మానవత్వం ప్రదర్శించిన పవన్ కల్యాణ్.. ఎండలో సొమ్మసిల్లిన పోలీస్ అధికారికి.. జనసేన అధినేత ట్రెండింగ్
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరుస సినిమాలతో గత కొద్దివారాలుగా బిజీగా ఉండిపోయారు. దాంతో ప్రజాక్షేత్రంలో పర్యటనలకు కొంత గ్యాప్ తీసుకొన్నారు. అయితే ఎడతెరిపి లేకుండా షూటింగ్స్‌లో నిమగ్నమైన పవన్ కల్యాణ్.. మరోసారి ఆంధ్ర ప్రదేశ్‌లో పర్యటించడంతో జనసేన కార్యకర్తల్లో ఉత్సాహం ఉరకలేసింది.
అకాల వర్షాల ప్రభావంతో తల్లడిల్లుతున్న అన్నదాతలను పరామర్శించేందుకు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మానవత్వాన్ని చాటుకొన్న సంఘటన సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నది. ఆ సంఘటన వివరాల్లోకి వెళితే..

రాజమండ్రి రూరల్ ప్రాంతంలో: మే 10వ తేదీన పవన్ కల్యాణ్ రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకొన్నారు. అక్కడి నుంచి రాజమండ్రి నగరం, బొమ్మూరు రాజవోలు మీదుగా రాజమండ్రి రూరల్ నియోజక వర్గంలోని ఆవ భూములలో దెబ్బ తిన్న వ్యవసాయ భూములు పరిశీలించారు. కష్టాల్లో ఉన్న రైతులతో మాట్లాడారు. అనంతరం వేమగిరి, జొన్నాడ, రావులపాలెం, కొత్తపేట మీదుగా అవిడి చేరుకొని నష్టపోయిన రైతులను పరామర్శించారు. తదుపరి పీ గన్నవరం నియోజకవర్గం రాజుపాలెం ప్రాంతానికి వెళ్ళి అక్కడి రైతులతో సంభాషించారు.

పోలీసుల కష్టాన్ని గుర్తించి: పవన్ కల్యాణ్ ఎండను, వాతావరణ పరిస్థితులను లెక్క చేయకుండా ప్రజలతో మమేకం అయ్యారు. పవన్ కల్యాణ్ ర్యాలీని పర్యవేక్షిస్తున్న పోలీసులు ఎండ తాకిడికి గురవ్వడాన్ని జనసేన అధినేత గుర్తించారు. అశేష జనవాహినిలో భాగమైన పోలీసు అధికారి నీరసపడటం గుర్తించిన పవన్ కల్యాణ్.. తన కారులోని ఎనర్జీ డ్రింక్‌ను అందించారు. దాంతో పోలీస్ ఇన్స్‌పెక్టర్ ఆరాధనపూర్వకంగా ఎనర్జీ డ్రింక్‌ను స్వీకరించారు.

ఎనర్జీ డ్రింక్‌ను స్వయంగా అందించి: తన కోసం తెచ్చుకొన్న ఎనర్జీ డ్రింక్‌ను స్వయంగా పవన్ కల్యాణ్ అందించిన సన్నివేశం అందర్నీ ఆకట్టుకొన్నది. పవన్ కల్యాణ్ స్పందించిన తీరు అభిమానుల్లో జోష్ పెంచింది. పవన్ కల్యాణ్ అందించిన ఎనర్జీ డ్రింక్‌ను అందుకొన్న ఆఫీసర్ బాటిల్ ఎత్తి తాగుతుండగా అభిమానులు సెల్ఫీలతో హోరెత్తించారు. పోలీస్ అధికారి డ్రింక్ తాగుతున్నంత సేపు పవన్ కల్యాణ్ సైలెంట్‌గా నిలబడి చూస్తుండిపోయారు.

నాయకత్వ లక్షణాలకు నిదర్శనం: పవన్ కల్యాణ్ చూపిన మానవత్వాన్ని అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో పవన్ కల్యాణ్ చూపించే ప్రేమ అతడిలోని ఉన్నత లక్షణాలను చూపిస్తాయి. డీహైడ్రేట్ అయిన పోలీస్ అఫీసర్‌కు ఎనర్జీ డ్రింక్ ఇచ్చి ఆదుకోవాలనే ఆయన తీరు ప్రజలపై ఉండే ప్రేమను తెలియజెప్పింది. పోలీసును చూసుకొన్న విధానం అతడిలోని నాయకత్వ లక్షణాలకు నిదర్శనం అని కామెంట్ చేస్తున్నారు.
రైతులతో మమేకమైన పవన్ కల్యాణ్: రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ పర్యటన ఆద్యంతం ఆసక్తికరంగా, ఉద్వేగంగా సాగింది. రైతులతో నేరుగా కష్టాలను, సమస్యలను అడిగి తెలుసుకొన్న తీరు ఆకట్టుకొన్నది. ప్రభుత్వం ఎలాంటి సహకారం అందిస్తుందని రైతులను అడుగగా.. ధాన్యం మొలకెత్తుతున్నా.. ఎలాంటి సహాయం అందించలేదంటూ సమాధానం వినిపించింది. జనసేన అధినేత పర్యటనతో గోదావరి జిల్లా కేడర్‌లో ఉత్సాహం రెట్టింపైనట్టు కనిపించింది.


Click it and Unblock the Notifications











