చరిత్ర సృష్టించడానికి ప్రభాస్ సిద్ధం.. రికార్డుస్థాయిలో జపాన్‌లోకి!
బాహుబలి: ది కన్‌క్లూజన్ మూవీ ప్రభంజనం ఇంకా ఓ వైపు కొనసాగుతుండగా ప్రభాస్ మరోసారి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రతిష్టాత్మక యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న సాహో చిత్రం అరుదైన రికార్డుకు చేరువ కాబోతున్నది. దర్శకుడు సుజిత్ రెడ్డి డైరెక్షన్‌లో రూపొందుతున్న సాహో చిత్రం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొంటూ విడుదలకు ముస్తాబవుతున్నది. రిలీజ్‌కు ముందే సాహో సినిమా గురించి జపాన్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. అదేమిటంటే..

జపాన్‌లో కొనసాగుతున్న బాహుబలి క్రేజ్
ప్రస్తుతం బాహుబలి2 సినిమాకు జపాన్‌లో బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రం అక్కడ 100 రోజులకుపైగా ప్రదర్శింపబడుతుంటం విశేషం. సినిమా రిలీజైన రెండేళ్లు దాటుతున్నప్పటికీ ఇంకా జపాన్‌లో విశేష ఆదరణ లభిస్తున్నది. ప్రభాస్, రానా నటనకు ముగ్దులైన జపాన్ ప్రేక్షకులు జై భళ్లాలదేవ.. జై బాహుబలి అంటూ ఏకంగా ఆ సినిమా క్యాస్టూమ్స్ ధరించి సినిమాకు రావడం చర్చనీయాంశమైంది.

జపాన్ భాషలోకి సాహో డబ్
బాహుబలి తర్వాత ప్రభాస్‌కు జపాన్‌లో విపరీతమైన క్రేజ్ మాత్రమే కాకుండా మార్కెట్ కూడా ఏర్పడింది. దాంతో చిత్ర నిర్మాతలు ఈ చిత్రాన్ని జపాన్ భాషలో డబ్ చేసి వచ్చే ఏడాది ఆరంభంలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందుకనుగుణంగా ఈ సినిమాను జపాన్ వ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు అడుగులేస్తున్నారు.

రికార్డుస్థాయిలో జపాన్ ప్రీ రిలీజ్ బిజినెస్
ట్రేడ్ వర్గాల రిపోర్టు ప్రకారం.. సాహోకు సంబంధించిన జపాన్ ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డుస్థాయిలో జరిగిందనే విషయం బయటకు పొక్కింది. భారీ ధరకు జపాన్ హక్కులు అమ్ముడుపోయినట్టు తెలుస్తున్నది. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్ కోసం ప్రభాస్ జపాన్‌లో పర్యటించే అవకాశం ఉంది.

హాలీవుడ్‌కు ధీటుగా వీఎఫ్ఎక్స్ పనులు
ప్రస్తుతం సాహో చిత్రానికి సంబంధించిన వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్ పనులు హాలీవుడ్‌లో జరుగుతున్నట్టు సమాచారం. అంతర్జాతీయ చిత్రాలకు ధీటుగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. కేవలం ఇంటర్వెల్ సీన్ కోసమే రూ.30 కోట్లు ఖర్చు చేయడం ఇండస్ట్రీలో టాక్‌గా మారింది.

ఆగస్తు 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్
స్వాతంత్ర్య పోరాట నేపథ్యంగా తెరకెక్కుతున్న సాహో సినిమా ఇండిపెండెన్స్ డే సందర్బంగా ఆగస్టు 15 తేదీన రిలీజ్ కానున్నది. జాతీయ ప్రాజెక్టుగా రూపొందిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్దాకపూర్, నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, మందిరా బేడి, చుంకీ పాండే, ఎవ్లీన్ శర్మ, అరుణ్ విజయ్, మురళీశర్మ వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











