నారు.
గత ఎన్నికల్లో నేను ఓడిపోయినా మీ కోసం నిలబడి ఉన్నాను. మీ సంక్షేమం కోసం ఎవరితో పోరాటం చేస్తున్నానో తెలుసా? నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నారు. నా బిడ్డను అలా చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ భరిస్తూ నేను రాజకీయంగా ముందుకు వెళ్తన్నాను అని పవన్ కల్యాణ్ చెప్పారు.


Click it and Unblock the Notifications











