పవన్ కళ్యాణ్ దెబ్బకు సల్మాన్, విజయ్ దేవరకొండ వెనక్కి తగ్గక తప్పదా?
పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ 'హరి హర వీరమల్లు'. 'వకీల్ సాబ్' తర్వాత #PSPK27 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ చేయబడిన ఈ సినిమా వివిధ కారణాలతో ఆలస్యమవుతూ వచ్చింది. ఏళ్లు గడుస్తున్నాయి కానీ, దర్శకులు మారుతున్నారు కానీ.. ఈ చిత్రం ఎప్పుడు వస్తుందా? అనే దానిపై మాత్రం ఎవరికీ క్లారిటీ లేకుండా పోయింది. అలాంటి టైంలో మేకర్స్ ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి, పనిలో పనిగా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. ఈ ప్రకటనతో పవర్ స్టార్ ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు కానీ, రౌడీ ఫ్యాన్స్ మాత్రం నిరుత్సాహానికి గురవుతున్నారు. కారణమేంటంటే?
'హరి హర వీరమల్లు' పార్ట్-1 చిత్రాన్ని 2025 మార్చి 28న ప్రపంచ వ్యాప్తంగా ధియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఎట్టకేలకు రిలీజ్ డేట్ వచ్చినందుకు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. ఉగాది, రంజాన్, శ్రీరామ నవమి లాంటి ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి, మంచి రిలీజ్ డేట్ దొరికిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాకపోతే అదే తేదీ మీద ఆల్రెడీ హీరో విజయ్ దేవరకొండ కర్చీఫ్ వేసున్నారు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న 'VD 12' చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 28న థియేటర్లలోకి తీసుకొస్తామని ఆ మధ్య అఫీషియల్ గా వెల్లడించారు.

'హరి హర వీరమల్లు' సినిమా విడుదల తేదీ ప్రకటనతో పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ మధ్య బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ నెలకొంటుందని అభిమానులు భావిస్తున్నారు. దీనికి తోడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, డైరెక్టర్ మురగదాస్ కాంబోలో తెరకెక్కుతున్న 'సికిందర్' సినిమాని కూడా 2025 ఈద్ కి రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇది హిందీ చిత్రం అయినప్పటికీ, పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సౌత్ సినిమాలకు పోటీగా మారే అవకాశం ఉంటుంది.

కాకపోతే పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ మధ్య బాక్సాఫీస్ క్లాష్ ఏర్పడే అవకాశాలు చాలా తక్కువనే అనుకోవాలి. ఎందుకంటే పవన్ కు అత్యంత సన్నిహితులైన సితార నిర్మాతలు 'VD 12' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయన కోసం విడుదల తేదీని వదులుకుంటారే తప్పితే, ఆయనతో క్లాష్ కు వెళ్లరని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి వీరమల్లు కోసం రౌడీ బాయ్ కాస్త వెనక్కి తగ్గి, వచ్చే ఏడాదిలో ఇంకో మంచి డేట్ ను వెతుక్కోవాల్సి ఉంటుంది. అయినప్పటికీ పవర్ స్టార్ తన పాన్ ఇండియా మూవీతో బాక్సాఫీస్ వద్ద సల్లూ భాయ్ ని ఢీకొట్టాల్సి ఉంటుంది. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.

'హరి హర వీరమల్లు' సినిమా క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ లో ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో పవన్ కల్యాణ్ కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ యాక్టర్ బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. మరోవైపు విజయ్ దేవరకొండ 12వ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











