OG Overseas Business: ఓవర్సీస్‌లో పవన్ కళ్యాణ్ మేనియా.. ఓజీ రైట్స్‌కి కళ్లు చెదిరే ధర
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా, ఏపీ డిప్యూటీ సీఎంగా క్షణం తీరిక లేకుండా ఉన్నారు. రాజకీయాలతో పాటు పాలనా వ్యవహారాల్లో తలమునకలై ఉన్న పవన్ .. వరుస రివ్యూలు, క్షేత్రస్థాయి పర్యటనలతో తన మార్క్ చూపిస్తున్నారు. ప్రజలకు ఏదో ఒక మేలు చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ తన ఆశయ సాధన కోసం నిరంతరాయంగా కష్టపడుతున్నారు. పదేళ్లుగా నిన్ను ఇలా చూడాలని ఎన్నో కలలు కన్నాం అన్నా అంటూ పవర్‌స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెడుతూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఉన్నత స్థానానికి చేరుకోవడంతో సంతోషపడుతున్నా.. అభిమానుల్లో ఏదో బాధ. కారణం.. తమ అభిమాన నటుడిని తిరిగి వెండితెరపై చూస్తామో , లేదో అనే ఆలోచన.
చివరిసారిగా బ్రో సినిమాలో మేనల్లుడు సాయిథరమ్ తేజ్‌తో కలిసి తెరపై కనిపించిన పవన్ కళ్యాణ్ .. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకే అంకితమైపోయారు. అభ్యర్ధుల ఎంపిక, ప్రచారం.. ఫలితాల తర్వాత డిప్యూటీ సీఎంగా పగ్గాలు అందుకున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో తాను సినిమాలు చేస్తే జనంలోకి తప్పుడు సంకేతాలు వెళ్లడంతో పాటు ప్రత్యర్ధులకు తనపై బురదజల్లే అవకాశం ఉంటుందనే భయంతో పవన్ కళ్యాణ్ వెనక్కి తగ్గుతున్నారు. అయితే ఇప్పటికే తాను కమిటైన హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలను కంప్లీట్ చేయాలని డిప్యూటీ సీఎం భావిస్తున్నారు.

వీటిలో ఓజీ చాలా వరకు కంప్లీట్ అయ్యింది.. కేవలం పవన్ చేయాల్సిన సీన్లే ఉన్నాయని ఫిలింనగర్ టాక్. అందుచేత .. పరిస్ధితులు కుదుటపడిన తర్వాత ఫస్ట్ దీనిని ఫినిష్ చేయాలని జనసేనాని ప్లాన్ చేస్తున్నారు. వారంలో ఒకటి రెండ్రోజులు లేదంటే నెలలో వరుసగా నాలుగైదు రోజులు కాల్షీట్లు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. ఓజీ చిత్రానికి సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్‌లో నటిస్తున్నారు.
ఇందులో పవర్‌స్టార్.. ఓ గ్యాంగ్‌స్టర్ రోల్‌లో కనిపించబోతున్నారని టాక్. గతంలో విడుదలైన గ్లింప్స్, పవన్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. అంతేకాదు.. ఓజీ పవన్ కెరీర్‌లోనే తొలి పాన్ ఇండియా మూవీ. పవర్‌స్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని సెప్టెంబర్ 2న ఓజీ టీజర్ కానీ, సర్‌ప్రైజ్ అప్‌డేట్ కానీ వచ్చే అవకాశం ఉందని ఫిలింనగర్‌లో చర్చ జరుగుతోంది. స్వతహాగా పవన్ సినిమా హాట్ కేక్ వంటిది.. థ్రియేటికల్ రైట్స్, మ్యూజిక్ రైట్స్ వంటి ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో రికార్డులు సృష్టించిన చరిత్ర పవన్ సొంతం.

ఈ నేపథ్యంలో ఓజీ ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓజీ ఓవర్సీస్ రైట్స్‌ను రూ.13 కోట్లకు పార్శ్ ఫిల్మ్ సొంతం చేసుకుందన్నది ఆ వార్త సారాంశం. దీంతో పవన్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఓజీ ఓవర్సీస్ మార్కెట్‌లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 3.3 మిలియన్ డాలర్ల వసూళ్లను రాబట్టాల్సి ఉంది. అయితే పవన్ మూవీకి పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్ల సునామీయే అన్నది అందరికీ తెలిసినదే.


Click it and Unblock the Notifications











