పార్టీని నడిపేందుకు సినిమాల్లో నటిస్తున్నా..వేల కోట్లు దోచేస్తూ, సూట్‌కేస్ కంపెనీలు..సీఎంపై పవన్ కల్యాణ్ ధ్వజం
వరాహి విజయ యాత్రలో భాగంగా సినీ నటుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేపట్టిన యాత్ర గోదావరి జిల్లాలోని కత్తిపూడికి చేరుకొన్నది. పవన్ కల్యాణ్ యాత్రకు అభిమానులు, జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అశేష జనవాహిని తరలి రాగా కత్తిపూడి గ్రామంలో పవన్ కల్యాణ్ సభను నిర్వహించారు. ఈ సభలో అధికార ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..
ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం నిస్వార్ధంగా పనిచేయాల్సిన నేతలు కావాలి. జనసేన కేంద్ర కార్యాలయం ఏపీలో ఉంటుంది. రాజకీయాలను మొత్తం ఏపీ నుంచే చేస్తాం. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చాను. నన్ను ఒంటరిగా పోటీ చేయమని అంటున్నారు. నేను ఒంటరిగా పోటీ చేస్తానా? పొత్తులతో పోటీ చేస్తానా అనేది నేను త్వరలో తేల్చి చెబుతాను అని పవన్ కల్యాణ్ అన్నారు.

క్లాస్ వార్ అంటూ ముఖ్యమంత్రి కామెంట్ చేస్తుంటాడు. క్లాస్ వార్ అంటే పేద, ధనిక వర్గాల మధ్య జరిగే పోరు. ముఖ్యమంత్రి ఆస్తుల చిట్టాను చూస్తే క్లాస్ వార్ నేను ఆయనతో చేయాలి. వేలకు వేల కోట్లు దోచేస్తూ... సూట్‌కేస్ కంపెనీలు పెడుతున్నాడు. నేను నటించిన సినిమాలు ఆపేయడం చూస్తే ఎవడు క్లాస్ వార్ చేస్తున్నారో అర్ధం చేసుకోవాలని పవన్ కల్యాణ్ అన్నారు.
2024 ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీ అడుగుపెట్టడం ఖాయం. భీమవరంలో లక్ష ఓట్లు ఉంటే.. లక్ష 8 వేల ఓట్లు పోలయ్యాయి. అందుకే నేను ఓటమి పాలయ్యాను అని పవన్ కల్యాణ్ అన్నారు. వైసీపీ ప్రభుత్వం లెక్కలేనన్నీ తప్పులు చేసింది. ఇసుక కుంభకోణంలో ప్రశ్నించినందుకు ఇంట్లో నా కూతురును అసభ్యంగా దూషించారు అని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
సినిమాల్లో నటించాలనే మోజు లేదు. జనసేన పార్టీని నడిపించడానికే సినిమాల్లో నటిస్తున్నాను. అప్పనంగా సంపాదించిన సొమ్ము, ఆస్తులు నా వద్ద లేవు. అధికారంలో లేం. మీకు ఆనందం పంచినందుకు మీరు ఇచ్చిన డబ్బు తప్ప మరో రకంగా ఆస్తులు లేవు. సినిమా టికెట్లపై కూడా దిగజారిన వ్యక్తిని మొదటి సారి చూస్తున్నా. నా సొంత బిడ్డల కోసం డిపాజిట్ చేసిన సొమ్ముతో పార్టీ ఆఫీస్ కట్టాను. నా బిడ్డలకు బదులు మిమ్మల్ని నేను బిడ్డలు అనుకొన్నాను అని పవన్ కల్యాణ్ అన్నారు.
నా జీవితంలో నేతాజి సుభాష్ చంద్ర బోస్, భగత్ సింగ్, రాజ్‌గురు నాకు స్పూర్తిని ఇచ్చారు. అలాగే చేగువేరా నాకు ఆదర్శం. అందుకే నేను ఈ యాత్రను చెగువేరా పుట్టిన రోజున ప్రారంభించాను. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయాలను ముందుకు తీసుకెళ్లి ఆంధ్రాను అభివృద్ది పథంలోకి తీసుకెళ్తాను అని పవన్ కల్యాణ్ అన్నారు.


Click it and Unblock the Notifications











