Prabhas: ప్రభాస్‌కు అరుదైన గౌరవం... తొలి ఇండియన్ స్టార్‌గా సరికొత్త రికార్డు!
Prabhas: పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ స్టార్‌గా ఎదిగిన నటుడు ప్రభాస్. రెబల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ 'బాహుబలి'తో పాన్ ఇండియా సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. ఆ తర్వాత ఆయన నుంచి వచ్చిన సినిమాకు కూడా పాన్ ఇండియా రేంజులో ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాయి. సినిమా సినిమాకీ తన రేంజు పెంచుకుంటూ పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ హీరో స్థాయికి చేరుకున్నారు. కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లోనూ స్టార్‌డమ్ సంపాదించకున్నారు. ఈ క్రమంలో అంతర్జాతీయంగా ఎన్నో రికార్డులు తన సొంతం చేసుకున్న ప్రభాస్.. తాజాగా మరో అరుదైన గౌరవం అందుకున్నారు. ఇంతకీ ఆ అరుదైన గౌరవం ఏంటీ?
ప్రభాస్ నటుడిగా మాత్రమే కాదు, బ్రాండ్‌గా మారారు. తాజాగా ప్రభాస్ మరో అరుదైన అంతర్జాతీయ ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు. జపాన్‌కు చెందిన ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్ అనన్ (Anan) బ్యాక్ కవర్‌పై సోలోగా ఫీచర్ అయిన తొలి భారతీయ నటుడిగా ప్రభాస్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ గౌరవం చూస్తే.. "డార్లింగ్ రేంజ్ వేరబ్బా" అనిపిస్తున్నారు. ఇది కేవలం వ్యక్తిగత విజయమే కాదు.. భారతీయ సినిమా గ్లోబల్ స్థాయికి చేరిందనడానికి మరో ఉదాహరణగా సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ఈ నెల 10న విడుదల కానున్న అనన్ మ్యాగజైన్ ఇష్యూ నెంబర్ 2483 బ్యాక్ కవర్‌పై ప్రభాస్ ఫోటో దర్శనమివ్వనుంది. గతంలో RRR జపాన్‌లో విడుదలైన సమయంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి ఈ మ్యాగజైన్ కవర్‌పై కనిపించారు. కానీ, ఈసారి ఒంటరిగా ఆ స్థానం దక్కించుకున్న తొలి భారతీయ నటుడిగా ప్రభాస్ పేరు చరిత్రలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణను ముఖ్యంగా జపాన్ ప్రేక్షకుల్లో ఆయనకు ఏర్పడిని అభిమానాన్ని అందులో ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ కవర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు "డార్లింగ్ రేంజ్ వేరే లెవెల్" అంటూ సంబరాలు చేస్తున్నారు. కవర్ ఫోటో షూట్ డిసెంబర్ 2025లో టోక్యోలో జరిగినట్లు సమాచారం. అప్పట్లో ప్రభాస్ తన సినిమాల ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లి అభిమానులను కలుసుకున్నారు. "చివా" అంటూ జపాన్ భాషలో అభిమానులను పలకరించడం అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అదే సమయంలో ఈ మ్యాగజైన్ షూట్ కూడా జరిగినట్టు తెలుస్తోంది.
జపాన్‌లో ప్రభాస్‌కు ఈ స్థాయి గుర్తింపు రావడానికి ప్రధాన కారణం బాహుబలి 1 (Baahubali: The Beginning). ఆ సినిమా అక్కడ విడుదలైన తర్వాత ప్రభాస్‌కు భారీ ఫ్యాన్‌బేస్ ఏర్పడింది. అప్పటి నుంచే ఆయన సినిమాలు జపాన్‌లో కూడా విడుదలవుతూ మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇటీవల వచ్చిన కల్కి 2898 AD కూడా అక్కడ అదే రేంజ్ లో విజయం సాధించింది. ఇలా వరుస పాన్ ఇండియా సినిమాతో అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్నారు.
వరుస సినిమాలతో బిజీ డార్లింగ్
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో'ఫౌజీ'సినిమా షూటింగ్‌లో ఉన్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్'సినిమాలో కూడా నటిస్తున్నారు. త్వరలోనే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి 2' సినిమా పనులు కూడా మొదలయ్యే అవకాశం ఉంది.
మరోవైపు, ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలైన ది రాజా సాబ్ థియేటర్లలో మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఆ సినిమా ఫిబ్రవరి 6 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇలా ఒకవైపు అంతర్జాతీయ గుర్తింపు, మరోవైపు వరుస సినిమాలతోడార్లింగ్ క్రేజ్ రోజురోజుకీ మరింత పెరుగుతూనే ఉంది. అభిమానుల మాటల్లో చెప్పాలంటే... ఇది ప్రభాస్ టైమ్!


Click it and Unblock the Notifications











