Pawan Kalyan Russia Tour: వాళ్లతో కలిసి రష్యా టూర్‌కు పవర్ స్టార్.. అప్పటి వరకూ అక్కడే ఎంజాయ్
'వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. అయితే, టికెట్ రేట్ల తగ్గింపు, ప్రతికూల పరిస్థితుల కారణంగా ఈ సినిమా కలెక్షన్లు మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదు. అయినప్పటికీ ఈ మూవీ ఎన్నో రికార్డులను సైతం బద్దలు కొట్టేసింది. ఇది పట్టాలపై ఉన్న సమయంలోనే పలు ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్న అతడు.. ఈ మూవీ రిజల్ట్‌తో మరిన్నింటిని పట్టాలెక్కించాడు. వాటిని ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ రష్యా టూర్ ప్లాన్ చేశాడు. ఆ వివరాలు మీకోసం!

‘భీమ్లా నాయక్'గా మారిన పవర్ స్టార్
పవన్ కల్యాణ్ ప్రస్తుతం 'భీమ్లా నాయక్' అనే సినిమాను చేస్తున్నాడు. రాణా దగ్గుబాటి ఇందులో కీలక పాత్రను చేస్తున్నాడు. సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలతో పాటు పర్యవేక్షణ చేయబోతున్నాడు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి.

దాని మీదే ఫోకస్... సంక్రాంతికి సిద్ధం
మలయాళంలో సూపర్ హిట్ అయిన 'అయ్యప్పనుమ్ కోషియం' భీమ్లా నాయక్ మూవీ రీమేక్‌గా వస్తోంది. ఇగో ఉన్న ఓ పవర్‌ఫుల్ పోలీసుగా పవన్ కల్యాణ్.. లోకల్ డాన్ రోల్‌లో దగ్గుబాటి రానా కనిపించనున్నారు. దీన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకే తన డేట్స్ మొత్తం కేటాయించాడు పవన్ కల్యాణ్.

భీమ్లా నాయక్‌ను పూర్తి చేసిన పవన్
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'భీమ్లా నాయక్' మూవీ షూటింగ్ చాలా రోజులుగా జరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాలోని తన పార్ట్‌ను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పూర్తి చేసుకున్నాడని ఓ న్యూస్ బయటకు వచ్చింది. అయితే, డబ్బింగ్ వర్క్ మాత్రం ఇంకా మొదలు పెట్టలేదట. త్వరలోనే దాన్ని కూడా ఆయన కంప్లీట్ చేస్తాడని టాక్.

‘హరిహర వీరమల్లు' కోసం రెడీగానే
ప్రస్తుతం పవన్ కల్యాణ్ చేస్తున్న చిత్రాల్లో 'హరిహర వీరమల్లు' ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాను ఏఎమ్ రత్నం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. మొగల్ కాలం నాటి కథతో రాబోతున్న ఈ సినిమాలో పవర్ స్టార్ వజ్రాల దొంగగా నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ నెల చివరి నుంచి ఈ మూవీ షూట్‌లో పవన్ పాల్గొంటాడట.

వాళ్లతో కలిసి రష్యా టూర్‌కు పవర్ స్టార్
ఇప్పటికే 'భీమ్లా నాయక్' షూటింగ్‌ను పూర్తి చేసుకున్న పవన్ కల్యాణ్.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోన్న ఓ దీక్షలో పాల్గొంటున్నాడు. దీని తర్వాత కొన్ని సమీక్షలు కూడా నిర్వహిస్తాడట. అవి అయిపోయిన వెంటనే పవర్ స్టార్.. తన భార్య, పిల్లలతో కలిసి రష్యా టూర్ వెళ్లబోతున్నాడని తెలిసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్లాన్ కూడా రెడీ అయిందట.

అప్పటి వరకూ అక్కడే ఉండి ఎంజాయ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజ్నేవాది రష్యానే అన్న విషయం తెలిసిందే. ఆమె ప్రతి సంవత్సరం క్రిస్టమస్‌కు తన పుట్టింటికి వెళ్తుంటుంది. ఆమెతో పాటు పవన్ కల్యాణ్ కూడా వెళ్తుంటాడు. ఇప్పుడు కూడా వీళ్లు తమ పిల్లలను తీసుకుని మరికొద్ది రోజుల్లోనే రష్యా ఫ్లైట్ ఎక్కబోతున్నారు. క్రిస్టమస్ అయ్యేంత వరకూ వీళ్లంతా అక్కడే ఉంటారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











