AP Elections 2024 ఫ్యామిలీకి ద్రోహం చేసిన వారికి ఓటు వేయకండి.. వారినే ఎన్నుకోండి.. మంచు మనోజ్
చిత్తూరు జిల్లా తిరుపతికి సమీపంలోని మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) స్నాతకోత్సవం ఘనంగా జరిగింది. ప్రముఖ నటుడు మోహన్ బాబు జన్మదినం సందర్భంగా జరిగిన ఉత్సవంలో మలయాళ నటుడు మోహన్ లాల్, నటుడు ముఖేష్ రుషి, ఇతర రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకలో యూనివర్సిటీ విద్యార్థులు, ఇతరులు వేల సంఖ్యలో పాల్గొన్నారు.
తన తండ్రి మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మార్చి 19న కన్నప్ప స్టోరీ బుక్ వాల్యూమ్ 1ను మంచు విష్ణు లాంచ్ చేశారు. ఇది భక్త కన్నప్ప పురాణ కథను కామిక్ రూపంలో చూపిస్తుంది. ఈ వినూత్న ప్రాజెక్ట్ కన్నప్ప కథను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అని తెలిపారు. ఇదిలా ఉండగా, ఈ వేడుకలో మంచు మనోజ్ చేసిన ప్రసంగం అందర్నీ ఆలోచింప చేసేలా ఉంది. ఆ స్పీచ్ వివరాల్లోకి వెళితే..
స్థానికంగా ఉన్న రాజకీయ, సామాజిక పరిస్థితులు మీకు తెలుస్తాయి. వాటిని క్షుణ్ణంగా విశ్లేషించండి. మీకు సేవ చేసే గుణం ఉన్న కరెక్ట్ లీడర్‌ను చూడండి. పది మందిని కలుపుకొని వెళ్లే నాయకుడిని ఎంచుకొండి. వాళ్ల ఫ్యామిలికి సహాయం చేయని వాళ్లు.. వాళ్ల చుట్టు పక్కల వాళ్లకు హెల్ప్ చేయని మీకేం సహాయం చేస్తారు. అలాంటి వారిని జాగ్రత్తగా గమనించి.. అలాంటి వారిని గుర్తు పెట్టుకొని ఓటు వేయండి అని మంచు మనోజ్ అన్నారు.

ఎలాంటి రాజకీయ నేత వస్తే మీకు, మీ చుట్టు పక్కల ఉన్న పేదవారికి మేలు జరుగుతుందో తెలుసుకొని ఓటు వేయండి. డబ్బు బాగా ఉండి.. ఇచ్చారని వాళ్లకు ఓటు వేయకండి. డబ్బు ఇస్తే తీసుకోండి. కానీ థ్యాంక్యూ అని చెప్పి మీకు నచ్చిన వారికి, మీకు మేలు చేసిన వారికి ఓటు వేయండి అని చెప్పగానే.. విద్యార్థుల నుంచి భారీ స్పందన వచ్చింది.

ఇక పుట్టిన రోజును జరుపుకొంటున్న తండ్రి మోహన్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మీ పాదాలకు నమస్కారం. థ్యాంక్యూ నాన్న.. హ్యాపీ బర్త్ డే. మోహన్ లాల్ సార్.. ఈ వేడుకలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు అంటూ మనోజ్ వేదికపై నుంచి నమస్కారం చేశారు. అయితే మనోజ్ చేసిన ప్రసంగం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నది.


మంచు మనోజ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి చేసినవనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. వైఎస్ ఫ్యామిలీతో బంధుత్వం ఉన్న మంచు కుటుంబానికి ఇటీవల కాలంలో కొంత దూరం పెరిగింది. గతంలో వైస్ జగన్ ప్రభుత్వంపై మోహన్ బాబు కూడా విమర్శలు చేయడం తెలిసిందే. తాజాగా విద్యార్థులను ఉద్దేశించి మంచి ప్రభుత్వాన్ని, నాయకులను ఎంచుకోండి అని పిలుపు ఇవ్వడంతో ఆయన ప్రసంగం ఆసక్తికరంగా మారింది.

మంచు మనోజ్ కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో సినిమాలకు పూర్తిగా దూరం అయ్యారు. భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి కుమార్తెను వివాహం చేసుకోవడంతో మరోసారి మీడియాలో హైలెట్ అయ్యారు. ఈ మధ్యనే ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











